వసీం అక్రమ్‌ను వెనక్కి నెట్టిన బుమ్రా.. SENA దేశాల్లో టాప్ ప్లేస్!

వసీం అక్రమ్‌ను వెనక్కి నెట్టిన బుమ్రా.. SENA దేశాల్లో టాప్ ప్లేస్!

Jasprit Bumrah: టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) మరో అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు (4/92) పడగొట్టిన బుమ్రా, SENA దేశాల్లో (దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) టెస్టు క్రికెట్‌లో అత్యధిక సార్లు మూడు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు (3-wicket hauls) తీసిన ఆసియా బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో పాకిస్థాన్ దిగ్గజం వసీం అక్రమ్, భారత లెజెండ్ అనిల్ కుంబ్లే, ముత్తయ్య మురళీధరన్ లాంటి మేటి బౌలర్లను బుమ్రా వెనక్కి నెట్టాడు.

ప్రతి రెండు ఇన్నింగ్స్‌లకు ఒకసారి మ్యాజిక్.. బుమ్రా రికార్డు: 

వెల్లింగ్టన్ టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 368 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో బుమ్రా 29 ఓవర్లు బౌలింగ్ చేసి 92 పరుగులిచ్చి 4 వికెట్లు సొంతం చేసుకున్నాడు. సాధారణంగా పేస్, స్వింగ్‌కు అనుకూలించే SENA పిచ్‌లపై ఆసియా బౌలర్లు నిలకడగా రాణించడం చాలా కష్టం.. కానీ బుమ్రా ఈ నాలుగు దేశాల్లో కేవలం 65 ఇన్నింగ్స్‌లలోనే ఏకంగా 31 సార్లు మూడు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. అంటే ప్రతి రెండు ఇన్నింగ్స్‌లకు దాదాపు ఒకసారి 3+ వికెట్ల ప్రదర్శన చేశాడన్నమాట. 

వసీం అక్రమ్, కుంబ్లే, మురళీధరన్ స్థానం ఎక్కడంటే: 

SENA దేశాల్లో అత్యధిక 3+ వికెట్ల ప్రదర్శనలు చేసిన ఆసియా బౌలర్ల టాప్-6 జాబితాను పరిశీలిస్తే బుమ్రా ఆధిపత్యం ఎంటో క్లియర్ గా కనిపిస్తుంది. పాక్ మాజీ పేసర్ వసీం అక్రమ్ 55 ఇన్నింగ్స్‌లలో 27 సార్లు ఈ రికార్డు సాధించి రెండో స్థానంలో ఉండగా, బుమ్రా అతడి కంటే నాలుగు ప్రదర్శనలు ఎక్కువ చేశాడు. భారత మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే (67 ఇన్నింగ్స్‌లలో 25 సార్లు) మూడో స్థానంలో, శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ (34 ఇన్నింగ్స్‌లలో 23 సార్లు) నాలుగో స్థానంలో నిలిచారు. భారత పేసర్లు జహీర్ ఖాన్ (22 సార్లు), ఇషాంత్ శర్మ (21 సార్లు) ఐదు, ఆరు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇప్పటికే SENA దేశాల్లో అత్యధిక టెస్టు వికెట్లు తీసిన ఆసియా బౌలర్‌గా వసీం అక్రమ్‌ను అధిగమించిన బుమ్రా, ఈ రికార్డుతో విదేశీ గడ్డపై తన తిరుగులేని ఆధిపత్యాన్ని మరోసారి చాటుకున్నాడు. 

 

ర్యాంక్      బౌలర్ పేరు   దేశం  ఇన్నింగ్స్  3+ వికెట్ల ప్రదర్శనలు
         
1   జస్ప్రీత్ బుమ్రా భారత్   65 31
2   వసీం అక్రమ్ పాకిస్థాన్ 55 27
3   అనిల్ కుంబ్లే భారత్ 67 25
4 ముత్తయ్య మురళీధరన్ శ్రీలంక 34 23
5 జహీర్ ఖాన్ భారత్ 53 22
6 ఇషాంత్ శర్మ భారత్ 71 21