వెల్లింగ్టన్ లోని బేసిన్ రిజర్వ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత ఓపెనర్లు యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal), కేఎల్ రాహుల్ (KL Rahul) ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. ఈరోజు (శుక్రవారం, నవంబర్ 20, 2026) రెండో రోజు ఆట ఆరంభంలో కాస్త ఆచితూచి ఆడిన ఈ జోడీ, ఆ తర్వాత కివీస్ పేసర్లపై విరుచుకుపడి కేవలం 27 ఓవర్లలోనే తొలి వికెట్‌కు 125+ పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పింది. యశస్వీ జైస్వాల్ 85 బంతుల్లో 81 రన్స్ తో దూకుడుగా ఆడుతుండగా, కేఎల్ రాహుల్ 80 బంతుల్లో 41 పరుగులతో అద్భుతమైన సహకారం అందిస్తున్నాడు. ఈ సెంచరీ భాగస్వామ్యంతో వీరిద్దరూ 32 ఏళ్ల నాటి అరుదైన రికార్డును బద్దలు కొట్టేశారు.
1994 తర్వాత కివీస్ గడ్డపై తొలి శతక భాగస్వామ్యం ఇదే:
న్యూజిలాండ్‌లోని స్వింగ్ పిచ్‌లపై టీమిండియా ఓపెనర్లు 100 పరుగుల భాగస్వామ్యం నిర్మించడం మామూలు విషయం కాదు.. టెస్టు క్రికెట్ చరిత్రలో కివీస్ గడ్డపై ఇండియా తరఫున తొలి వికెట్‌కు 100 లేదా అంతకంటే ఎక్కువ రన్స్ జోడించిన నాలుగో ఓపెనింగ్ జోడీగా జైస్వాల్, రాహుల్ రికార్డు పుస్తకాల్లోకి ఎక్కారు. చివరిసారిగా 1994 మార్చిలో హామిల్టన్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో నవజ్యోత్ సింగ్ సిద్ధూ, నయన్ మోంగియా జోడీ 102 పరుగులు చేసింది. అంతకుముందు 1981లో సునీల్ గవాస్కర్ - చేతన్ చౌహాన్ (114), 1990లో మనోజ్ ప్రభాకర్, డబ్ల్యూవీ రమణ్ (149*) మాత్రమే ఈ రికార్డు సాధించారు. సరిగ్గా 32 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ జైస్వాల్, రాహుల్ కివీస్ గడ్డపై టీమిండియాకు శతకంతో శుభారంభాన్ని అందించారు.
ALSO READ : వసీం అక్రమ్‌ను వెనక్కి నెట్టిన బుమ్రా.. SENA దేశాల్లో టాప్ ప్లేస్!
150 పరుగుల మార్క్ దాటితే ఆల్-టైమ్ రికార్డు వీరిదే:
ప్రస్తుతం 125+ పరుగుల భాగస్వామ్యంతో కొనసాగుతున్న యశస్వీ జైస్వాల్, కేఎల్ రాహుల్ మరో 25 రన్స్ జోడించి 150 మార్కును అందుకుంటే.. న్యూజిలాండ్ గడ్డపై టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా ఆల్-టైమ్ రికార్డు సృష్టిస్తారు. ఇప్పటి వరకు ఈ చరిత్ర మనోజ్ ప్రభాకర్, డబ్ల్యూవీ రమణ్ (149* పరుగులు, 1990 ఆక్లాండ్ టెస్టు) పేరిట ఉంది. ఇక ఓవరాల్‌గా (స్వదేశం, విదేశాల్లో కలిపి) న్యూజిలాండ్‌పై భారత్ తరఫున అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్య రికార్డు వినూ మన్కడ్ - పంకజ్ రాయ్ (413 పరుగులు, 1956 చెన్నై టెస్టు) పేరిట చెక్కుచెదరకుండా ఉంది.
A solid 100-run opening stand between vice-captain @klrahul and Yashasvi Jaiswal 👌👌 Live - https://t.co/SaMcNXtAVG #NZvIND https://t.co/BAZVofM4ru
— BCCI (@BCCI) November 20, 2026
