ఆమ్స్టర్డామ్: రోహింగ్యా మైనారిటీలపై 2017లో మయన్మార్ సైన్యం జరిపిన దాడులు మారణహోమమే (జాతి నిర్మూలన)నని ఐక్యరాజ్యసమితికి చెందిన ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ (ఐసీజే) స్పష్టం చేసింది. మయన్మార్ మిలిటరీ చేపట్టిన అణిచివేత చర్యల వల్లే సుమారు 7.3 లక్షల మంది రోహింగ్యాలు ప్రాణరక్షణ కోసం పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌కు పారిపోయారని తెలిపింది. 80 ఏండ్ల ఐసీజే చరిత్రలో ఒక దేశాన్ని నేరుగా మారణహోమానికి బాధ్యులుగా తేల్చడం ఇదే మొదటిసారి.
2016–2017 కాలంలో మయన్మార్‌లోని ఉత్తర రఖైన్ రాష్ట్రంలో సైన్యం "క్లియరెన్స్ ఆపరేషన్స్" పేరుతో భారీ దాడులు చేసింది. ఇందులో వేలాది మంది పౌరులు చనిపోయారని.. ఇళ్లు తగలబడ్డాయని, లైంగిక హింస జరిగిందని, దాదాపు 7.3 లక్షలకు పైగా రోహింగ్యాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బంగ్లాదేశ్‌కు పారిపోయారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై గాంబియా 2019లో ఐసీజేలో కేసు దాఖలు చేసింది. 1948 నాటి మారణహోమ కన్వెన్షన్ ప్రకారమే మయన్మార్ ఈ నేరానికి పాల్పడిందని.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరింది.
క్లియరెన్స్ ఆపరేషన్ పేరుతో మారణహోమం
నెదర్లాండ్స్‌లోని ది హేగ్ నగరంలోని పీస్ ప్యాలెస్ వేదికగా ఈ కేసును గురువారం విచారించిన 15 మంది న్యాయమూర్తులతో కూడిన ఐసీజే ధర్మాసనం.. 9-6 మెజారిటీతో మయన్మార్‌ను దోషిగా తేల్చింది. ఉత్తర రఖైన్ రాష్ట్రంలోని రోహింగ్యాలను లేకుండా చేయాలనే దురుద్దేశంతోనే మయన్మార్ సైన్యం మారణహోమానికి పాల్పడిందని ఐసీజే స్పష్టం చేసింది. ఇది 1948 నాటి ‘జెనోసైడ్ కన్వెన్షన్ (మారణహోమ నిరోధక ఒప్పందం)’ నిబంధనలను ఉల్లంఘించడమేనని తేల్చిచెప్పింది.
క్లియరెన్స్ ఆపరేషన్..
2017లో మయన్మార్ భద్రతా దళాలు 'క్లియరెన్స్ ఆపరేషన్' పేరుతో సుమారు 10,000 మంది అమాయక రోహింగ్యా పౌరులను అత్యంత కిరాతకంగా హతమార్చాయని పేర్కొంది. మహిళలపై లైంగిక దాడులకు, చిన్నపిల్లలపై తీవ్ర హింసకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాణభయంతో ఇళ్లు వాకిళ్లు వదిలి సరిహద్దు దాటి బంగ్లాదేశ్‌కు పారిపోతున్న నిస్సహాయులపైనా సైన్యం దాడులు చేసిందని ధర్మాసనం గుర్తించింది.తాము కేవలం 'అరకాన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ (ఏఆర్ఎస్ఏ)' వంటి టెర్రరిస్టులపైనే పోరాడామని విచారణ సందర్భంగా మయన్మార్ చేసిన వాదనను కోర్టు తోసిపుచ్చింది.
మయన్మార్ సైన్యం ఉగ్రవాదులకు, సాధారణ పౌరులకు మధ్య ఎలాంటి తేడా చూపలేదని, ఒక జాతిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసిందని స్పష్టం చేసింది. బాధిత రోహింగ్యాలకు తగిన నష్టపరిహారం చెల్లించాలని ఐసీజే ఆదేశించింది. అలాగే, బంగ్లాదేశ్ సహా వివిధ దేశాల్లో తలదాచుకుంటున్న 7 లక్షలకు పైగా రోహింగ్యా శరణార్థులు తమ స్వస్థలాలకు సురక్షితంగా, గౌరవప్రదంగా తిరిగి వచ్చేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని తేల్చిచెప్పింది.
