- గచ్చిబౌలి పీజీ హాస్టల్‌లోఈగల్ ఫోర్స్ సోదాలు
- ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు సహా ఆరుగురికి పాజిటివ్
- 15 గ్రాముల గంజాయి స్వాధీనం.. సప్లయర్ల కోసం గాలింపు ముమ్మరం
హైదరాబాద్, వెలుగు: గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ పీజీ హాస్టల్‌లో గంజాయి వినియోగిస్తున్న ఆరుగురిని ఈగల్ ఫోర్స్ గుర్తించింది. హాస్టల్‌లో ఉంటున్న 8 మందికి డ్రగ్ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించగా వీరిలో ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, ముగ్గురు అమెజాన్ డెలివరీ బాయ్స్ సహా ఆరుగురికి గంజాయి(టీహెచ్‌సీ) పాజిటివ్‌గా వచ్చింది. దీంతో హాస్టల్‌లో సోదాలు నిర్వహించి..15 గ్రాముల గంజాయితో పాటు గంజాయి చుట్టేందుకు ఉపయోగించే ప్రీ-రోల్డ్ కోన్స్‌ను ఈగల్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హాస్టల్‌కు గంజాయి సరఫరా చేస్తున్నట్లు అనుమానిస్తున్న ముగ్గురిని గుర్తించి వారి కదలికలపై నిఘా పెట్టారు. గురువారం విడుదల చేసిన పత్రక ప్రకటనలో వివరాలు వెల్లడించారు.
పీజీ హాస్టల్స్‌లో గంజాయి వినియోగంపై ఈగల్ నిఘా
గచ్చిబౌలి, సిద్ధిక్ నగర్‌లోని హాస్టల్స్‌లో గంజాయి వినియోగిస్తున్నట్లు ఈగల్ ఫోర్స్ టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ 1908కు సమాచారం అందింది. ఈ మేరకు హరిహర జ్ఞానేశ్వర మెన్స్ పీజీ హాస్టల్‌లో ఈగల్ ఫోర్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 8 మందికి యూరిన్ డ్రగ్ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించగా, ఆరుగురికి గంజాయి పాజిటివ్ వచ్చింది. తనిఖీల్లో నవీన్ అనే వ్యక్తి వద్ద 5 గ్రాములు, జయంత్ వద్ద సుమారు 10 గ్రాముల గంజాయి గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 15 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పాజిటివ్ వచ్చిన వారిని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం మాదాపూర్ పోలీసులకు అప్పగించారు.
