ఈగలు.. ఎలుకలు.. మధ్యలో మాంసం.. హైదరాబాద్లో మరీ ఇంత ఘోరమా..?

ఈగలు.. ఎలుకలు.. మధ్యలో మాంసం.. హైదరాబాద్లో మరీ ఇంత ఘోరమా..?
  • క్యూర్ పరిధిలోని 15 మీట్ యూనిట్లు, 4 కరాచీ బేకరీల్లో టీజీ సేఫ్ తనిఖీలు
  • 6 సంస్థల లైసెన్సులు సస్పెండ్.. 5 దుకాణాలు మూసివేత
  • 10 సంస్థలకు షోకాజ్, 2 యూనిట్లకు ఇంప్రూవ్ మెంట్ నోటీసులు
  • రూ. 6.59 లక్షల విలువైన 1,672 కిలోల ఆహార పదార్థాలు సీజ్

హైదరాబాద్, వెలుగు: అపరిశుభ్రంగా మాంసం దుకాణాలు, ప్రాసెసింగ్ యూనిట్లు నడుపుతున్న సంస్థలతో పాటు కరాచీ బేకరీ తయారీ కేంద్రాల్లో టీజీ సేఫ్ గురువారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది. ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసు సిబ్బందితో కూడిన 11 టీమ్ లు క్యూర్ పరిధిలోని 15 మీట్ రిటైల్, ప్రాసెసింగ్ యూనిట్లు, 4 కరాచీ బేకరీ తయారీ యూనిట్లు కలిపి మొత్తం 19 సంస్థల్లో సోదాలు చేసి సుమారు రూ. 6.59 లక్షల విలువైన 1,672 కిలోల ఆహార పదార్థాలను పారబోశాయి.

ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్, రిజిస్ట్రేషన్ లేకుండా నిర్వహించడం, దెబ్బతిన్న ఫ్లోరింగ్, గోడలపై రక్తం, మాంసం అవశేషాలు, అపరిశుభ్ర వాషింగ్ ఏరియా, ఆహార వ్యర్థాలతో పూడిపోయిన డ్రెయిన్లు, తీవ్రమైన ఈగలు, బొద్దింకల బెడద, ఎలుకలు, వాటి విసర్జనలు, తప్పుడు లేబులింగ్ తో పాటు ఉద్యోగుల హెల్త్, వాటర్ అనాలిసిస్ రికార్డులు లేకపోవడం వంటి ఉల్లంఘనలను అధికారులు గుర్తించారు.

5 యూనిట్ల మూసివేత.. 12 సంస్థలకు నోటీసులు 
ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ లేకుండా అపరిశుభ్ర వాతావరణంలో నిర్వహిస్తున్న నల్లకుంట శంకర్ మఠ్ లోని ఆనంద్ మటన్ అండ్ చికెన్ పాయింట్, ఎర్రగడ్డ యూసుఫ్ గూడలోని సల్మాన్ కేజీఎన్ పౌల్ట్రీ, న్యూ డీసెంట్ మీట్ చికెన్ అండ్ ఫిష్ షాప్, సికింద్రాబాద్ ఎస్పీ రోడ్ లోని ప్రోటీన్ ఫుడ్స్, మల్కాజిగిరి గౌతమ్ నగర్ రోడ్ (అనుటెక్స్ వెనుక) లోని ఏపీ ఫిషరీస్ ఫిష్ స్టాల్ ను అధికారులు మూసివేశారు. లోపాలు సరిదిద్దుకోవాలని ముషీరాబాద్ లోని వతన్ ఫ్రెష్ మార్ట్, ఉప్పల్ లోని మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఇండియా లిమిటెడ్ కు ఇంప్రూవ్ మెంట్ నోటీసులు జారీ చేసి, త్వరలో రీ-ఇన్ స్పెక్షన్ చేయనున్నారు.

తీవ్ర ఉల్లంఘనలు గుర్తించిన గగన్ పహాడ్, మూసాపేట, సుచిత్ర ఎక్స్ రోడ్ లోని మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఇండియా లిమిటెడ్ శాఖలు, గోషామహల్ ఎంజే మార్కెట్ లోని సాయిబాబా ఐఎన్ సీ (కరాచీ బేకరీ), మేడ్చల్ మండలం కిష్టాపూర్ లోని డిలైట్ ఫుల్ గౌర్మెట్ ప్రైవేట్ లిమిటెడ్ (లిషియస్) తో పాటు మూసివేసిన 5 సంస్థలకు కలిపి మొత్తం 10 సంస్థలకు జరిమానాలు విధించేందుకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. మాదాపూర్ లోని కరాచీ బేకరీ పెరల్ ప్రైవేట్ లిమిటెడ్ లోనూ అధికారులు తనిఖీలు చేపట్టారు.

6 సంస్థల లైసెన్సులు తక్షణమే సస్పెండ్ 
ప్రజారోగ్యం దృష్ట్యా వ్యాపారాన్ని వెంటనే నిలిపివేయాలని ఆదేశిస్తూ 6 సంస్థల ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సులు, రిజిస్ట్రేషన్లను సస్పెండ్ చేశారు. ముషీరాబాద్ జమిస్తాన్ పూర్ లోని వతన్ ట్రేడర్స్ లో ఈకలు, తలలు, కాళ్లు వంటి వ్యర్థాలను అపరిశుభ్రంగా పారేయడం, సికింద్రాబాద్ లోని పంజాబ్ ఫిష్ కంపెనీలో మురికి స్టోరేజీ, నీరు నిలిచి పూడిన డ్రెయిన్లు, గడువు ముగిసిన ఫ్రోజెన్ రొయ్యలు, తుప్పు కత్తులు, ఈగలు, బొద్దింకలను  గుర్తించారు. సికింద్రాబాద్ ఎస్డీ రోడ్ లోని హై ప్రోటీన్ లో గడువు ముగిసిన, లేబుల్ లేని పదార్థాలు, బతికి ఉన్న ఎలుకలు, ఫ్రీజర్ లో చనిపోయిన ఈగలు, శ్రీనగర్ కాలనీలోని కరాచీ ఐఎన్సీలో అపరిశుభ్ర కేక్ ఫ్రిజ్ లు, క్లీనింగ్ కెమికల్స్, వెజ్, నాన్ వెజ్, పచ్చి, వండిన పదార్థాలను కలిపి ఉంచడం బయటపడ్డాయి.

గగన్ పహాడ్ పెద్దమ్మగడ్డలోని కరాచీ బేకరీ పెరల్ ప్రైవేట్ లిమిటెడ్ లో ట్రాన్స్ పోర్ట్ ఎండార్స్ మెంట్ లేని లైసెన్స్, అపరిశుభ్రతతో పాటు అక్టోబర్ లో తయారైన వాటిపై నవంబర్ లేబుల్ వేయడంతో రూ. 4,34,813 విలువైన 1,012 కిలోల ప్యాక్డ్ పదార్థాలను సీజ్ చేశారు. ఉప్పల్ లక్ష్మీ నారాయణ నగర్ కాలనీలోని ఎస్ఎం సీ కార్పొరేషన్ లో సరైన లైసెన్స్ కేటగిరీ, ఇన్ సెక్ట్ స్క్రీన్లు, ఈగల బెడద, డిస్ ఇన్ఫెక్ట్ చేయని పరికరాలు ఉండటంతో లైసెన్స్ సస్పెండ్ చేసినట్లు టీజీ సేఫ్ కమిషనర్ తెలిపారు.