మీ మామా అల్లుళ్ల అవినీతి చిట్టా విప్పుతా.. దమ్ముంటే అసెంబ్లీకి రండి: సీఎం రేవంత్ రెడ్డి

మీ మామా అల్లుళ్ల అవినీతి చిట్టా విప్పుతా.. దమ్ముంటే అసెంబ్లీకి రండి: సీఎం రేవంత్ రెడ్డి
  • సిద్దిపేట సభలో కేసీఆర్, హరీశ్​కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్
  • రబ్బరు చెప్పుల హరీశ్​కు వేల కోట్లు ఎక్కడివి?
  • హరీశ్ కక్కుర్తి వల్లే కాళేశ్వరం కూలేశ్వరమైంది
  • అందుకే కేసీఆర్ ఆయన పదవి ఊడబీకిండు
  • నమ్మకద్రోహం కేసీఆర్ రక్తంలోనే ఉంది..
  • వీళ్లతో తెలంగాణ ఉద్యమంలో కలిసి నడిచిన సోలిపేట, 
  • జగ్గారెడ్డి, ముత్యంరెడ్డి, పాపారావు, కేకే సర్వం కోల్పోయిన్రు
  • మామ పోతే అల్లుడు.. అల్లుడు పోతే బామ్మర్ది.. 
  • సిద్దిపేట ఏమైనా అనాథల రాజ్యమా 
  • ఈ గడ్డ సాక్షిగా చెప్తున్నా.. 2029 లో రెండోసారి ఇందిరమ్మ రాజ్యం 
  • కాంగ్రెస్ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంత్రిని చేసే బాధ్యత మాది
  • సిద్దిపేట మెడికల్ కాలేజీకి మాజీ మంత్రి మదన్ మోహన్ పేరు: సీఎం

హైదరాబాద్​, వెలుగు:హరీశ్ రావుకు, ఆయన కుటుంబానికి వేల కోట్ల రూపాయల ఆస్తులు, వందల ఎకరాల భూములు ఎలా వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.  మాజీ మంత్రి హరీశ్ రావు కమీషన్ల​ కక్కుర్తి వల్లే కాళేశ్వరం కూలేశ్వరమైందని, అందుకే  కేసీఆర్ ఆయనను మంత్రి పదవి నుంచి ఊడబీకారని అన్నారు. మూడేళ్లలోనే  లక్ష కోట్లు ఖర్చు పెట్టి  కాళేశ్వరం కట్టుడు, కూలుడు రెండూ అయిపోయాయని అన్నారు.  ‘బ్యారేజీ కట్టినప్పుడు హరీశ్ రావు సాగునీటి మంత్రి, కూలినప్పుడు కేసీఆర్ సాగునీటి మంత్రి.. మరి ఇందులో నేనేం చేశా పాపాల భైరవుడా?’ "నువ్వు దొంగవు.. నీ మామ గజదొంగ" అని సీఎం మండిపడ్డారు. 

మామా అల్లుళ్ల అవినీతి చిట్టాపై చర్చించేందుకు దమ్ముంటే అసెంబ్లీకి రావాలని కేసీఆర్, హరీశ్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి సవాలు విసిరారు. రబ్బరు చెప్పుల హరీశ్​కు వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు.  మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా సిద్దిపేటలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా స్కీమ్​, పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘బీఆర్​ఎస్​లో కేసీఆర్​, హరీశ్​, కేటీఆర్​, సంతోష్​ పంచభూతాలను చెరబట్టిన దుష్ట చతుష్టయం.. నీళ్లు, పాలు, సారా, ఇసుక .. దేన్నీ వదల్లేదు.. ఉద్యమకారులు ప్రాణాలు, తోటి నేతలు ఆస్తులు కోల్పోతే.. వీళ్లకు మాత్రం వేల కోట్లు ఎలా వచ్చినయ్?’ అని ప్రశ్నించారు. 

సిద్దిపేటలో హరీశ్ రావుతో ఒకేరోజు రాజకీయ జీవితం ప్రారంభించి, కంటికి రెప్పలా కాపాడిన జర్నలిస్టు, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సర్వం కోల్పోయి ప్రాణాలు విడిచారని, ఇవాళ ఆయన కుటుంబం ఉండటానికి ఇల్లు కూడా లేక ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటోందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. హరీశ్ రావుతోనే రాజకీయాల్లోకి వచ్చిన జగ్గారెడ్డి పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోతే హరీశ్‌‌‌‌‌‌‌‌కు వేల కోట్లు ఎట్లొచ్చాయని నిలదీశారు. 

