రోగాలు రాకముందే అలర్ట్! మురుగు నీటి పరీక్షలతో.. వ్యాధులపై ముందస్తు నిఘా

రోగాలు రాకముందే అలర్ట్! మురుగు నీటి పరీక్షలతో.. వ్యాధులపై ముందస్తు నిఘా
  • కేంద్ర ఆరోగ్య శాఖ కొత్త గైడ్‌‌‌‌ లైన్స్
  • మురుగు శుద్ధి కేంద్రాలు, ఓపెన్ నాలాలు, హాస్పిటల్స్, ఎయిర్‌‌‌‌ పోర్టుల్లో శాంపిల్స్ సేకరణ 
  • వారం లేదా 15 రోజులకోసారి పరీక్షలు..15కు పైగా వ్యాధికారకాలపై పర్యవేక్షణ
  • ల్యాబ్ ఫలితాలు వచ్చిన 48 గంటల్లోగా ఐహెచ్ఐపీ పోర్టల్​లో నమోదు

హైదరాబాద్, వెలుగు: హాస్పిటల్స్‌‌‌‌ లో కేసులు పెరగకముందే జనాల్లో వ్యాధుల వ్యాప్తిని గుర్తించే కొత్త విధానాన్ని కేంద్రం తీసుకొచ్చింది. మురుగు నీటిని పరీక్షించి ఒకటి నుంచి రెండు వారాల ముందే వైరస్, బ్యాక్టీరియా ఆనవాళ్లను పసిగట్టనున్నారు. ఇందుకోసం కేంద్ర ఆరోగ్య శాఖ జాతీయ మార్గదర్శకాలను విడుదల చేసింది.

హైదరాబాద్‌లోని సీఎస్ఐఆర్-సీసీఎంబీ నేతృత్వంలోని ఏపీఎస్ఐ- ఇండియా, కేంద్ర వ్యాధి నియంత్రణ సంస్థ (ఎన్సీడీసీ) కలిసి వీటిని రూపొందించాయి. గతంలో పోలియో నిర్మూలనలో, కొవిడ్ సమయంలో మురుగు నీటి పరీక్షలు ఎంతగానో ఉపయోగపడ్డాయని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్ కె. నందికూరి గురువారం తెలిపారు. ‘నేషనల్ వన్ హెల్త్ మిషన్’ లక్ష్యాలకు అనుగుణంగా మరిన్ని వ్యాధులకు ఈ నిఘాను విస్తరిస్తున్నట్లు చెప్పారు.

లక్షణాలు లేకున్నా.. హాస్పిటల్‌‌‌‌కు వెళ్లకపోయినా..

వ్యాధి సోకిన వారు హాస్పిటల్‌‌‌‌ కు వెళ్లకపోయినా, లక్షణాలు కనిపించకపోయినా వారిలోని వైరస్, బ్యాక్టీరియా బయటకు వస్తాయి. మలం, మూత్రం, చేతులు కడగడం, స్నానం, బట్టలు ఉతకడం ద్వారా ఇవి డ్రైనేజీల్లో కలుస్తాయి. అందుకే పట్టణాల్లోని మురుగు శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీలు), ఓపెన్ నాలాలు, హాస్పిటల్స్, ఎయిర్‌‌‌‌పోర్టుల వద్ద నీటిని పరీక్షించనున్నారు. ఈ విధానంలో పోలియో, కొవిడ్, ఫ్లూ, మంకీపాక్స్, మీజిల్స్, మంప్స్, రుబెల్లాపై నిఘా పెడతారు.

