- శ్రీనగర్‌లో మైనస్ 0.2 డిగ్రీల టెంపరేచర్ నమోదు
- ఈ సీజన్‌లోనే అత్యల్పం
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో ఈ సీజన్‌లోనే అత్యంత తక్కువగా మైనస్ 0.2 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కంటే 0.9 డిగ్రీలు తక్కువ. కాశ్మీర్ లోయ అంతటా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయని, పహల్గామ్, గుల్మార్గ్ తదితర పర్యాటక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీల కంటే దిగువకు చేరుకున్నాయని అధికారులు గురువారం వెల్లడించారు. జమ్మూకాశ్మీర్‌లోనే అత్యల్పంగా షోపియాన్‌లో మైనస్ 3.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
పహల్గామ్‌లో మైనస్ 2.8 డిగ్రీలు, ఉత్తర కాశ్మీర్‌లోని స్కీ రిసార్ట్ గుల్మార్గ్‌లో మైనస్ 1.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు కాశ్మీర్ ముఖద్వారం ఖాజీగుండ్‌లో మైనస్ 0.8 డిగ్రీలు, కుప్వారాలో మైనస్ 1.3 డిగ్రీలు నమోదు కాగా, కోకర్‌నాగ్‌లో కాస్త మెరుగ్గా1.0 డిగ్రీ ఉష్ణోగ్రత రికార్డయింది. గురువారం ఉదయం సూర్యుడు ఉదయించినప్పటికీ, మంచు కొండల నుంచి వీస్తున్న చలిగాలుల తీవ్రత ఏమాత్రం తగ్గలేదు. జలాశయాలు ఇంకా గడ్డకట్టనప్పటికీ, చాలాచోట్ల మంచు పేరుకుపోవడం మొదలై శీతాకాలపు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
రాబోయే రోజుల్లో..
జమ్మూ ప్రాంతంలోని భదేర్వాలో 2.2 డిగ్రీలు, బటోట్‌లో 5.7, బనిహాల్‌లో 8.7, జమ్మూ సిటీలో 10.8, కత్రాలో 10.9 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నెలాఖరు వరకు కాశ్మీర్ అంతటా పొడి వాతావరణమే ఉంటుందని, రాబోయే రోజుల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కాశ్మీర్లో డిసెంబర్ 21 నుంచి 40 రోజులు కొనసాగే ‘చిల్లై కలాన్’ సమీపిస్తున్నందున చలి తీవ్రత మరింత పెరగనుంది. ఆ టైంలో పగటి ఉష్ణోగ్రతలు 9 డిగ్రీలు దాటడం అరుదుగా ఉంటుందని, రాత్రి వేళల్లో టెంపరేచర్లు మైనస్ డిగ్రీలకు పడిపోతాయని అధికారులు తెలిపారు.
