నవంబర్ 19, 20 తేదీల మధ్య అంతరిక్షంలో ఒక ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. భూమికి సమీపంగా 5 గ్రహశకలాలు(ఆస్టిరాయిడ్స్) దూసుకెళ్లడంతో ఖగోళ శాస్త్రవేత్తలు వాటి కదలికలను నిశితంగా పరిశీలించారు. ఈ గ్రహశకలాల రాకపై నాసా సహా అంతరిక్ష సంస్థలు హై అలర్ట్ ప్రకటించి.. నిరంతరం వాటి గమనాన్ని ట్రాక్ చేశాయి. 10 మీటర్ల నుంచి 120 మీటర్ల వరకు పరిమాణం ఉన్న ఈ అంతరిక్ష శిలలు భూమికి అత్యంత సమీపంగా వచ్చి వెళ్లినా.. ప్రస్తుతానికి ఎటువంటి ముప్పు లేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.
ఈ 5 గ్రహశకలాల్లో '2026 VA11' నవంబర్ 19న భూమికి అత్యంత దగ్గరగా, దాదాపు 33 లక్షల 50వేల కిలోమీటర్ల దూరంలో ప్రయాణించింది. గంటకు సుమారు 32వేల040 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన దీని పరిమాణం 10 నుంచి 22 మీటర్ల మధ్య ఉంది. అదే రోజున 50 నుంచి 110 మీటర్ల వెడల్పు ఉన్న పెద్ద గ్రహశకలం '2026 TB84' సుమారు 46 లక్షల 40వేల కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లింది. ఇక ఈ జాబితాలో అత్యంత వేగవంతమైనది '2018 NE1' గ్రహశకలం. 50 నుంచి 120 మీటర్ల పరిమాణం ఉన్న ఇది గంటకు 47వేల880 కిలోమీటర్ల వేగంతో.. సుమారు 63 లక్షల 80వేల కిలోమీటర్ల దూరంలో పయనించింది. వీటితో పాటు '2007 WK3' సుమారు 54లక్షల 70వేల కిలోమీటర్ల దూరంలో, నవంబర్ 20న '2026 VD6' దాదాపు 40 లక్షల కిలోమీటర్ల దూరంలో భూమిని దాటాయి.
►ALSO READ | 13 ఏళ్ల నిరీక్షణకు తెర.. భారత్లో GTA 6 లాంచ్: ధర, డౌన్లోడ్ స్టెప్స్ తెలుసుకోండి!
గ్రహశకలాల రాకపై నాసా హై అలర్ట్ పాటించడం వెనుక స్పష్టమైన వ్యూహం ఉంది. భూమికి దగ్గరగా వచ్చే ఆస్టిరాయిడ్ల కక్ష్యలను ఖచ్చితంగా లెక్కించడం, వాటి భవిష్యత్ గమనంలో ఉండే ప్రమాదాలను గుర్తించడం ద్వారా భూమిని రక్షించేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమవుతారు. ముఖ్యంగా 140 మీటర్ల కంటే పెద్దవి భూమిని తాకితే తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది. అందుకే కేవలం ఎంత దగ్గరగా వస్తున్నాయనే కాకుండా.. భవిష్యత్తులో వాటి కక్ష్య భూమి కక్ష్యను దాటే అవకాశం ఉందా లేదా అనే కోణంలో నాసా నిరంతరం అధ్యయనం చేస్తోంది.