మొన్ననే అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్న తెలంగాణ ఉద్యమకారుడు లక్ష్మణ్ గౌడ్ ఉదంతాన్నీ  ప్రస్తావించారు. హైదరాబాద్-, సికింద్రాబాద్ లాంటి జంట పట్టణాలైన సిద్దిపేట-దుబ్బాకల్లో.. కేసీఆర్ కంటే ముందే మంత్రి అయి నిజాయితీకి నిలువెత్తు అద్దంలా నిలిచి సర్వం త్యాగం చేసిన చెరుకు ముత్యంరెడ్డి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. సిరిసిల్లలో ఉద్యమ సమయంలో 'బావ' అని హత్తుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే పాపారావు పదవికి రాజీనామా చేయిస్తే, ఆ కుటుంబానికి, కేకే మహేందర్ రెడ్డికి పంగనామాలు పెట్టి కొడుకు 'గంజాయి బ్యాచ్ కేటీఆర్'కు సీటు తీసుకున్నారని మండిపడ్డారు. తండ్రి కేసీఆర్, కొడుకు కేటీఆర్, అల్లుడు హరీశ్ రావు, సడ్డకుని కొడుకు సంతోష్ రావులకు మాత్రం వేల కోట్ల ఆస్తులు ఎక్కడినుంచి వచ్చాయని ప్రశ్నించారు. ఇది ఎవరి అబ్బ జాగీరో  బీఆర్ఎస్ కార్యకర్తలే ఆలోచించాలన్నారు. 

ఇన్ని ఆస్తులు ఎట్లా వచ్చినయో చెప్పండి.. 

రంగనాయక సాగర్ దగ్గర హరీశ్ రావుకు, కొండపోచమ్మ దగ్గర వందల ఎకరాల్లో కేసీఆర్‌‌కు, జన్వాడ హైటెక్ సిటీ పక్కన కేటీఆర్‌‌కు ఫాంహౌస్‌‌లు, టీవీలు, పేపర్లు ఎట్లొచ్చాయని సీఎం రేవంత్​రెడ్డి నిలదీశారు. హరీశ్ రావుకు పిల్లనిచ్చిన మామ హనుమంతరావుకు సిద్దిపేట పక్కనే ప్రభుత్వ భూములు,  బావమరిది సుమన్ రావుకు బాలానగర్‌‌లో 150 ఎకరాలు, హైదరాబాద్‌‌లో వేల కోట్ల ఆస్తులు, వందల ఎకరాలు ఎలా సంక్రమించాయని అడిగారు. అమెరికాలో ఎక్కడో ఉండి పూటకూళ్ల కోసం పనిచేసే హరీశ్ రావు తమ్ముడు మహేశ్ రావుకు నేడు వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలు రూ.20 లక్షల కోట్లు పన్నులు కడితే, రూపాయలన్నీ వీళ్ల చేతుల్లోకి పోయి రాష్ట్రం నెత్తిన రూ.8,11,000 కోట్ల అప్పులు మిగిల్చారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్‌‌ను నమ్మితే నట్టేట ముంచేస్తడు

‘నర్సాపూర్ అడవి దయ్యం–ఎర్రవల్లి బక్కాయన’ అంటూ రేవంత్​పిట్టకథ చెప్పారు. కేసీఆర్‌‌ను నమ్మితే తెలంగాణ ప్రజలను నట్టేట ముంచుతారని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. పల్లీ, వరి, మక్క పంటలతో దయ్యాన్నే మూడుసార్లు మోసం చేసిన కేసీఆర్ పేరు చెబితేనే అడవిలోని రుషి కూడా 'నాలుగు కోట్ల మందిని పదేపదే మోసం చేసిన వాడి దగ్గరికి పోకు' అని హెచ్చరించాడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేసీఆర్‌‌కు ఎవ్వరి బతుకు అక్కర్లేదని, ఎవ్వరి బాగు అక్కర్లేదని, ప్రజలకు నీళ్లు, పంట, నౌకరీ ఏవీ పట్టవని విమర్శించారు. కేవలం ఆయన గడీ, ఆయన కుటుంబం, ఆయన అల్లుడు, కొడుకు, సుట్టపోళ్లు తప్ప నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల సంక్షేమం కేసీఆర్‌‌కు అవసరం లేదని మండిపడ్డారు. 'నమ్మితిరా సిద్దా అంటే ముంచితిరా రంగా' అన్నట్టు.. తనను నమ్మి రాజకీయ జీవితం, ఓట్లు ఇచ్చిన వారందరినీ ఆయన నట్టేట ముంచారని విమర్శించారు. 

