ఇంటర్ విలీనంతో ‘కార్పొరేట్’కే మేలు ..క్షేత్రస్థాయి చర్చలు లేకుండా ఏకపక్ష నిర్ణయం సరికాదు: వక్తలు 

ఇంటర్ విలీనంతో ‘కార్పొరేట్’కే మేలు ..క్షేత్రస్థాయి చర్చలు లేకుండా ఏకపక్ష నిర్ణయం సరికాదు: వక్తలు 
  • ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో   రౌండ్​ టేబుల్ మీటింగ్  

హైదరాబాద్, వెలుగు: ఇంటర్ ను పాఠశాల విద్యలో విలీనం చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో ప్రభుత్వ విద్య బలోపేతం కాదని, ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకే మేలు జరుగుతుందని పలు విద్యార్థి, ఉపాధ్యాయ, జూనియర్ కళాశాల సంఘాల నేతలు అన్నారు. విద్యావ్యవస్థలో మార్పు కోసం క్షేత్రస్థాయి చర్చలు జరపకుండా ఏకపక్షంగా ఇంటర్ బోర్డు రద్దు, విలీన నిర్ణయాలు తీసుకోవడం సరికాదని పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్ హిమాయత్ నగర్​లో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడారు.

1969–70 నుంచి ఉన్న ఇంటర్ విద్యలో 426 ప్రభుత్వ, 1,292 ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఉన్నాయని, సరిపడా వసతులు, గదులు, టీచర్లు లేని ప్రభుత్వ బడుల్లో వీటిని విలీనం చేస్తే విద్యార్థులకు స్థానికత సహా అనేక సమస్యలు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. టెన్త్ నుంచి ఇంటర్ ఫస్టియర్ వరకు రాష్ట్రంలో 1.7 శాతమే డ్రాపౌట్లు ఉన్నాయని, పూర్తి విధివిధానాలు లేకుండా తీసుకున్న విలీన నిర్ణయంతో గందరగోళం నెలకొందని పేర్కొన్నారు.

ప్రభుత్వ విద్య బలోపేతంపై తెలంగాణ విద్యా కమిషన్ ఇచ్చిన 400కు పైగా పేజీల రిపోర్టుపై నిర్ణయం తీసుకోకుండా ఎవరి మెప్పు కోసం ఇంటర్ బోర్డును రద్దు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్​చేశారు. విద్యార్థి, ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలు, నిపుణులతో చర్చించాలన్నారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు రజనీకాంత్, తాళ్ల నాగరాజు, పీడీఎస్​యూ నేతలు నాగరాజు, అనిల్, ఎస్​టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజేందర్, ప్రభుత్వ జూనియర్ కళాశాలల జేఏసీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, ఏఐడీఎస్​వో నేత నాగరాజు, ఏఐపీఎస్​యూ నేత గోపాల్ తదితరులు పాల్గొన్నారు.