రంగారెడ్డి కలెక్టర్‌‌ కు హైకోర్టులో ఊరట..కోర్టు ధిక్కరణ శిక్ష రద్దు

రంగారెడ్డి కలెక్టర్‌‌ కు హైకోర్టులో ఊరట..కోర్టు ధిక్కరణ శిక్ష రద్దు

హైదరాబాద్, వెలుగు: కోర్టు ధిక్కరణ కేసులో ఆరు నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా ఎదుర్కొంటున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి గురువారం హైకోర్టులో ఊరట లభించింది. సింగిల్ జడ్జి విధించిన శిక్ష, జరిమానాను హైకోర్టు రద్దు చేసింది. గతంలో కోర్టుకు వచ్చిన అభ్యర్థనను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఉత్తర్వులిచ్చింది. ఆ ఉత్తర్వులను అమలు చేయలేదని పి.శివలీల, మరొకరు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన సింగిల్ జడ్జి కలెక్టర్‌‌కు జైలు శిక్ష, జరిమానా విధించారు. 

ఆ తీర్పును సవాలు చేస్తూ కలెక్టర్ అప్పీలు దాఖలు చేయగా, జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ యారా రేణుకతో కూడిన ధర్మాసనం విచారించింది. ఉత్తర్వుల అమలుకు చర్యలు తీసుకున్నారని, కలెక్టర్ తహసీల్దార్‌‌కు, ఆర్డీవో కోర్టుకు రాసిన లేఖలు పరిశీలించాలని అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హై కోర్టు శిక్ష, జరిమానాను రద్దు చేసింది. సింగిల్ జడ్జి ఉత్తర్వుల అమలు ప్రక్రియ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను జనవరి 5కు వాయిదా వేసింది.