చేసిన మంచి ఊరంతా చెప్పండి

తమ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా రెండేళ్లు అధికారంలో ఉంటుందని, ఇంతవరకు చేయని పనులు, చేయాల్సిన పనులు ఏమైనా ఉంటే తనకు చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు, కార్యకర్తలకు సూచించారు. అదే సమయంలో ప్రభుత్వం చేసిన మంచి పనులు మాత్రం ఊరంతా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. 

ఆత్మగౌరవం కావాలా..  బానిస బతుకు కావాలా?

తెలంగాణ ప్రజలు తమకు ఏమిచ్చినా పెద్దగా పట్టించుకోరని, 'ఇల్లు ఇయ్యి, బియ్యం ఇయ్యి' అని అడగరని.. కానీ గౌరవం ఇవ్వకపోతే మాత్రం తగిన బుద్ధి చెబుతారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏమీ ఇవ్వకపోయినా ఆకలితోనైనా చస్తారు కానీ తెలంగాణ ప్రజలు తమ ఆత్మగౌరవాన్ని ఎన్నటికీ తాకట్టు పెట్టరని స్పష్టం చేశారు. ఎన్నడైనా ప్రజల గౌరవానికి భంగం కలిగేలా తాను ప్రవర్తించానా అని సభను అడిగారు. ఇవాళ కూడా సభలో ర్యాంప్‌‌పై నడిచేటప్పుడు ప్రజలు మీద పడి తొక్కిసలాట జరుగుతుంటే, పోలీసులు ఆపుతున్నా తాను  ప్రజలతో పాటే నడుచుకుంటూ వచ్చానని గుర్తు చేశారు. ఈ రాష్ట్రానికి ఆత్మగౌరవం కావాలా, లేక కేసీఆర్ దగ్గర బానిస బతుకు కావాలా అని ప్రజలే ఆలోచించాలని కోరారు. ఆత్మగౌరవం కావాలంటే ప్రజా పాలన వైపు నిలబడాలని, లేదంటే పాపాల భైరవుడి వైపు ఉంటారో తేల్చుకోవాలని సూచించారు.  

 కేసీఆర్ రక్తంలోనే నయవంచన 

చింతమడకలో ఉన్న కేసీఆర్‌‌కు  సింగిల్ విండో ఎన్నికల్లో మదన్ మోహన్, వి.హనుమంతరావు తొలి రాజకీయ భిక్ష పెట్టారని తెలిపారు. కానీ యూత్ కాంగ్రెస్‌‌ను వదిలేసి ఎన్టీఆర్ పంచన చేరి, తనకు అవకాశమిచ్చిన మదన్ మోహన్ మీదే 1983లో కేసీఆర్ పోటీ చేశారని, ఆనాడే ఆయన రక్తంలో మోసమే పెట్టుబడిగా ఉందని తేలిపోయిందన్నారు. 1985 నుంచి 2004 వరకు టీడీపీ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండి ఎన్టీఆర్ పార్టీకే వెన్నుపోటు పొడిచి సొంత దుకాణం తెరిచారని మండిపడ్డారు.

 ఆ తర్వాత కాంగ్రెస్‌‌తో జతకట్టి కేంద్రంలో ఆయన, రాష్ట్రంలో అల్లుడు హరీశ్ రావు మంత్రి పదవులు పొందారని చెప్పారు. 2004లో రబ్బరు చెప్పుల హరీశ్ రావు కనీసం వార్డు మెంబర్ ఎన్నికల్లో కూడా గెలవలేదని, డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయనను మొదటి మంత్రివర్గంలో తీసుకొని మంత్రిని చేసిన ఆరు నెలల తర్వాత సిద్దిపేట నుంచి రాజకీయ జీవితం ప్రారంభమైందని గుర్తు చేశారు. కాంగ్రెస్, వైఎస్ఆర్ భిక్షతో మంత్రి అయిన హరీశ్ రావు.. ఆ తర్వాత సిద్దిపేటలో పోలీసు బూట్లు, లాఠీలతో కాంగ్రెస్ కార్యకర్తలను తొక్కేయాలని కుట్రలు చేశారని ధ్వజమెత్తారు.

