వ్యర్థాల నిర్వహణపై అధ్యయనం..వరంగల్లో వలంటీర్లకు శిక్షణ ప్రారంభం

వ్యర్థాల నిర్వహణపై అధ్యయనం..వరంగల్లో వలంటీర్లకు శిక్షణ ప్రారంభం

వరంగల్​సిటీ, వెలుగు: నగర ఘన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను మెరుగుపరిచేందుకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, చెన్నైకి చెందిన ఎం.ఎస్. స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ సంయుక్తంగా గురువారం నగరవ్యాప్త అధ్యయనానికి శ్రీకారం చుట్టాయి. వెల్‌‌కమ్ ట్రస్ట్ (యూకే) ఆర్థిక సహకారంతో చేపడుతున్న నాలుగేళ్ల పరిశోధన, కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా ఈ అధ్యయనం నిర్వహిస్తున్నారు. చెన్నై, వరంగల్ నగరాల్లో ప్రజారోగ్యం, వ్యర్థాల నిర్వహణ వ్యవస్థలను శాస్త్రీయ ఆధారాలతో బలోపేతం చేయడం దీని ప్రధాన ఉద్దేశం. ఇందులో భాగంగా నగరంలోని 90 ఇళ్లతో పాటు మార్కెట్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, పాఠశాలలు, కార్యాలయాలు, ఆస్పత్రులు, బహిరంగ ప్రదేశాల్లో సర్వే నిర్వహించనున్నారు. 

వ్యర్థాల ఉత్పత్తి, సేకరణ, వర్గీకరణ, పునర్వినియోగం, రీసైక్లింగ్, పారవేత తీరును అధ్యయనం చేయనున్నారు. దీంతో చెత్త సేకరణలో లోపాలు, రీసైక్లింగ్ స్థాయిలు, మౌలిక సదుపాయాల అవసరాలపై స్పష్టత రానుంది. తద్వారా మెరుగైన పారిశుధ్య సేవలు, భవిష్యత్తు అభివృద్ధి పనులకు బల్దియా ప్రణాళికలు రూపొందించేందుకు ఉపయోగపడనుంది. సర్వేయర్ల కోసం వరంగల్‌‌లోని దివ్యదీప్తి భవన్‌‌లో స్వయం సహాయక సంఘాల సభ్యులు, కాకతీయ యూనివర్సిటీ సోషల్ వర్క్ విద్యార్థి వలంటీర్లకు రెండు రోజుల శిక్షణ ఇస్తున్నారు. మొత్తం అధ్యయనాన్ని ఏడు వారాల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కార్యక్రమంలో బల్దియా ఆరోగ్యాధికారి డా. మల్లం రాజేష్, డా.వెంకటేశ్వర్ రావు, డా. సబా, రాజమోహన్ రెడ్డి, ఓంప్రకాశ్, అవినాశ్, సాయి, అనురాధ, తనిషి, అరవింద్, హరీశ్, శానిటరీ ఇన్‌‌స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.