WTC ర్యాంకింగ్స్‌లో సౌతాఫ్రికా టాప్.. ఫైనల్ రేసులో టీమిండియా ఉండేది కష్టమే!

WTC ర్యాంకింగ్స్‌లో సౌతాఫ్రికా టాప్.. ఫైనల్ రేసులో టీమిండియా ఉండేది కష్టమే!

WTC Points Table : ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ రేసు ఒక్కసారిగా వేడెక్కింది. జొహన్నెస్‌బర్గ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య దక్షిణాఫ్రికా (South Africa) 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి 2 మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. గురువారం (నవంబర్ 19న) నాడు ముగిసిన ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా సఫారీలు WTC పాయింట్ల పట్టికలో తమ అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోగా, నాలుగో స్థానంలో ఉన్న భారత జట్టు (Team India) ఫైనల్ లెక్కలు మరింత కఠినంగా మారాయి.

హార్మర్ స్పిన్ మాయాజాలం.. 168 రన్స్కే బంగ్లా ఆలౌట్: 

తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 400 రన్స్ చేయగా, దక్షిణాఫ్రికా 557 పరుగుల భారీ స్కోరు సాధించి 157 పరుగుల ఆధిక్యాన్ని అందుకుంది. అనంతరం ఓవర్‌నైట్ స్కోరు 100/5తో చివరి రోజు రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన బంగ్లా, సఫారీ ఆఫ్ స్పిన్నర్ సైమన్ హార్మర్ (6/51) ధాటికి విలవిలలాడింది. చివరి రోజు పడ్డ ఐదు వికెట్లలో 4 హార్మర్ ఖాతాలోకే వెళ్లగా, కగిసో రబాడ 3 వికెట్లు పడగొట్టాడు. లిటన్ దాస్ (39) మినహా మిగిలిన బ్యాటర్లు చేతులెత్తేయడంతో బంగ్లాదేశ్ 168 పరుగులకే ఆలౌటైంది. 12 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 1.3 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. మ్యాచ్ మొత్తంలో 8 వికెట్లతో పాటు 72 రన్స్ కొట్టిన కగిసో రబాడకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఇరు జట్ల మధ్య సోమవారం (నవంబర్ 23) నుంచి సెంచూరియన్‌లో రెండో టెస్టు ప్రారంభంకానుంది. 

WTC పాయింట్ల పట్టికలో సఫారీల హవా.. భారత్ ఏ ప్లేస్: 

ఈ గెలుపుతో ప్రోటీస్ టీమ్ 75.00 విజయాల శాతంతో (PCT) WTC పాయింట్ల పట్టికలో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాతి స్థానాల్లో న్యూజిలాండ్ (72.22%), ఆస్ట్రేలియా (69.23%) నిలిచాయి. ఇక టీమిండియా 51.52 గెలుపు శాతంతో నాలుగో స్థానంలో ఉండగా, ఓటమి పాలైన బంగ్లాదేశ్ (40.74%) ఐదో స్థానానికి ఫిక్స్ అయింది. 

►ALSO READ | BCCI బిగ్ అప్‌డేట్.. 2027 వన్డే వరల్డ్ కప్‌లో రోహిత్, కోహ్లీ ఆడటం ఫిక్స్!

టీమిండియా WTC ఫైనల్ చేరాలంటే ఏం చేయాలంటే: 

ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియా WTC ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోవాలంటే కనీసం 63 నుంచి 65 విజయాల శాతాన్ని అందుకోవాల్సి ఉంది. ఇందుకోసం భారత్ ముందు రెండు అతిపెద్ద సవాళ్లు ఉన్నాయి. ముందుగా ప్రస్తుతం కివీస్ గడ్డపై జరుగుతున్న 2 టెస్టుల సిరీస్‌ను భారత్ కనీసం 1–0 లేదా 2–0 తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ న్యూజిలాండ్ చేతిలో సిరీస్ ఓడిపోతే ఇండియన్ టీమ్ ఫైనల్ ఆశలు దాదాపు గల్లంతైనట్లే.. అనంతరం స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే 5 టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని కనీసం 4–1 తేడాతో కైవసం చేసుకోవాలి.. అప్పుడే న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలను వెనక్కి నెట్టి టీమిండియా ఫైనల్‌కు దూసుకెళ్లే ఛాన్స్ ఉంటుంది.