మంచిర్యాల, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాలోని 30 క్లస్టర్లలో బయో రిసోర్స్ సెంటర్లను ఏర్పాటు చేసి, ఒక్కో కేంద్రానికి రూ.లక్ష విలువైన పరికరాలను అందిస్తున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. గురువారం బేలా మండలం చాంద్‌పల్లిలో సీపీఎఫ్ సంస్థ, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రకృతి వ్యవసాయం అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీపీఎఫ్ సహకారంతో దర్గాజీ అనే రైతు సాగు చేస్తున్న పంటలను, ఎరువు తయారీ, పంట నమోదును క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఉద్యానవన పంటలతో పాటు పత్తిలోనూ జీవామృతం, నీమాస్త్రం వినియోగిస్తూ ప్రకృతి సాగు చేస్తున్న రైతులను అభినందించారు. ప్రకృతి వ్యవసాయంతో పెట్టుబడులు గణనీయంగా తగ్గడమే కాకుండా వాతావరణ మార్పులను తట్టుకుని మెరుగైన దిగుబడులు సాధించవచ్చన్నారు. వీబీజీరాంజీ స్కీమ్‌ను వ్యవసాయానికి అనుసంధానం చేసి పంట కుంటలు, ఊటకుంటలు, పొలం బాటలు, ఇంకుడు గుంతలు, పశువుల తొట్టెలు, చెక్‌డ్యామ్‌లు నిర్మించుకోవాలని సూచించారు.
