చేవెళ్ల: భూ కబ్జా కోసం నకిలీ ఏజీపీఏ..దొంగ వారసులను సృష్టించి రిజిస్ట్రేషన్

చేవెళ్ల: భూ కబ్జా కోసం నకిలీ ఏజీపీఏ..దొంగ వారసులను సృష్టించి రిజిస్ట్రేషన్
  •     చేవెళ్లలో ఒకరు అరెస్ట్  

చేవెళ్ల, వెలుగు:  భూ కబ్జా కోసం నకిలీ ఏజీపీఏ పత్రాలు సృష్టించిన కేసులో ఒకరిని చేవెళ్ల పోలీసులు అరెస్ట్ చేశారు. చేవెళ్ల మండలం పామెన శివారులోని సర్వే నంబర్లు 135, 138లో ఉన్న 15 ఎకరాల 7 గుంటల   భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు కొందరు కుట్ర పన్నారు. అసలు యజమానులే కాని వ్యక్తులను వారసులుగా చిత్రీకరిస్తూ 2018 మార్చి 23న చేవెళ్ల సబ్‌‌రిజిస్ట్రార్ ఆఫీసులో ఏజీపీఏ డాక్యుమెంట్ నంబర్ 4678/2018ను రిజిస్ట్రేషన్ చేయించారు. 

అయితే, ఈ భూమిని మామిడి మంజుల, ఇతరులు గతంలోనే రిజిస్ట్రేషన్ ద్వారా కొన్నట్టు..రెవెన్యూ రికార్డుల్లో పేర్లు నమోదు చేసుకోవడంతోపాటు పట్టాదారు పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్లు పొందారు. నకిలీ ఏజీపీఏ ను గుర్తించిన అసలైన ఓనర్లు అప్పట్లో చేవెళ్ల పీఎస్​లో కేసు పెట్టారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఏజీపీఏలో పేర్కొన్న వ్యక్తుల పేర్లు, ఓటరు గుర్తింపు కార్డుల వివరాల్లోనూ వ్యత్యాసాలున్నట్లు గుర్తించారు. అసలు పట్టాదారు కందాడ రామయ్యకు చట్టబద్ధమైన వారసులనేందుకు ఎలాంటి ఆధారాలు  లభించలేదు.  దీంతో ఈ కేసులో నిందితుడైన చేవెళ్లకు చెందిన టేకులపల్లి శ్రీనివాస్ అలియాస్ గుట్టి శ్రీను (41)ను గురువారం అరెస్ట్ చేశారు.