సినీ ఇండస్ట్రీలో దశాబ్దాలుగా కోట్లాది మంది అభిమానులను తన నటన, స్టైల్ తో అలరిస్తున్న బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కు ప్రపంచ సినీ చరిత్రలోనే అరుదైన గుర్తింపు దక్కింది. ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ 'వెరైటీ' ప్రకటించిన '100 గ్రేటెస్ట్ మూవీ స్టార్స్ ఆఫ్ ఆల్ టైమ్' జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ నటుడిగా షారుఖ్ ఖాన్ చరిత్ర సృష్టించారు. ఈ జాబితాలో ఆయనకు 92వ స్థానం లభించింది. ఈ జాబితాలో షారుఖ్‌కు ప్రాతినిధ్యం వహించే చిత్రంగా సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన 'దేవదాస్'ను వెరైటీ ఎంపిక చేసింది.
ఈ జాబితాలో హాలీవుడ్ అందాల తార మార్లిన్ మన్రో అగ్రస్థానంలో నిలవగా.. హంఫ్రీ బోగార్ట్ రెండో స్థానంలో, చార్లీ చాప్లిన్ మూడో స్థానంలో నిలిచారు. జాక్ నికల్సన్, కేథరిన్ హెప్బర్న్, సిడ్నీ పోయిటియర్, మార్లన్ బ్రాండో, టామ్ క్రూజ్, జపాన్ నట దిగ్గజం తోషిరో మిఫునే, బార్బ్రా స్ట్రీసాండ్ టాప్-10లో చోటు సంపాదించారు. సమకాలీన నటుల్లో జూలియా రాబర్ట్స్ 13వ స్థానంలో, రాబర్ట్ డౌనీ జూనియర్ 74వ స్థానంలో, ర్యాన్ గోస్లింగ్ 77వ స్థానంలో, టిమోతీ చలమెట్ 86వ స్థానంలో ఉన్నారు. షారుఖ్ కంటే వెనుక ఎమ్మా స్టోన్ (94), జెండయా (98) ఉండటం అభిమానులకు మరింత ఆనందాన్నిస్తోంది.
1980ల చివర్లో టెలివిజన్ సీరియళ్లతో కెరీర్ ప్రారంభించిన షారుఖ్ ఖాన్... 1992లో 'దీవానా'తో వెండితెరపై హీరోగా అడుగుపెట్టారు. 'దిల్వాలే దుల్హనియా లే జాయేంగే', 'దిల్ సే', 'స్వదేశ్', 'చక్ దే ఇండియా', 'మై నేమ్ ఈజ్ ఖాన్' వంటి చిత్రాలతో తన నటనా వైవిధ్యాన్ని చాటుకున్నారు. 90కి పైగా సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన అభిమానగణాన్ని సంపాదించుకున్నారు.
►ALSO READ | Aakasamlo Oka Tara Review: ‘ఆకాశంలో ఒక తార’ ఫుల్ రివ్యూ.. దుల్కర్ మూవీ ఎలా ఉందంటే?
2018 నుంచి వరుస పరాజయాలతో కొంత విరామం తీసుకున్న షారుఖ్.. 2023లో 'పఠాన్', 'జవాన్', 'డంకీ' చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చారు. ముఖ్యంగా 'జవాన్'తో తన స్టార్డమ్కు భాషా హద్దులు లేవని నిరూపించారు. 2022లో ఎంపైర్ మ్యాగజైన్ ప్రకటించిన 50 గొప్ప నటుల జాబితాలోనూ ఏకైక భారతీయుడిగా నిలిచారు.
ఇప్పుడు అందరి చూపు షారుఖ్ తదుపరి చిత్రం 'కింగ్'పైనే ఉంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 2026 డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. కుమార్తె సుహానా ఖాన్ తొలిసారిగా థియేట్రికల్ సినిమాలో ఆయనతో కలిసి నటిస్తుండటం మరో ప్రత్యేక ఆకర్షణ. దీపికా పదుకొణె, అభిషేక్ బచ్చన్ తదితరులు కూడా ఈ చిత్రంలో కనిపించనున్నారు..
