ట్రిపుల్ఆర్ దక్షిణ భాగం భూసేకరణ వేగవంతం చేయండి: సీఎస్ సంజయ్ జాజు

ట్రిపుల్ఆర్ దక్షిణ భాగం భూసేకరణ వేగవంతం చేయండి: సీఎస్ సంజయ్ జాజు

హైదరాబాద్, వెలుగు: రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగం, ప్రతిపాదిత రేడియల్ రోడ్ల భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎస్ సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో ఉన్నతాధికారులు, సంబంధిత జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

201 కిలోమీటర్ల పొడవైన ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం నిర్మాణం కోసం 6 జిల్లాల్లోని 90 గ్రామాల పరిధిలో 4,962 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉందని అధికారులు సీఎస్‌‌కు వివరించారు. 161 కిలోమీటర్ల ఉత్తర భాగంతో పాటు దక్షిణ భాగం పనులు కూడా సమాంతరంగా సాగేలా ప్రజెంటేషన్ ద్వారా అలైన్‌‌మెంట్ వివరాలు వెల్లడించారు. ఈ నేపథ్యంలో రేడియల్ రోడ్లకు సంబంధించి ప్రిలిమినరీ నోటిఫికేషన్ల జారీని తక్షణమే వేగవంతం చేయాలని సీఎస్ స్పష్టం చేశారు.

భూసేకరణలో ఎలాంటి జాప్యం లేకుండా చూసి, నిర్ణీత గడువులోగా మొత్తం ప్రాజెక్టును పూర్తి చేయాలన్నారు. మరోవైపు రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడుల ప్రగతి పైనా సమావేశంలో సుదీర్ఘంగా సమీక్షించారు. 2025 ఇన్వెస్టర్స్ సమిట్ సందర్భంగా కుదుర్చుకున్న ఎంవోయూ ప్రస్తుత స్థితిగతులతో పాటు, త్వరలో నిర్వహించనున్న 'ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమిట్' కోసం పరిశీలిస్తున్న కొత్త పెట్టుబడి ప్రతిపాదనలపై చర్చించారు. వివిధ రంగాల్లో వస్తున్న ప్రతిపాదనలను నిశితంగా పర్యవేక్షించేందుకు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ప్రతి రంగానికి ప్రత్యేకంగా విభాగ అధికారులను  నియమించాలని ఆదేశించారు.