రోజువారీ జీవితంలోని చిన్నచిన్న విషయాలను పంచుకోవడానికి మొదలైన ఒక ప్రయత్నం.. ఒక నర్స్ జీవితాన్నే మార్చేసింది. సుమారు ఏడాదిన్నరగా పైగా తన నర్సింగ్ ఉద్యోగంతో పాటు కంటెంట్ క్రియేషన్ చేస్తూ వచ్చిన సారాఆన్ అనే అమెరికన్ మహిళ, తన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కడంతో ఫుల్ టైం సోషల్ మీడియా క్రియేటర్‌గా మారడానికి తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. బ్రాండ్ డీల్స్ ద్వారా వచ్చిన ఆదాయం ఆమెకు ఏడాదికి వచ్చే జీతాన్ని మించిపోవడమే ధైర్యంగా ముందుకెళ్లేందుకు కారణమైంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో తన ప్రయాణాన్ని పంచుకున్న సారా ఆన్, జస్ట్ 7 నెలల్లో బ్రాండ్ కొలాబరేషన్ల ద్వారా సుమారు రూ. 82 లక్షల ఆదాయం సంపాదించటం ఆత్మవిశ్వాసాన్ని పెంచిందన్నారు. కంటెంట్ క్రియేషన్‌పై మరింత దృష్టి పెట్టడంతో పాటు తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలనే ఉద్దేశంతోనే 9-టు-5 నర్స్ ఉద్యోగాన్ని వదిలేశానని చెప్పారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి ధైర్యాన్ని ఇచ్చిన ఆర్థిక లెక్కలను వీడియోలో పంచుకున్నారు.
సోషల్ మీడియాలో అడుగుపెట్టిన మెుదట్లో తన రోజువారీ జీవితాన్ని ఎవరు చూస్తారోనన్న అనుమానం తనకు ఉండేదని సారా ఆన్ గుర్తు చేసుకున్నారు. ఇంట్లో ఉండే, నర్స్‌గా పనిచేసే ఒక సింగిల్ మామ్ జీవితాన్ని ఎవరు చూడాలనుకుంటారులే అనుకున్నానని తన అనుభవాలను పంచుకున్నారు. కానీ తనను ఇక్కడిదాకా నడిపించినందుకు ఎంతో అదృష్టవంతురాలిని అంటూ ఫాలోవర్లకు చెప్పారు. షేర్ చేసుకోవటానికి ప్రతి ఒక్కరి జీవితంలోనూ స్టోరీ ఉంటుందంటూ ఎమోషనల్ అయ్యారు.
ఈ ఏడు నెలల కాలంలో ఆమె ఆర్జించిన మొత్తం విలువ సుమారు రూ.కోటి 75లక్షలు కాగా.. అది కేవలం బ్రాండ్ డీల్స్ ద్వారా వచ్చిన సొమ్ము మాత్రమేనని ఆమె స్పష్టం చేశారు. ఇందులో డిజిటల్ ఉత్పత్తులు, సోషల్ మీడియా వ్యూస్, అఫిలియేట్ లింకుల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆమె కలపలేదు. ఈ ఏడాది మే నెలలో తన తొలి బ్రాండ్ డీల్‌పై సంతకం చేశానని, ఆ తర్వాత నుంచి నవంబర్ వరకు ప్రతి నెలా ఏదో ఒక స్థాయిలో కొలాబరేషన్లు కొనసాగాయని ఆమె తెలిపారు.
►ALSO READ | రోహింగ్యాలపై మయన్మార్ది మారణహోమమే.. దోషిగా తేల్చిన ఇంటర్నేషనల్ కోర్ట్
అయితే, బ్రాండ్ డీల్స్ ద్వారా వచ్చిన మొత్తం సొమ్ము పూర్తిగా తన చేతికి రాలేదని సారా ఆన్ వివరించారు. బ్రాండ్లతో సంప్రదింపులు జరిపి, డీల్స్ కుదుర్చే ఏజెన్సీకి కొంత కమీషన్ వెళ్తుందని, అలాగే పన్నుల కోసం సాధారణంగా 25% నుంచి 35% వరకు పక్కన పెట్టాల్సి ఉంటుందని ఆమె చెప్పారు. ఇవన్నీ పోగా తనకు రూ.82లక్షల వరకూ మిగులుతుందని చెప్పారు.