 సిద్దిపేట ఎమ్మెల్యేకు మంత్రి పదవి గ్యారెంటీ

2023లో మేడ్చల్‌‌లో తాను దీక్ష చేసినప్పుడు కేసీఆర్ కుట్రలతో అడ్డుకోవాలని చూశారని, ఆనాడే 'కేసీఆర్ కాసుకో.. గజ్వేల్ గడ్డపై కాలుపెట్టి కాంగ్రెస్ జెండా ఎగరేస్తా, నిన్ను నీ పార్టీని పాతాళానికి తొక్కకపోతే కాంగ్రెస్ కార్యకర్తనే కాదు' అని శపథం చేశానని సీఎం గుర్తు చేశారు. ఆనాడు దామోదర రాజనర్సింహ ఇన్‌‌చార్జి బాధ్యత తీసుకొని లక్షలాది మందితో గజ్వేల్‌‌లో కదంతొక్కి డిసెంబర్ 7, 2023న ఇందిరమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. ఇప్పుడు సిద్దిపేట గడ్డపై నుంచి కార్యకర్తలకు స్పష్టమైన మాట ఇస్తున్నానని, ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగరేస్తే మీరెన్నుకున్న ఎమ్మెల్యేకు బ్రహ్మాండమైన మంత్రి పదవి ఇచ్చే బాధ్యత తనదని, మహేశ్ గౌడ్‌‌దని ప్రకటించారు. 

వేదికపై శంకరమ్మ కంటతడి 

తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను సీఎం రేవంత్ రెడ్డి వేదికపైకి పిలిచి, ఆమె చేయి పైకెత్తి ప్రజలకు చూపుతూ ఆనాటి త్యాగాన్ని గుర్తు చేశారు. 'అగ్గిపెట్టె రావు' రూ.100 పెట్రోల్ తెచ్చుకొని 10 పైసల అగ్గిపెట్టె తేకుండా డ్రామాలాడితే, శంకరమ్మ కొడుకు మాత్రం లక్షలాది తెలంగాణ బిడ్డలు బాగుపడాలని ఎల్బీనగర్ చౌరస్తాలో అంబేద్కర్ సాక్షిగా నిలువునా పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టె గీరుకొని నిప్పుకణికలై ఆకాశంలో తారలై మెరిశాడని చెప్పారు. 

నవమాసాలు మోసి కన్న బిడ్డలను 1,200 మందిని బలిస్తే, ఆ తల్లుల భుజాల మీద ఎక్కి పదేళ్లు అధికారం చెలాయించిన కేసీఆర్.. తన బిడ్డకు ఎంపీ, ఓడిపోతే ఎమ్మెల్సీ, చుట్టం వినోద్ రావు ఓడిపోతే ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్, అల్లుడు హరీశ్, కొడుకు కేటీఆర్, బంధువు దయాకర్ రావులకు మంత్రి పదవులు, ప్రతిమ శ్రీనివాస్‌‌కు కాంట్రాక్టులు ఇచ్చాడని ధ్వజమెత్తారు. శంకరమ్మకు ఒక్క శాసనమండలి లేదా రాజ్యసభ పదవి ఇచ్చి ఉంటే అమరుల త్యాగం ప్రపంచానికి తెలిసేదని, ప్రజా పాలనలో ఆ తల్లి అడగకపోయినా మహిళా కమిషన్ సభ్యురాలిగా, చాకలి ఐలమ్మ మనవరాలిని కూడా కమిషన్ సభ్యురాలిగా నియమించి గౌరవించామన్నారు.

కేసీఆర్ కు కోదండం వేసి కొట్టాలా.. వద్దా..?

