25 రోజుల్లో 52 లక్షల పెళ్లిళ్లు: ఇండియాలో ఆల్ టైం రికార్డ్

25 రోజుల్లో 52 లక్షల పెళ్లిళ్లు: ఇండియాలో ఆల్ టైం రికార్డ్

భారతదేశం బ్యాండ్ బాజాలతో మారుమోగనుంది. పల్లెలోని గల్లీ నుంచి ఢిల్లీ వరకు పెళ్లిళ్లతో సందడిగా మారనుంది. లక్ష.. రెండు, మూడు లక్షలు కాదు.. ఈసారి ఏకంగా 52 లక్షల పెళ్లిళ్లు జరగనున్నాయి. అది కూడా జస్ట్ 25 అంటే 25 రోజుల్లోనే.. ఈ లెక్కన రోజుకు ఎన్ని పెళ్లిళ్లు జరగనున్నాయో ఊహించుకోండి. నవంబర్ 21 నుంచి డిసెంబర్ 15 వరకూ ఇన్ని లక్షల పెళ్లిళ్లు జరగడం రికార్డ్ అనే చెప్పాలి. ఈ 25 రోజుల్లో యావరేజ్ గా రోజుకు 2 లక్షల పెళ్లిళ్లు జరగనున్నాయి.

కాన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనా ప్రకారం.. ఈ 52 లక్షల పెళ్లిళ్లతో.. దేశంలో 7 లక్షల కోట్ల వ్యాపారం జరగనున్నట్లు అంచనా వేస్తుంది. 25 రోజుల్లో 52 లక్షల పెళ్లిళ్లు అంటే.. ఇది ఇండియాలో ఆల్ టైం రికార్డ్ అని అంచనా వేస్తోంది కాన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్. దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాల్లోని 300 మంది వాణిజ్య ప్రతినిధులు, 550 ట్రేడ్ అసోసియేషన్లతో సంప్రదింపులు జరిపిన తర్వాత CAIT రీసెర్చ్ వింగ్ ఈ నివేదికను వెల్లడించింది.

ఒక్క దేశ రాజధాని ప్రాంతం (Delhi-NCR)లోనే ఈ సీజన్‌లో సుమారు ఐదు లక్షల పెళ్లిళ్లు జరగవచ్చని ఈ నివేదిక వెల్లడించింది. కేవలం ఈ ప్రాంతం నుంచే రూ.2.5 లక్షల కోట్ల బిజినెస్ వస్తుందని ట్రేడర్లు ఆశిస్తున్నారు. ముఖ్యంగా చాందీ చౌక్, సదర్ బజార్, కరోల్ బాగ్, లాజ్‌పత్ నగర్ వంటి హోల్‌సేల్ మార్కెట్లు ఈ సీజన్‌లో బిజీగా ఉండనున్నాయి. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా కొనుగోలుదారులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని సంస్థ తెలిపింది.

రంగాల వారీగా అంచనాలు మొత్తం వ్యాపారంలో వస్తువుల కొనుగోలు (Retail Purchases) వాటా 54 శాతం (రూ. 4.05 లక్షల కోట్లు) ఉండగా, సేవల రంగం (Services) వాటా 46 శాతం (రూ. 3.45 లక్షల కోట్లు) ఉంటుందని అంచనా.

  • జువెలరీ: రూ. 1.2 లక్షల కోట్లు
  • దుస్తులు (Apparel): రూ. 90 వేల కోట్లు
  • గిఫ్ట్స్, ఇతర యాక్సెసరీస్: రూ. 37,500 కోట్లు
  • మిఠాయిలు, డ్రై ఫ్రూట్స్: రూ. 30,000 కోట్లు
  • ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయన్సెస్: రూ. 30,000 కోట్లు

క్యాటరింగ్ రంగానికి రూ. 75 వేల కోట్లు, హోటళ్లు, ఫంక్షన్ హాళ్లకు రూ. 60 వేల కోట్లు, ఈవెంట్ మేనేజ్మెంట్ రంగానికి రూ. 37 వేల 500 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని CAIT తెలిపింది. ఈ పెళ్లిళ్ల సీజన్ వల్ల కోటికి పైగా తాత్కాలిక ఉద్యోగాలు సమకూరి ఉపాధి రంగానికి కూడా కొంత ఊతమిచ్చినట్టవుతుందని తెలిపింది. క్యాటరింగ్, డెకరేషన్, ఫోటోగ్రఫీ, బ్యూటీ సర్వీసెస్, ట్రాన్స్‌పోర్ట్, ఈవెంట్ మేనేజ్మెంట్ రంగాల్లో సుమారు 1.25 కోట్ల తాత్కాలిక, సీజనల్ ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.

పెరుగుతున్న ఖర్చులు పెళ్లిళ్ల ఖర్చుపై కూడా CAIT ఆసక్తికరమైన గణాంకాలను ఇచ్చింది. మధ్యతరగతి వివాహాలకు రూ. 4-5 లక్షల నుంచి మొదలై, ప్రీమియం వివాహాలకు రూ. 5 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నారని తెలిపింది. గత కొన్నేళ్లుగా వెడ్డింగ్ బిజినెస్ గ్రాఫ్ క్రమంగా పెరుగుతోంది. 2022లో రూ. 3.75 లక్షల కోట్లుగా ఉన్న ఈ బిజినెస్, 2024లో రూ. 5.90 లక్షల కోట్లకు చేరింది.

►ALSO READ | వణుకుతున్న కాశ్మీరం.. మైనస్లో ఉష్ణోగ్రతలు

2025లో సుమారు 46 లక్షల పెళ్లిళ్ల ద్వారా రూ. 6.50 లక్షల కోట్ల వ్యాపారం జరిగినట్లు అంచనా. దేశీయ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని, దీనివల్ల స్థానిక తయారీదారులు, కళాకారులు మరియు చిన్న వ్యాపారులకు మేలు జరుగుతుందని CAIT సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ పేర్కొన్నారు. ఈ సీజన్ దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.