- అగ్రిమెంట్ జరిగి ఏడాదిన్నర గడిచినా ప్రారంభం కాని పనులు
- పూడికతో ప్రాజెక్టులో సగానికి తగ్గిన నీటి నిల్వ సామర్థ్యం
- 7.6 టీఎంసీలకు గాను 3.5 టీఎంసీలే స్టోరేజీ
- 8.86 టీఎంసీల మిగులు జలాలు గోదావరిలోకి
- 68 వేల ఎకరాల ఆయకట్టు.. నీరందక రైతుల పాట్లు
మంచిర్యాల, వెలుగు: నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టులో పూడికతీత పనులు అటకెక్కినట్టే కనిపిస్తోంది. రాజస్థాన్‌కు చెందిన ఈతర్ సంస్థతో అగ్రిమెంట్ కుదిరి ఏడాదిన్నర గడిచినా పనులు ప్రారంభించడంలో జాప్యం జరుగుతోంది. ప్రాజెక్టు నిర్మించినప్పటి నుంచి ఇప్పటివరకు పూడిక తీయకపోవడంతో దాదాపు 4 టీఎంసీల మేర మట్టి, ఇసుక పేరుకుపోయినట్టు సర్వేల్లో గుర్తించారు. దీనివల్ల నీటి నిల్వ సామర్థ్యం సగానికి పైగా తగ్గింది.
ప్రాజెక్టు కెపాసిటీ 7.6 టీఎంసీలకు గాను ప్రస్తుతం 3.5 టీఎంసీలు మాత్రమే నిల్వ చేస్తున్నారు. దీని కింద నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో 68 వేల ఎకరాల ఆయకట్టు ఉన్నది. కెపాసిటీ తగ్గడంతో చివరి ఆయకట్టుకు సాగునీరందక రైతులు అనేక పాట్లు పడుతున్నారు. ఈ ఏడాది ఎల్‌నినో ఎఫెక్ట్ వల్ల పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. పంటలకు సాగునీరందక నిర్మల్, మంచిర్యాల జిల్లాల రైతులు నేటీకీ ఆందోళనలు చేస్తున్నారు.
2.8 క్యూబిక్ మీటర్ల పూడిక..
పూడికతీత పనుల కోసం రాష్ర్ట ప్రభుత్వం టెండర్లు నిర్వహించి ఈతర్ కంపెనీకి అప్పగించింది. ప్రభుత్వానికి పైసా ఖర్చు లేకుండా, ఆదాయం సమకూర్చుకునే ‘రెవెన్యూ జనరేషన్ మోడల్’ను రూపొందించారు. పూడికతీత పనుల కోసం ప్రభుత్వం కాంట్రాక్టు సంస్థకు ఎలాంటి బిల్లులు చెల్లించదు. బదులుగా పూడికలో లభించే ఇసుక, మట్టి, ఖనిజాల విక్రయం ద్వారా వచ్చే ఆదాయంలో రాయల్టీని ప్రభుత్వానికి చెల్లించాలి.
కడెం జలాశయం నుంచి సుమారు 2.8 మిలియన్ క్యూబిక్ మీటర్ల పూడికను తొలగించాలని అంచనా వేశారు. దీని నుంచి వచ్చే మట్టిని శుద్ధి చేసి, ఇసుకను వేరు చేసేందుకు ప్రాజెక్టు సమీపంలోనే ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఇందుకోసం సుమారు వంద ఎకరాల భూమిని నిర్మల్ జిల్లా అధికారులు గుర్తించారు.
ప్రాసెస్ చేసిన ఇసుకను టీజీఎండీసీ నిర్దేశించిన ధరలకు లేదా అగ్రిమెంట్లో పేర్కొన్న ప్రకారం విక్రయించి ప్రతి క్యూబిక్ మీటర్‌కు నిర్ణీత రాయల్టీని ప్రభుత్వానికి జమ చేయాలి. పూడిక వల్ల కోల్పోయిన సుమారు 4 టీఎంసీల సామర్థ్యాన్ని తిరిగి పునరుద్ధరించడమే ప్రధాన లక్ష్యం.
నోటీసులు జారీ చేసినా..
కడెంతో పాటు కరీంనగర్ జిల్లాలోని మిడ్ మానేరు, లోయర్ మానేరు రిజర్వాయర్లలో పూడికతీత టెండర్ దక్కించుకున్న ఇదే కంపెనీ అక్కడ ఏడాది కిందటే పనులు స్టార్ట్ చేసింది. కడెం ప్రాజెక్టులో నేటికీ పనులు ప్రారంభం కాకపోవడంపై రైతుల్లో ఆందోళన నెలకొన్నది. దీంతో సదరు కాంట్రాక్టు సంస్థకు ఇప్పటికే మూడుసార్లు నోటీసులు జారీ చేసినట్లు ఇరిగేషన్ అధికారులు పేర్కొంటున్నారు. వర్షాకాలం మొదలయ్యేలోపు పూడికతీత పనులను చేపట్టాలని కలెక్టర్ నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమై ఆదేశాలు జారీ చేసినా ఫలితం లేదు.
8.86 క్యూసెక్కులు గోదారిలోకి..
సకాలంలో పూడికతీత పనులు జరగకపోవడం వల్ల కడెం జలాశయ నీటి నిల్వ సామర్థ్యం సగానికి పడిపోయింది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 7.6 టీఎంసీలకు గాను 3.5 టీఎంసీలు మాత్రమే నిల్వ చేసే వీలున్నది. ప్రస్తుతం 1.7 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉండడంతో రానున్న రోజుల్లో నీటి అవసరాలు తీర్చుకోవడం కష్టతరం కానున్నది.
కడెం ప్రాజెక్టుకు ఈ ఏడాది 16.41 టీఎంసీల ఇన్‌ఫ్లో వచ్చింది. కెనాల్స్ ద్వారా 4.71 టీఎంసీలు రిలీజ్ చేయగా, మిగిలిన 8.86 టీఎంసీల మిగులు జలాలు గోదావరి పాలయ్యాయి. ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గిపోవడంతో 2027 వేసవి వరకు తాగునీటి అవసరాలకే వాడుకోవాలని నిర్ణయించారు. నవంబర్ మొదటివారంలోనే సాగునీటి విడుదలను నిలిపివేశారు. దీంతో చివరి దశలో ఉన్న వరి పంటకు నీరందించాలని నిర్మల్, మంచిర్యాల జిల్లాల రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు.