ఇటీవల డ్యూటీ రిజిస్టర్‌‌లో సంతకం పెట్టి ఫాంహౌస్‌‌లో గంటసేపు బర్త్‌‌డే పార్టీకి వెళ్లిన పోలీసులను సస్పెండ్ చేశామని..  కోటిన్నర జీతభత్యాలు తీసుకుంటూ 300 మంది పోలీసుల పహారాలో మూడేళ్లుగా ఎర్రవల్లి ఫాంహౌస్‌‌లో దావత్‌‌లు చేసుకుంటున్న కేసీఆర్‌‌ను కోదండం వేసి కొట్టాలా వద్దా? అని సీఎం ప్రశ్నించారు. ఆనాడు హరీశ్​ రావు.. నారాయణ, చైతన్య కాలేజీలపై ఉద్యమం చేసి, తర్వాత బ్లాక్‌‌మెయిల్ చేసి ముకుందా డెయిరీ పేరుతో ఆంధ్రోళ్ల కంపెనీని గుంజుకొని, నారాయణ, చైతన్య హాస్టళ్లతో పాటు అపోలో, యశోద, ఏఐజీ దవాఖానలకు పాలు పోసే దందా పెట్టాడని సీఎం ఆరోపించారు. రూ.10 పాలు రూ.12కు అమ్ముతూ తెలంగాణ సెంటిమెంట్అడ్డం పెట్టుకొని వందల కోట్లు దండుకున్నారని విమర్శించారు. 

చెల్లె కవితను గెంటేసిన కేటీఆర్.. 

కేటీఆర్ గడ్డం పెంచుకున్న అంశాన్ని ప్రస్తావిస్తూ.. గడ్డం రావడానికే 50 ఏళ్లు పట్టింది, బుద్ధి రావడానికి ఇంకెన్నేళ్లు పడుతుందోనని సీఎం ఎద్దేవా చేశారు. తీహార్ జైలు నుంచి పుట్టెడు దుఃఖంతో ఇంటికొచ్చి ఆస్తిలో వాటా అడిగిన సొంత చెల్లెలు కవితను మెడలు పట్టి బయటకు గెంటేశాడని, సొంత చెల్లెకు అన్నం పెట్టనివాడు చిన్నమ్మ బిడ్డకు వడ్డాణం చేయిస్తా అన్నట్టే ఉందని విమర్శించారు. రాఖీ పండుగ నాడు చెల్లె ఇంటికి వెళ్లనివాడు కోటి మంది ఆడబిడ్డలను బాగా చూసుకుంటానంటే నమ్మొద్దని, మేకతోలు కప్పుకున్న గుంటనక్క వేషాలను గుర్తుపట్టాలని సూచించారు. 

గౌరవెల్లి, గండిపల్లికి సీఎం చొరవతో నిధులు : పొన్నం

మంత్రి పొన్నం మాట్లాడుతూ.. గతంలో నిర్లక్ష్యానికి గురైన గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి పూర్తి సహకారం అందిస్తున్నారని చెప్పారు. సీఎం చొరవతోనే ఈ ప్రాజెక్టుల పూర్తికి నిధులు కేటాయించారని, కాల్వల కోసం భూసేకరణ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. రంగనాయక సాగర్, కొండపోచమ్మ, మల్లన్న సాగర్ ప్రాజెక్టుల బాధితులకు పెండింగ్‌‌లో ఉన్న పరిహారాన్ని అందించి న్యాయం చేయాలని ఈ సందర్భంగా సీఎంను కోరారు. ఈ మూడు ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ, నష్టపరిహార సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. హుస్నాబాద్‌‌ నియోజకవర్గాన్ని తిరిగి కరీంనగర్ జిల్లాలో కలపాలని సీఎంను కోరారు. 

సిద్దిపేట మెడికల్ కాలేజీకి మదన్ మోహన్ పేరు

మర్రి చెన్నారెడ్డితో సమానంగా ఉద్యమ వ్యూహరచనలో ముందుండి నడిపించిన సౌమ్యుడు, తెలంగాణవాది అనంతుల మదన్ మోహన్ ప్రాతినిధ్యం వహించిన ప్రాంతమిదని సీఎం కొనియాడారు. 1983లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు సిద్దిపేట నుంచి పోటీ చేసిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును మదన్ మోహన్ ఓడించి, సిద్దిపేట కాంగ్రెస్ అడ్డా అని నిరూపించారని గుర్తు చేశారు. 1985 వరకు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మదన్ మోహన్ పేరును చరిత్ర పుటల్లో నుంచి కనుమరుగు చేయాలని నాలుగు దశాబ్దాలుగా కేసీఆర్, హరీశ్ రావు కుట్రలు పన్నారని ఆరోపించారు. అందుకే 24 గంటల్లో జీవో ఇచ్చి సిద్దిపేట మెడికల్ కాలేజీకి మదన్ మోహన్ పేరు పెట్టాలని దామోదర రాజనర్సింహను ఆదేశించారు. 

