పేదరికం నుంచి 50 కోట్ల మందికి విముక్తి .. ఫిక్కీ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని మోదీ

పేదరికం నుంచి  50 కోట్ల మందికి విముక్తి ..	ఫిక్కీ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని మోదీ

గత 12 ఏళ్లలో దేశంలో 50 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. గురువారం జరిగిన ఫిక్కీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన, ప్రభుత్వ విధానాలు, సరైన సంకల్పం వల్లే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. భారత్ ఆర్థిక విపత్తు అంచున ఉందన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రధాని ఈ వివరణ ఇచ్చారు. ప్రపంచ బ్యాంకు తాజా రిపోర్టు ప్రకారం.. కేవలం 12 నుంచి 13 ఏండ్లలోనే 50 కోట్ల మంది భారతీయులు పేదరికాన్ని జయించారని ప్రధాని చెప్పారు. ‘‘1970వ దశకంలో ‘గరీబీ హఠావో’ నినాదం ఇచ్చిన సమయంలో దేశ జనాభా దాదాపు 50 కోట్లు. అప్పుడే పేదరికాన్ని రూపుమాపే అవకాశం ఉన్నప్పటికీ, అప్పటి ప్రభుత్వాల విధానాల్లో లోపాలు, సరైన సంకల్పం లేకపోవడం వల్ల అది సాధ్యం కాలేదు’’ అని మోదీ విమర్శించారు.

పారిశ్రామిక వేత్తలకు సూటి ప్రశ్న..

కార్పొరేట్ పన్ను రేటును 30% నుంచి 22 శాతానికి తగ్గించినప్పటికీ, ఆ ప్రయోజనాలతో  ఉద్యోగుల జీతాలు పెంపు, కొత్త ఉద్యోగాల కల్పన జరిగిందా? అని ప్రధాని నరేంద్ర మోదీ భారత పారిశ్రామిక రంగాన్ని  సూటిగా ప్రశ్నించారు. రైతులు, చిన్న వ్యాపారులు, పన్ను చెల్లింపుదారులను గౌరవించినప్పుడే దేశం ప్రగతి సాధిస్తుందని మోదీ అన్నారు. రూ. 12 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు ఇచ్చామని, గతంలో 8 నెలలు పట్టే పన్ను రీఫండ్‌లు ఇప్పుడు వారంలోపే అందుతున్నాయని గుర్తుచేశారు.