తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాడిపత్రి పట్టణంలో టెన్షన్ వాతావరణం కనిపించింది. శుక్రవారం ఉదయం తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై జేసీ అనుచరులు దాడికి పాల్పడటంతో తాడిపత్రి భగ్గుమంది. కార్లు, ద్విచక్ర వాహనాలను తగలబెట్టారు. ఇంటి దగ్గర ఎవరూ లేకపోవడంతో టీడీపీ మద్దతుదారులు పెద్దారెడ్డి ఇంటిని టార్గెట్ చేశారు. ఇందుకు కౌంటర్‌గా పెద్దారెడ్డి వర్గీయులు కూడా రాళ్లతో ప్రతిదాడులకు దిగారు. ఇరు వర్గాలు పెట్రోల్ బాంబులతో దాడులు చేసుకున్నారు.
ఈ ఘటనతో శుక్రవారం ఉదయం తాడిపత్రి టౌన్లో పరిస్థితి పూర్తిగా అదుపుతప్పింది. ఈ దాడులపై పెద్దారెడ్డి మాట్లాడుతూ.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దౌర్జన్యంగా రిగ్గింగ్ చేసుకుందని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా సేమ్ సీన్ రిపీట్ అయిందని చెప్పారు.
ఈ క్రమంలో.. సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఈ తరహా దాడులకు పాల్పడి గెలవాలని, వైసీపీ అభ్యర్థులను పోటీలోనే లేకుండా చేయాలని చూస్తూ.. టీడీపీ అడ్డదారులు తొక్కుతుందని ఆయన మండిపడ్డారు. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయకుండా తన వర్గీయుల్లో భయాందోళన కలిగించేందుకు ఇంటి మీద దాడులకు తెగబడ్డారని ఆయన చెప్పారు. ఇలాంటి దాడులకు భయపడి వెనకడుగు వేసే ప్రసక్తే లేదని పెద్దారెడ్డి స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా.. తనకూ, ఈ దాడులకు ఎలాంటి సంబంధం లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు. తాడిపత్రిలో ప్రజలు పెద్దారెడ్డిని వ్యతిరేకిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. తాడిపత్రి పట్టణంలో శాంతిభద్రతలు అదుపు తప్పకుండా చూసుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. తాడిపత్రి టౌన్‌లోని ప్రధాన కూడళ్లలో భారీగా పోలీసులు మోహరించారు.
