అమీన్పూర్లో చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతం

అమీన్పూర్లో చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతం
  • 12 గంటల్లో కిడ్నాపర్ను అరెస్ట్​ చేసిన పోలీసులు

గచ్చిబౌలి, వెలుగు: సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​లో రెండున్నర ఏండ్ల చిన్నారి కిడ్నాప్​ కథ సుఖాంతంగా మారింది. 12 గంటల్లో శేరిలింగంపల్లి పోలీసులు కేసును ఛేదించి కిడ్నాప్​ చేసిన మహిళను అదుపులోకి తీసుకొని చిన్నారిని రక్షించారు. గురువారం గచ్చిబౌలిలోని శేరిలింగంపల్లి డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ శ్రీనివాస్​ చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించి వివరాలను తెలియజేశారు. సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలం కొర్పోల్​ గ్రామానికి చెందిన  ఎరుకుల సరిత భర్త చనిపోవడంతో ఇద్దరు కుమార్తెలతో కలిసి నగరానికి వలస వచ్చి అమీన్​పూర్​లో నివాసం ఉంటూ స్థానికంగా ఇండ్లలో పనిచేస్తుంది. 

సరిత పెద్ద కుమార్తె ఒకటవ తరగతి చదువుతుండగా, రెండవ కుమార్తె అక్షిత ఇంటి వద్దే ఉంటుంది. బుధవారం ఉదయం సరిత తన రెండవ కుమార్తెను ఇంటి వద్దే ఉంచి సమీపంలో ఉన్న ఓ టిఫిన్​ సెంటర్​ లో పనికి వెళ్లి అరగంటలో తిరిగి వచ్చింది. కానీ ఇంట్లో అక్షిత కనిపించలేదు. దీంతో చుట్టుపక్కల కుమార్తె ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేకపోవడంతో మధ్యాహ్నం అమీన్​పూర్​ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సీసీ కెమెరాలను చెక్​ చేయగా ఓ మహిళ చిన్నారిని తీసుకువెళ్లినట్లు గుర్తించారు. డీసీపీ వెంటనే ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కిడ్నాపర్​ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

చిన్నారిని కిడ్నాప్​ చేసి మహిళ కొంతదూరం నడుకుంటూ వెళ్లి ఆటో ఎక్కి లింగంపల్లి చౌరస్తాలో దిగింది. అక్కడి నుంచి బస్సులో మెదక్​ చేరుకుంది. మెదక్​ పక్కనే ఉన్న నర్స్​ఖేడ్​ గ్రామానికి వెళ్లినట్లు పోలీసులుగుర్తించి బుధవారం అర్ధరాత్రి అక్కడి చేరుకొని కిడ్నాప్​ చేసిన మహిళ కామారెడ్డి జిల్లా నిజాంసాగర్​ గ్రామానికి చెందిన గంగమణి(44)ని అదుపులోకి తీసుకొని చిన్నారి అక్షితను రక్షించారు. గంగామణిని అరెస్ట్​ చేసిన పోలీసులు చిన్నారి అక్షితను తల్లిని అప్పగించారు. కాగా, గంగామణి చిన్నారిని ఎందుకు కిడ్నాప్​ చేసింది, ఏదైనా ముఠాకు అమ్మేందుకు ప్రయత్నించిందా అనే కోణంలో విచారిస్తున్నారు. ఈ సమావేశంలో ఏడీసీపీ ఉదయ్​రెడ్డి, ఆర్సీపురం ఏసీపీ శ్రీనివాస్​, అమీన్​పూర్​ ఇన్​స్పెక్టర్​, డీఐ, సిబ్బంది పాల్గొన్నారు.