తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పెట్టుబడుల ఆకర్షణపై మొదలైన పోటీ ఇప్పుడు ఉద్యోగుల వలసలు, తొలగింపులు, డేటా లీక్ ఆరోపణల వరకూ వెళ్లింది. తమిళనాడు ప్రభుత్వ పెట్టుబడుల ప్రోత్సాహక సంస్థ 'గైడెన్స్' (Guidance) నుంచి కీలక ఉద్యోగులు తప్పుకుని, పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు (EDB)లో చేరడం ఈ వివాదానికి కారణమైంది. ఈ నేపథ్యంలో తన సంస్థ నుంచి బయటకు వెళ్లే ఉద్యోగులపై కఠిన నిబంధనలు విధించాలని తమిళనాడు ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఎకనామిక్ టైమ్స్ (ET) నవంబర్ 20న నివేదించింది.
ప్రస్తుత సమాచారం ప్రకారం.. జూలై నెలలో 'గైడెన్స్' సంస్థ నుంచి సుమారు 15 మంది ఉద్యోగులు తప్పుకున్నారు. ప్రభుత్వమే వీరిని తప్పించిందనే ప్రచారం కూడా ఉంది. వీరిలో ముగ్గురు ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల విభాగానికి చెందిన ఈడీబీలో చేరారు. అయితే, వీరు తమిళనాడుకు సంబంధించిన అత్యంత గోప్యమైన పెట్టుబడి సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్‌కు చేరవేస్తున్నారనే ఆరోపణలు రావడంతో వివాదం మరో మలుపు తిరిగింది. మాజీ ఉద్యోగులు ఈ ఆరోపణలను తోసిపుచ్చగా, ఎవరినీ వేధించడం లేదని తమిళనాడు ప్రభుత్వ అధికారి ఒకరు స్పష్టం చేశారు.
మే నెలలో ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గైడెన్స్ సంస్థలో భారీ మార్పులు జరిగాయి. జూన్ 30న ఇద్దరు ఉద్యోగులను రాజీనామా చేయాలని కోరినట్లు సమాచారం. అందులో ఒక ఉద్యోగికి రిలీవింగ్ లెటర్ ఇచ్చి, వెనకటి తేదీతో రాజీనామా పత్రాన్ని సమర్పించాలని ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాతి వారంలోనే మరో 15 మంది ఉద్యోగులు రాజీనామా చేశారు. డేటా లీక్‌పై ఒక ఉద్యోగిని పోలీసు ఫిర్యాదు చేస్తామని బెదిరించినట్లు కొందరు మాజీ సిబ్బంది పేర్కొన్నారు.
మరోవైపు, ఈ రాజీనామాల గురించి తెలిసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఆ ఉద్యోగులను ఈడీబీలోకి ఆహ్వానించాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. అలా చేరిన ముగ్గురు ఉద్యోగులు ఇటీవల విశాఖపట్నంలో జరిగిన సీఐఐ (CII) భాగస్వామ్య సదస్సులో చురుగ్గా పాల్గొన్నారు. ఈ సదస్సులో ఏపీ సుమారు రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడి ఒప్పందాలను కుదుర్చుకుంది. ఈ సందర్భంగా ఆ ముగ్గురు ఉద్యోగులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సత్కరించారు.
►ALSO READ | తీరం దాటుతున్న అక్వాన్ తుఫాన్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
గైడెన్స్ మాజీ ఉద్యోగి క్రిస్టో లారెల్ తన కొత్త బాధ్యతల గురించి లింక్డ్ఇన్లో పోస్ట్ చేయడంతో ఈ వ్యవహారం మళ్ళీ తెరపైకి వచ్చింది. డేటా లీక్ ఆరోపణలతోనే ఉద్యోగులను తొలగించారని కొన్ని స్థానిక ఛానళ్లు కథనాలను ప్రసారం చేశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో గైడెన్స్ సంస్థ కొత్త నిబంధనలను పరిశీలిస్తోంది. దీని ప్రకారం, సంస్థ నుంచి తప్పుకున్న ఉద్యోగులు ఏడాది వరకు ఇతర రాష్ట్రాల పెట్టుబడి సంస్థల్లో కానీ, బిగ్ ఫోర్ కన్సల్టింగ్ కంపెనీల్లో కానీ చేరకూడదనే 'కూలింగ్ ఆఫ్ పీరియడ్' (Cooling-off period) ప్రతిపాదన తెచ్చారు. అలాగే.. కనీసం రెండేళ్ల పాటు సంస్థలో పనిచేయాలనే లాక్-ఇన్ పీరియడ్ (Lock-in period) కూడా పరిశీలనలో ఉంది.
తమిళనాడులో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్టర్ అవుట్‌రీచ్ కార్యక్రమంపై పోలీసులు నిఘా పెట్టారని కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే, పోలీస్ నిఘా కానీ, క్రిమినల్ కేసుల బెదిరింపులు కానీ లేవని తమిళనాడు అధికారి తెలిపారు. ఉద్యోగుల వలసలు సహజంగానే జరిగాయని ఆయన పేర్కొన్నారు. ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా డేటా లీక్ ఆరోపణలను కొట్టిపారేశారు. రాష్ట్ర పారిశ్రామిక విధానాలు, వాతావరణాన్ని చూసే పెట్టుబడులు వస్తాయని ఆయన స్పష్టం చేశారు.
గైడెన్స్ వ్యవహారంపై మాజీ మంత్రి, డీఎంకే నేత టీఆర్బీ రాజా స్పందిస్తూ.. టీవీకే ప్రభుత్వం అధికారులను సరిగ్గా చూసుకోవడం లేదని విమర్శించారు. గత ఏఐఏడీఎంకే హయాంలో నియమితులైన నిపుణులను కూడా డీఎంకే ప్రభుత్వం గౌరవించిందని, సంస్థలకు రాజకీయాల కంటే వృత్తిపరమైన నాయకత్వం ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మొత్తం వివాదంపై గైడెన్స్ సంస్థ కానీ, ఆంధ్రప్రదేశ్ ఈడీబీ కానీ అధికారికంగా స్పందించలేదు.
