న్యూఢిల్లీ: నోట్లబందీ (పెద్ద నోట్ల రద్దు) ద్వారా ప్రజల జీవనోపాధిపై దెబ్బకొట్టిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు 'ఓట్ల చోరీ'తో వారి గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఇన్-ఛార్జ్ కమ్యూనికేషన్స్ జైరాం రమేశ్ ఆరోపించారు. ప్రభుత్వాన్ని జవాబుదారీగా నిలబెట్టడానికి సామాన్యుడు ఉపయోగించే శక్తిమంతమైన ఆయుధమే ఓటు అని.. ఓట్ల చోరీ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ప్రజల గొంతుకపై దాడి చేశారని మండిపడ్డారు.
దేశంలో ద్రవ్యోల్బణం బాగానే ఉందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అనురాధా ఠాకూర్ చేసిన వ్యాఖ్యలపై జైరాం రమేశ్ గురువారం 'ఎక్స్' వేదికగా స్పందించారు. ‘నోట్లబందీ, ఓట్లబందీ అనేవి ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాలు. 2016లో అధికార గర్వంతో ప్రజల సంపాదన, జీవనోపాధిపై ప్రభుత్వం దాడి చేసింది. ఇప్పుడు ప్రజల ఓట్లను, వారి గొంతును లక్ష్యంగా చేసుకుంది. తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రజాస్వామ్యంలో పేదలు, కార్మికులు, రైతులు, యువత, మధ్యతరగతి వర్గాలకు ఓటే కీలక సాధనం.
ఓటు పట్ల ఉండే భయమే ప్రభుత్వాలను ప్రజల మాట వినేలా చేస్తుంది. ఎన్నికల టైంలో జవాబుదారీతనాన్ని పెంచుతుంది. ప్రజా తీర్పుపై ప్రభుత్వానికి పట్టింపు లేనప్పుడు విధానాలన్నీ కొద్దిమంది కార్పొరేట్ ప్రయోజనాలకు అనుగుణంగా మారుతాయి’’ అని రమేశ్ పేర్కొన్నారు.
