‘వీబీ- జీరామ్ జీ’లో  ఇక జిల్లాకో అంబుడ్స్‌‌పర్సన్ 

‘వీబీ- జీరామ్ జీ’లో  ఇక జిల్లాకో అంబుడ్స్‌‌పర్సన్ 
  • వేతన జాప్యం, జాబ్‌‌ కార్డు సమస్యలపై  కూలీలు ఫిర్యాదు చేయొచ్చు
  • అప్పీలేట్‌‌ అథారిటీల విధివిధానాలను ఖరారు చేస్తూ కేంద్రం కొత్త గైడ్‌‌లైన్స్

హైదరాబాద్, వెలుగు: గ్రామీణ ఉపాధి పథకం అమలులో పారదర్శకత, జవాబుదారీతనాన్ని మరింత పెంచేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ‘వికసిత్‌‌ భారత్‌‌-గ్యారంటీ ఫర్‌‌ రోజ్‌‌గార్‌‌ అండ్‌‌ ఆజీవిక మిషన్‌‌ (గ్రామీణ్‌‌) చట్టం-2025’ (వీబీ-జీ రామ్‌‌ జీ) కింద కూలీలకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు నూతన వ్యవస్థను బలోపేతం చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాకో అంబుడ్స్‌‌పర్సన్‌‌ను నియమించడంతోపాటు అప్పీలేట్‌‌ అథారిటీల కోసం నూతన మార్గదర్శకాలను కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ విడుదల చేసింది. ఉపాధి శ్రామికులకు క్షేత్రస్థాయిలో ఎలాంటి అన్యాయం జరగకుండా అంబుడ్స్‌‌పర్సన్లు అండగా నిలుస్తారని పేర్కొంది. గతంలో ఉపాధి స్కీంలోనూ అంబుడ్స్‌‌పర్సన్‌‌ వ్యవస్థ ఉన్నా.. నామమాత్రంగా పనిచేసింది. తాజా ఈ వ్యవస్థను బలోపేతం చేస్తూ గైడ్ లైన్స్ రూపొందించింది.

కనీస సౌకర్యాలు లేకపోతే తక్షణమే చర్యలు

నూతన నిబంధనల ప్రకారం ఉపాధి కూలీలు తమకు ఎదురయ్యే పలు సమస్యలపై జిల్లా అంబుడ్స్‌‌పర్సన్‌‌ను ఆశ్రయించవచ్చు. అర్హులైన కూలీలకు జాబ్‌‌కార్డుల జారీలో జాప్యం జరిగినా, నిరాకరించినా లేదా అడిగిన సమయానికి పని కల్పించకపోయినా ఫిర్యాదు చేయొచ్చు. అదేవిధంగా చేసిన పనికి వేతనాల చెల్లింపులో ఆలస్యం జరిగితే అంబుడ్స్‌‌పర్సన్‌‌ దృష్టికి తీసుకెళ్లవచ్చు. వేతనాలు జాప్యమైన పక్షంలో నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన నష్టపరిహారం అందకపోయినా ఫిర్యాదు చేసే వెసులుబాటు ఉంది.

ఉపాధి పనులు జరిగే చోట కూలీలకు కల్పించాల్సిన కనీస సౌకర్యాలు లేకపోతే తక్షణమే చర్యలు తీసుకుంటారు. మస్టర్‌‌ రోల్స్‌‌ నిర్వహణలో అవకతవకలకు పాల్పడినా, చట్టబద్ధంగా కూలీలకు దక్కాల్సిన హక్కులను నిరాకరించినా అంబుడ్స్‌‌పర్సన్లు విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తారు. పనుల పర్యవేక్షణలో పారదర్శకత కోసం డిజిటల్‌‌ ట్రాకింగ్‌‌ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానుంది. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను తనిఖీలు చేసి సోషల్‌‌ ఆడిట్‌‌నుపకడ్బందీగా నిర్వహించనుంది.