బషీర్‌బాగ్, వెలుగు: ఓటుహక్కును విధ్వంసం చేసే కుట్ర జరుగుతోందని సుప్రీంకోర్టు రిటైర్ట్జడ్జి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు. రాజ్యాంగ విరుద్ధంగా చేపడుతున్న సర్ప్రక్రియను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో రాజ్యాంగబద్ధ ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, వేదిక కన్వీనర్ కె.రాంచంద్రమూర్తితో కలిసి హాజరయ్యారు. ఈ నెల 22న ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో నిర్వహించనున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియతో రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యానికి సవాళ్లు అనే సదస్సుకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు.
‘సర్’తో ప్రజాస్వామ్యానికి ఎదురవుతున్న ముప్పుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకే ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ హాజరై, ప్రసంగిస్తారని వెల్లడించారు. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. సులభంగా జరగాల్సిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం సంక్లిష్టంగా మార్చిందని విమర్శించారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 13.5 కోట్ల ఓట్లు, తెలంగాణలో 90 లక్షల ఓట్లు తొలగించారని ఆరోపించారు.
సీనియర్ పాత్రికేయుడు కె.రాంచంద్రమూర్తి మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్ ప్రక్రియకు వ్యతిరేకంగా మేధావులు, యువతను ఒకే వేదికపైకి తీసుకురావాలనే లక్ష్యంతో రాజ్యాంగబద్ధ ప్రజాస్వామిక వేదికను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సీనియర్ న్యాయవాది జి.జ్యోతికిరణ్, వేదిక కోఆర్డినేటర్ దీప్తి బత్తిని, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు కె.విరాహత్ అలీ తదితరులు పాల్గొన్నారు.
