బాసర: పుష్కరాల పనులు వేగవంతం చేయాలి : కలెక్టర్ భవేశ్ మిశ్రా

బాసర: పుష్కరాల పనులు వేగవంతం చేయాలి :  కలెక్టర్ భవేశ్ మిశ్రా
  •     బాసర ఆలయ పునర్నిర్మాణ వర్క్స్​స్పీడప్​ చేయాలి
  •     కలెక్టర్ భవేశ్​ మిశ్రా

బాసర, వెలుగు : గోదావరి పుష్కరాల సందర్భంగా చేపడుతున్న అభివృద్ధి పనులను వివిధ శాఖల ఆఫీసర్లు సమన్వయంతో స్పీడప్​ చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఘాట్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన పనులను ముందస్తుగా పూర్తి చేయాలని సూచించారు. గురువారం బాసర ఆలయ ఈవో ఆఫీస్​లో సంబంధిత శాఖల ఆఫీసర్లతో నిర్వహించిన సమీక్షలో పుష్కరాల ఏర్పాట్ల పురోగతిని కలెక్టర్ పరిశీలించారు. ఘాట్ల నిర్మాణం, భూసేకరణ, ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై సమీక్షించారు. 

గోదావరి నీటిమట్టం వివరాలను తెలుసుకుంటూ, పనుల పురోగతిని ఎప్పటికప్పుడు ఫొటోల రూపంలో పంపించాలని సూచించారు. అనంతరం జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులను సమీక్షించిన కలెక్టర్, నిర్మాణాలు త్వరగా పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. బాసర భవిష్యత్తు అభివృద్ధి అవసరాల కోసం ప్రభుత్వ భూములను పరిశీలించి, డంపింగ్ యార్డు ఏర్పాటుకు అనువైన స్థలాన్ని గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆఫీసర్లకు సూచించారు. సమావేశంలో భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఇరిగేషన్ ఈఈ అనిల్, ఉద్యానవన శాఖ అధికారి రమణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.