ఏఐ రంగంలో కస్టమర్లను సంపాదించుకోవడానికే కొత్త స్టార్టప్‌లు నానా తంటాలు పడుతుంటే.. కేవలం రెండేళ్లలోపే వేల కోట్లు విలువైన కంపెనీని నిర్మించి అందరినీ ఆశ్చర్యపరిచాడు భారత సంతతికి చెందిన 23 ఏళ్ల పారిశ్రామికవేత్త. ఓపెన్ఏఐలో పనిచేసిన అనుభవంతో స్థాపించిన 'అప్లైడ్ కంప్యూట్' అనే స్టార్టప్‌ను ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ పాలో ఆల్టో నెట్వర్క్స్ ఏకంగా 4.5 బిలియన్ డాలర్లకు అంటే మన కరెన్సీలో దాదాపు రూ.40వేల కోట్లకు కొనుగోలు చేయడానికి సిద్ధమైంది. ఈ భారీ ఆల్-స్టాక్ డీల్ టెక్ ప్రపంచంలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
మే 2025లో యష్ పాటిల్ మరో ఇద్దరు మాజీ ఓపెన్ఏఐ ఉద్యోగులు రిథమ్, లిండన్లతో కలిసి అప్లైడ్ కంప్యూట్‌ను ప్రారంభించారు. బయటి ఏఐ సేవలపై పూర్తిగా ఆధారపడకుండా.. కంపెనీలు తమ సొంత డేటాతో కస్టమ్ ఏఐ మోడళ్లను శిక్షణ ఇచ్చి, రోజువారీ కార్యకలాపాల్లో వినియోగించుకునేలా చూడటమే ఈ కంపెనీ ప్రధాన లక్ష్యం. ఈ డీల్ పూర్తయ్యాక యష్ పాటిల్ పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌లో కో-చీఫ్ ఏఐ ఆఫీసర్‌గా కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. వచ్చే ఏడాది ఈ డీల్ పూర్తి కానుంది.
యష్ పాటిల్ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే.. ఆయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్ పట్టా పొందారు. విద్యార్థి దశ నుంచే స్టార్టప్‌లపై ఆసక్తి చూపుతూ.. ఈ-కామర్స్ వెబ్సైట్ల కోసం మెషిన్ లెర్నింగ్ టూల్స్ అందించే 'ఆర్మాడిల్లో ల్యాబ్స్' వంటి ప్రాజెక్టులపై పనిచేశారు. స్టాన్ఫోర్డ్ వార్షిక హ్యాకథాన్ 'ట్రీహ్యాక్స్' కోసమూ పనిచేశారు. ఇక ఏఐ రంగంలో ఆయన ఏప్రిల్ 2023లో ఓపెన్ఏఐలో టెక్నికల్ స్టాఫ్ రెసిడెంట్‌గా చేరి పోస్ట్-ట్రైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై పనిచేశారు. అక్టోబర్‌లో ఫుల్-టైమ్ టెక్నికల్ పాత్రలోకి మారి కోడెక్స్ కోసం లాంగ్-హారిజన్ టాస్క్‌లపై పనిచేసి.. మే 2025లో సొంత కంపెనీ పెట్టుకునేందుకు బయటకు వచ్చారు.
అప్లైడ్ కంప్యూట్ తక్కువ సమయంలోనే అద్భుత వృద్ధిని సాధించింది. సున్నా నుంచి ప్రారంభమై కేవలం 18 నెలల్లోనే 100 మిలియన్ డాలర్ల వార్షిక రెవెన్యూ రన్-రేట్ మైలురాయిని దాటింది. ఇన్వెస్టర్ ఎలాడ్ గిల్ నేతృత్వంలో 3.25 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్ వద్ద 350 మిలియన్ డాలర్లు సమీకరించింది. మైక్రోసాఫ్ట్, షాపిఫై, డోర్‌డాష్, హార్వే, కాగ్నిషన్, క్లే, డెకాగాన్ వంటి దిగ్గజ సంస్థలు దీని క్లయింట్ల జాబితాలో ఉన్నాయి. ప్రారంభమైన 12 వారాల్లోనే రోజుకు ఒక ట్రిలియన్ టోకెన్లను ప్రాసెస్ చేసే స్థాయికి దీని ఇన్ఫెరెన్స్-సర్వింగ్ విభాగం ఎదిగింది.
ఏఐ మోడళ్ల శిక్షణ, నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలను అప్లైడ్ కంప్యూట్ అందిస్తుండగా, సైబర్ అటాక్స్ నుంచి వ్యాపారాలను కాపాడటంలో పాలో ఆల్టో నెట్వర్క్స్ నైపుణ్యం కలిగి ఉంది. వీరిద్దరి కలయికతో భద్రతతో కూడిన ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను సంస్థలకు అందించవచ్చని, ఏఐ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా మారేందుకే ఈ కొనుగోలు చేస్తున్నామని పాలో ఆల్టో సీఈఓ నికేష్ అరోరా తెలిపారు. ఓపెన్-వెయిట్ మోడళ్లపై దృష్టి సారించే అప్లైడ్ కంప్యూట్ వేగంగా ఎదగడానికి ఈ ఒప్పందం తోడ్పడుతుందని యష్ పేర్కొన్నారు.