చిన్నారులు, వృద్ధుల్లో శ్వాసకోశ సమస్యలు తెచ్చే ఆర్ఎస్‌‌‌‌వీతో పాటు రోటావైరస్, అడినోవైరస్‌‌‌‌ను పరిశీలిస్తారు. కలుషిత నీరు, ఆహారంతో వచ్చే టైఫాయిడ్, పారాటైఫాయిడ్, కలరా, హెపటైటిస్-ఏ, ఈ వైరస్‌‌‌‌లను గుర్తిస్తారు. దోమలతో వచ్చే డెంగ్యూ, చికున్‌‌‌‌గున్యా, జికా, జపనీస్ ఎన్సెఫలైటిస్‌తో పాటు యాంటీబయాటిక్ మందులకు లొంగని బ్యాక్టీరియా (ఏఎంఆర్)ను పట్టుకుంటారు. జంతువుల నుంచి మనుషులకు వచ్చే ఫ్లూ, భవిష్యత్తులో రాబోయే కొత్త మహమ్మారులను (డిసీజ్-ఎక్స్) సైతం ముందే కనిపెడతారు.

శాంపిల్స్ సేకరణ నుంచి తక్షణ చర్యల దాకా..

వ్యక్తిగత సెప్టిక్ ట్యాంకులు, పెద్ద పరిశ్రమల వద్ద కాకుండా జనావాసాల నుంచి వచ్చే మురుగు నీటిని పరీక్షిస్తారు. సాధారణ రోజుల్లో వారం లేదా 15 రోజులకోసారి శాంపిల్స్ తీసుకుంటారు. లోతైన మ్యాన్‌‌‌‌ హోళ్లలో మనుషులకు బదులు రోబోలను వాడతారు. ల్యాబ్‌‌‌‌ లో పీసీఆర్, జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు చేసి కొత్త వేరియంట్లను గుర్తిస్తారు. ఫలితాలను 48 గంటల్లోగా కేంద్ర ప్రభుత్వ ‘ఐహెచ్ఐపీ’ పోర్టల్‌‌‌‌లో నమోదు చేస్తారు.

ఎక్కడైనా వ్యాప్తి పెరిగినట్లు తేలితే వెంటనే ఆ ప్రాంతానికి మొబైల్ టెస్టింగ్ వ్యాన్లు, ఫీవర్ క్లినిక్‌‌‌‌లు పంపుతారు. హాస్పిటల్స్‌‌‌‌లో బెడ్లు, ఆక్సిజన్, మందులను ముందే సిద్ధం చేస్తారు. జిల్లా మొత్తానికి లాక్‌‌‌‌ డౌన్ పెట్టకుండా ప్రభావిత ప్రాంతాల్లోనే నియంత్రణ చర్యలు (మైక్రో కంటైన్‌‌‌‌మెంట్), టీకా శిబిరాలు చేపడతారు.

ఎవరి గోప్యతకూ భంగం కలగకుండా..

పరీక్షల కోసం ప్రజల నుంచి నేరుగా ఎలాంటి శాంపిల్స్ సేకరించరు. అందువల్ల వ్యక్తుల గోప్యతకు ఎలాంటి ఇబ్బంది ఉండదని మార్గదర్శకాలు స్పష్టం చేశాయి. ఈ వివరాలను హాస్పిటల్ రికార్డులతో కలిపి ఏ ఒక్క వ్యక్తినో, కుటుంబాన్నో గుర్తించడానికి వాడకూడదు. ఏ ప్రాంతాన్నీ ‘వ్యాధిగ్రస్త ప్రాంతం’గా ముద్ర వేసి భయాందోళనలు సృష్టించకూడదని నిబంధన పెట్టారు. 3 వేల మంది కంటే తక్కువ జనాభా ఉన్న ప్రాంతాల డేటాను బహిరంగంగా ప్రదర్శించకూడదు.

స్కూళ్లు, హాస్టళ్లు, జైళ్ల నుంచి సేకరించే సమాచారాన్ని బయటపెట్టకూడదు. అలాంటి చోట్ల పరీక్షలకు ఎథిక్స్ కమిటీ అనుమతి తప్పనిసరి చేశారు. ఈ మార్గదర్శకాల విడుదలలో కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి హర్ష్ మంగ్లా, ఎన్సీడీసీ డైరెక్టర్ డాక్టర్ సంధ్యా కాబ్రా పాల్గొన్నారు. ఏపీఎస్ఐ-ఇండియా శాస్త్రవేత్తలు, సీనియర్ అధికారులు హాజరయ్యారు.