భారతీయ వంటకాలు మరోసారి అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాయి. ఉదయం టిఫిన్ దగ్గర నుంచి సాయంత్రం స్నాక్స్ వరకు ఎంతోమంది ఇష్టంగా తినే మసాలా ఆమ్లెట్, అండా బుర్జీలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ప్రపంచంలోని 50 ఉత్తమ గుడ్డు వంటకాల జాబితాలో మన దేశానికి చెందిన ఈ రెండు వంటకాలు చోటు దక్కించుకున్నాయి. ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ గైడ్ టేస్ట్ అట్లాస్ తాజాగా ఈ ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది.
మసాలా ఆమ్లెట్‌కు ప్రమోషన్.. అండా బుర్జీకి ప్రత్యేక స్థానం
తాజా ర్యాంకింగ్స్‌లో భారతీయ మసాలా ఆమ్లెట్ అదరగొట్టింది. గతంలో 22వ స్థానంలో ఉన్న ఈ వంటకం ఈసారి రెండు స్థానాలు మెరుగుపరుచుకుని 20వ ర్యాంకును చేరుకుంది. ఇక స్ట్రీట్ ఫుడ్ ప్రియులకు ఎంతో ఇష్టమైన అండా బుర్జీ 34వ స్థానంలో నిలిచింది. దీంతో భారతీయుల రోజువారీ ఆహారంలో భాగమైన ఈ రెండు వంటకాలకు అంతర్జాతీయ స్థాయిలో ఫుడీలను ఆకట్టుకుంది.
జపాన్ వంటకానికి నంబర్ వన్ స్థానం
టేస్ట్ అట్లాస్ ప్రకటించిన ఈ జాబితాలో జపాన్‌కు చెందిన అజిత్సుకే తమాగో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ప్రత్యేకమైన పద్ధతిలో ఉడికించి, రుచికరమైన సోయా మిశ్రమంలో నానబెట్టే ఈ గుడ్డు వంటకం ప్రపంచవ్యాప్తంగా ఫుడ్ లవర్స్‌ను ఆకట్టుకుంది.
మన వంటకాలకు ఎందుకంత ప్రత్యేకత?.
మసాలా ఆమ్లెట్, అండా బుర్జీల ప్రత్యేకత వాటి తయారీ విధానంలోనే ఉందని చెప్పవచ్చు. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కారం, మసాలా దినుసులు కలిపి తయారు చేసే మసాలా ఆమ్లెట్ ప్రత్యేకమైన రుచిని అందిస్తుంది. ఇక అండా బుర్జీలో గుడ్లను ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, వివిధ మసాలాలతో కలిపి వేయించడం వల్ల అదిరిపోయే టేస్ట్ వస్తుంది.
తక్కువ సమయంలో సులభంగా తయారయ్యే ఈ వంటకాలు సామాన్యుల నుంచి ఫుడ్ లవర్స్ వరకు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు అదే రుచికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు రావడంతో భారతీయ ఆహార ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
