- పెట్రోల్‌కు బదులు 100% ఇథనాల్ ఉపయోగిస్తే లీటర్‌కు రూ.25 మాత్రమే ఖర్చు
- ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ సదస్సులో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
- రోడ్లు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: ‘దేశంలో ఏటా సుమారు 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా.. 1.8 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందులో అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే.. మృతుల్లో 66 శాతం మంది 18 నుంచి 34 ఏళ్ల మధ్య వయసున్న యువతే. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకులు, విద్యార్థులు, కుటుంబాలకు ఆధారమైన వారు అకాల మరణం చెందుతుంటే నాకు కన్నీళ్లు వస్తున్నయ్’ అని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆవేదన వ్యక్తం చేశారు.
రోడ్డు ప్రమాదాలను అరికట్టడం మనందరి బాధ్యతని, ఇంజినీరింగ్ లోపాల వల్ల ఒక్క ప్రాణం కూడా పోకూడదన్నారు. జీరో యాక్సిడెంట్స్ లక్ష్యంగా పని చేయాలని సూచించారు. గురువారం హైదరాబాద్‌లోని హైటెక్స్ లో 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్(ఐఆర్సీ) సదస్సును సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్ల నిర్మాణ నాణ్యతలో రాజీ పడితే కాంట్రాక్టర్లు, కన్సల్టెంట్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
భారత జాతీయ రహదారుల నెట్‌వర్క్ ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకుందని, ఇటీవల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌తో సహా 8 ప్రపంచ రికార్డులు సాధించామని తెలిపారు. దేశంలో ఏటా రూ.22 లక్షల కోట్ల విలువైన ముడి చమురు దిగుమతుల భారాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
వ్యవసాయం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక
వ్యవసాయం మన దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని కేంద్ర మంత్రి గడ్కరీ పేర్కొన్నారు. రహదారుల నిర్మాణంలో పెట్రోలియం ఆధారిత తారు(బిటుమిన్)కు బదులుగా వరి గడ్డి వంటి వ్యవసాయ వ్యర్థాలతో తయారయ్యే బయో-బిటుమిన్, 7 శాతం వ్యర్థ ప్లాస్టిక్, 10 శాతం పాత టైర్ల రబ్బరు పొడిని విరివిగా వాడాలని చెప్పారు. దీనివల్ల విదేశీ దిగుమతులు తగ్గడమే కాకుండా రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందన్నారు.
భవిష్యత్తులో 100% ఇథనాల్ వైపు..
వంద శాతం ఇథనాల్‌తో నడిచే స్ట్రాంగ్- హైబ్రిడ్ కార్లను వాడితే ప్రయాణ ఖర్చు లీటర్ పెట్రోల్ రూ.25 ఉన్నప్పటి ఖర్చుతో సమానంగా పడుతుందని కేంద్ర మంత్రి గడ్కరీ స్పష్టం చేశారు. చెరకు, మొక్కజొన్న వంటి పంటల నుంచి తయారయ్యే ఇథనాల్, బయోడీజిల్ వాడకాన్ని పెంచాలని కోరారు. భవిష్యత్తులో 100% బయో -ఇథనాల్ వాహనాల వైపు వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. వరి గడ్డి, సేంద్రియ వ్యర్థాల నుంచి తయారయ్యే బయో- సీఎన్‌జీని ట్రాక్టర్లు, నిర్మాణ యంత్రాలు, వాహనాల్లో ఇంధనంగా ఉపయోగించాలని సూచించారు. ట్రక్కులు, బస్సులు వంటి భారీ వాహనాలకు భవిష్యత్ ఇంధనంగా గ్రీన్ హైడ్రోజన్‌ను వినియోగించాలని, ఇందుకోసం 10 ప్రధాన హైవే కారిడార్లలో హైడ్రోజన్ ఫిల్లింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
2047కు ఎంతో ప్రాధాన్యం: సీఎం రేవంత్ రెడ్డి
రోడ్లు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2047 మనకు ఎంతో ప్రాధాన్యత ఉన్న సంవత్సరమని తెలిపారు. అప్పటికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు అవుతుందని, ఆ సమాయానికి తెలంగాణ రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇందుకోసం రాష్ట్రాన్ని 3 భాగాలుగా విభజించామని చెప్పారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చుట్టూరా ఓఆర్ఆర్ పరిధిలోని క్యూర్ ప్రాంతాన్ని సేవా రంగాలకు, ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ఆర్ వరకు ఉన్న ప్యూర్ప్రాంతాన్ని తయారీ రంగానికి, ఆర్ఆర్ఆర్ వెలుపల ఉన్న రేర్ ప్రాంతంలో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. దేశ భద్రత, జాతి ప్రయోజనాల విషయంలో రాజకీయాలకు తావు లేదని, ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలన్నారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు హైదరాబాద్‌లో నిర్వహించే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ దేశాభివృద్ధిలో, పెట్టుబడుల సాధనలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
3,500 మంది డెలిగేట్స్ హాజరు
సదస్సుకు దేశ విదేశాల నుంచి 3,500 మంది డెలిగేట్స్ హాజరయ్యారు. 19 సాంకేతిక సెషన్లు, కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. రోడ్ల నిర్మాణ రంగంలో విశేష ప్రతిభ కనబరిచిన ఇంజినీర్లను కేంద్ర మంత్రి గడ్కరీ, సీఎం రేవంత్ రెడ్డి సన్మానించారు. కార్యక్రమంలో సీఎస్సంజయ్ జాజు, ప్రభుత్వ విప్బీర్ల అయిలయ్య, ఎంపీలు ఈటెల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
