కోల్‌బెల్ట్/నస్పూర్, వెలుగు: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణపై అవమానకర రాజకీయాలు మానుకోవాలని, దళితుల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే సహించేది లేదని మాల మహానాడు లీడర్లు హెచ్చరించారు. గురువారం మంచిర్యాల జిల్లా నస్పూర్, చెన్నూర్ ప్రెస్‌క్లబ్‌లలో నిర్వహించిన వేర్వేరు ప్రెస్మీట్లలో వారు మాట్లాడారు. ఎంపీ వంశీకృష్ణ చేపడుతున్న అభివృద్ధి, సేవా కార్యక్రమాలను అడ్డుకోవడం, దళిత నాయకుల మధ్య విభేదాలు సృష్టించడం సరికాదని మంత్రి శ్రీధర్‌బాబుకు హితవు పలికారు. మాజీ కేంద్ర మంత్రి వెంకటస్వామి (కాకా) స్థాపించిన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు బ్యాగులు, షూస్, ఇతర విద్యా సామగ్రి అందించడం అభినందనీయమన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు హాజరైన ఎస్సీ, ఎస్టీ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను సస్పెండ్ చేయడం ఏ విధమైన రాజకీయమని ప్రశ్నించారు. విద్యార్థులకు సహాయం చేయడం, ప్రజాసేవ చేయడం తప్పా? ఎంపీ వంశీకృష్ణ చేసిన తప్పేంటో మంత్రి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు గడ్డం వెంకటస్వామి కుటుంబం అండగా నిలిచిందని, పార్టీ బలోపేతానికి విశేష కృషి చేసిందని గుర్తుచేశారు. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వంశీకృష్ణకు ఎవరో పదవి భిక్ష పెట్టారనే విధంగా మాట్లాడటం సరికాదని మండిపడ్డారు. దళిత ప్రజాప్రతినిధిని అవమానించే ప్రయత్నాలు మానుకోవాలని, మాల సామాజిక వర్గం నాయకులు, కార్యకర్తల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే సహించబోమని హెచ్చరించారు. ఎంపీ వంశీకృష్ణ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. సమావేశాల్లో మాల మహానాడు నాయకులు పైడిమల్ల నర్సింగ్, పొట్ట మధుకర్, సుద్ధమల్ల అశోక్ తేజ, దమ్మ నారాయణ, పెండ్యాల శ్రీకాంత్, భూపెల్లి మల్లన్న, పాముల వెంకటేష్, మాలెం చిన్నయ్య, దమ్మ సునీల్, జుంజుపల్లి నర్సింగ్, గద్దల తిరుపతి, సొల్లు కొమురయ్య పాల్గొన్నారు.
