బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌కు ఓట్లేసేందుకు..ప్రజలు టార్చిలైట్ వేసుకొని వస్తరు :కేటీఆర్

బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌కు ఓట్లేసేందుకు..ప్రజలు టార్చిలైట్ వేసుకొని వస్తరు :కేటీఆర్
  • ఇది ప్రజాపాలన కాదు.. అవినీతి పాలన: కేటీఆర్
  • కమీషన్ లేనిదే పనులు కావట్లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెప్తున్నరు
  • త్వరలో అన్ని స్కాంలు బయటపెడతం.. అధికారంలోకి వచ్చాక అవినీతి సొమ్ము కక్కిస్తం
  • పెన్షన్ల విషయంలో ప్రజల్ని మోసం చేస్తున్నరని ఫైర్ 

హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌కు ఓట్లేసేందుకు ప్రజలు టార్చిలైట్ వేసుకొని మరీ వస్తారని, మళ్లీ ఎగిరేది గులాబీ జెండానేనని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి రాగానే కాంగ్రెస్ నేతలు దోచుకున్న అవినీతి సొమ్మునంతా కక్కిస్తామని, ఎవరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. గురువారం తెలంగాణ భవన్‌‌‌‌‌‌‌‌లో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో భూపాలపల్లి నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ నడిపిస్తున్నది ప్రజాపాలన కాదని, పూర్తిగా అవినీతి పాలన అని మండిపడ్డారు. 

 ప్రభుత్వంలో 20 శాతం కమీషన్ ఇవ్వనిదే పనులు కావడం లేదని స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలే చెబుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో పర్సంటేజీలు ఇవ్వనిదే పనులు జరగడం లేదని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అంటుంటే, సీఎం రేవంత్ రెడ్డిపై రూ. 5 లక్షల కోట్ల దోపిడీ, టెండర్ల అవినీతి ఆరోపణలను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేస్తున్నారని కేటీఆర్ గుర్తు చేశారు. నిధులన్నీ కొడంగల్‌‌‌‌కు తరలిపోతున్నాయని, తమ నియోజకవర్గంలో పరిస్థితి ఘోరంగా ఉందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారన్నారు. తాము కేవలం పెళ్లిళ్లు, చావులకు మాత్రమే పరిమితమయ్యామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే వాపోతున్నారని, రానున్న రోజుల్లో మరిన్ని కుంభకోణాలు బయటపడతాయని పేర్కొన్నారు.

గ్యారంటీ కార్డులు ఏం చేసుకోవాలి 

పెన్షన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో 44.70 లక్షల పెన్షన్లు ఉండగా, కాంగ్రెస్ వచ్చాక మూడేళ్లలో మొత్తం 4.70 లక్షల పెన్షన్లకు కోత పెట్టిందన్నారు. కొత్తగా కేవలం 4.63 లక్షల పెన్షన్లు మాత్రమే ఇచ్చి, అంటే ఉన్నవాటికంటే 7 వేలు తగ్గించి గొప్పలు చెప్పుకోవడం విడ్డూరమన్నారు. 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని భట్టి విక్రమార్క అఫిడవిట్‌‌తో హనుమాన్ ఆలయంలో ప్రమాణం చేశారని గుర్తు చేశారు. 

క్రెడిట్ కార్డుల్లా భద్రంగా దాచుకోమన్న ఆ గ్యారంటీ కార్డులను మూడేళ్లయినా అమలు కాకపోవడంతో ప్రజలు ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలని ప్రశ్నించారు. తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రశ్నించకుండా కాంగ్రెస్, బీజేపీ నేతలు ఢిల్లీ పెద్దలకు బాడీగార్డుల్లా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.