BCCI బిగ్ అప్‌డేట్.. 2027 వన్డే వరల్డ్ కప్‌లో రోహిత్, కోహ్లీ ఆడటం ఫిక్స్!

BCCI బిగ్ అప్‌డేట్.. 2027 వన్డే వరల్డ్ కప్‌లో రోహిత్, కోహ్లీ ఆడటం ఫిక్స్!

న్యూఢిల్లీ: భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli) 2027 వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup)లో ఆడటంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న 50 ఓవర్ల మెగా టోర్నీలో ఈ ఇద్దరు స్టార్లు ఆడటం దాదాపు ఖాయమైందని జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది. ఫిట్‌నెస్ సమస్యలు తలెత్తకపోతే, వారు కొనసాగాలని భావిస్తే తప్పకుండా దక్షిణాఫ్రికా విమానం ఎక్కుతారని బీసీసీఐ (BCCI) వర్గాలు స్పష్టం చేశాయి.

రో-కో జోడీపై బీసీసీఐ పూర్తి నమ్మకం: 

ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ముఖ్యంగా రోహిత్ నాలుగు ఇన్నింగ్స్‌లలో కేవలం 30 పరుగులు మాత్రమే చేయడంతో, అతడి భవిష్యత్తుపై బోర్డు కీలక నిర్ణయం తీసుకుంటుందని జోరుగా ప్రచారం జరిగింది. కానీ, ఫామ్ కంటే వారి అపార అనుభవానికే బీసీసీఐ పెద్దపీట వేస్తోంది. 

* సఫారీ పిచ్‌లపై వారి అవసరం ఎంతో ఉంది: దక్షిణాఫ్రికాలోని సవాలుతో కూడిన పిచ్‌లపై ఆడేందుకు రోహిత్, విరాట్ అనుభవం జట్టుకు అత్యంత కీలకమని సీనియర్ బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. దక్షిణాఫ్రికాలో మనకు హిట్ మ్యాన్, కింగ్ కోహ్లీ అవసరం ఉంది. వారు లేకుండా మనం అక్కడ గెలవలేము.. సఫారీ గడ్డపై వారి అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన స్పష్టం చేశారు.

* నిర్ణయం వారి చేతుల్లోనే: రోహిత్, విరాట్ ఇద్దరూ లెజెండ్స్.. ఎంతకాలం క్రికెట్ ఆడాలనేది వారే నిర్ణయించుకుంటారు.. 2027 వరల్డ్ కప్ ప్రచారానికి సంబంధించి, కఠినమైన దక్షిణాఫ్రికా పిచ్‌లపై వారి సేవలు జట్టుకు తప్పనిసరి అని మరో అధికారి వెల్లడించారు.