సీఎం సభ గ్రాండ్ సక్సెస్ కాంగ్రెస్​ శ్రేణుల్లో నయా జోష్

మెదక్​/సిద్దిపేట రూరల్​/టౌన్​, వెలుగు: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం సందర్భంగా గురువారం సిద్దిపేటలో జరిగిన సీఎం బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్​ అయ్యింది. వివిధ జిల్లాల నుంచి కాంగ్రెస్​ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. హెలికాప్టర్​లో సిద్దిపేటకు చేరున్న సీఎంకు కార్మిక, ఉపాధి, గనుల శాఖ మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్​చార్జి మంత్రి వివేక్​ వెంకటస్వామి ఆధ్వర్యంలో సిద్దిపేట డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్​ఇన్​చార్జి పూజల హరికృష్ణ ఘన స్వాగతం పలికారు. నాయకులతో కలిసి సభా స్థలికి చేరుకున్న సీఎం  ఇందిరా గాంధీ ఫొటో వద్ద పుష్పాంజలి ఘటించారు. ఆ తర్వాత రూ.544  కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సంబంధించిన శిలా ఫలాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

సిద్దిపేట ఎల్లమ్మ మీద ఒట్టేస్తవా..?

సిద్దిపేట ఎల్లమ్మ.. మీ అందరికీ ఎంతో నమ్మకం.. హరీశ్ రావ్ నువ్వు బీజేపోళ్లతోటి మంతనాలు చేస్తున్న మాట నిజమా? కాదా? నేను బీజేపోళ్లతోని అంటకాగుతలేను.. చీకటి మాటలు మాట్లాడుతలేను.. ఒక వేళ నేను అబద్ధం చెప్తే..  సర్వ నాశనమైపోతా అని.. సిద్దిపేట ఎల్లమ్మ మీద ఒట్టేస్తవా? అని నేను అడుగుతున్నా.. చెప్పుల్లేనోన్ని.. వార్డు మెంబర్ కానోన్ని మామ మంత్రిని చేసి అధికారం ఇస్తే.. ఆ మామకే వెన్నుపోటు పొడవాలని సూస్తున్నడు.. కేసీఆర్​కు మాత్రం ఇది జరగాల్సిందే.. మదన్ మోహన్​కు, ఎన్టీఆర్​కు వెన్ను పోటు పొడిసిన కేసీఆర్​కు అదే గతి పడ్తది. 

దేశంలో ఎక్కడా లేని పథకాలు : మంత్రి వివేక్​

రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడాలేని కొత్త పథకాలను అమలు చేస్తోందని, ఇందిరమ్మ జీవిత బీమా పథకం అందులో ఒకటని ఉమ్మడి మెదక్​ జిల్లా ఇన్​చార్జి మంత్రి వివేక్​ వెంకటస్వామి అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇప్పటి వరకు రాష్ట్రంలో రెండు లక్షల ఇండ్లు పూర్తి చేశామన్నారు. వితంతువులు, వికలాంగులు, చేనేత, గీత కార్మికులకు 4 లక్షల పెన్షన్లు మంజూరు చేశామన్నారు. ప్రభుత్వ బడుల్లో చదువుకుంటున్న 20 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు బ్రేక్​ఫాస్ట్​ పథకం అమలు చేస్తున్నామన్నారు. 

రాష్ట్రంలో పేదలందరికి 13 వేల కోట్ల ఖర్చుతో సన్న బియ్యం అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో కొత్తగా16 లక్షల రేషన్​ కార్డులు మంజూరు చేశామని చెప్పారు. రూ.4,500 కోట్లు సీఎస్​ఆర్ ఫండ్స్​తో నియోజకవర్గానికి ఒక ఏటీసీ ఏర్పాటు చేసి విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని వివరించారు. టామ్​కామ్​ ద్వారా విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. మల్లన్నసాగర్​ భూ నిర్వాసితులకు పరిహారం మంజూరు చేయాలని, సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులకోసం రూ.50 కోట్లు మంజూరు చేయాలని మంత్రి వివేక్​ సీఎంకు విజ్నప్తి చేశారు.