సైబర్ దాడిలో జేపీ మోర్గాన్, వీసా, మాస్టర్‌కార్డ్ యూజర్ల సమాచారం లీక్.. కంపెనీలు ఉక్కిరిబిక్కిరి!

సైబర్ దాడిలో జేపీ మోర్గాన్, వీసా, మాస్టర్‌కార్డ్ యూజర్ల సమాచారం లీక్.. కంపెనీలు ఉక్కిరిబిక్కిరి!

గత కొన్ని రోజులుగా టెక్ రంగంలో తుఫాను చెలరేగింది. ఒకవైపు ఎయిర్‌లైన్స్ ఆగిపోయాయి.. మరోవైపు బ్యాంకింగ్ లావాదేవీలు నిలిచిపోయాయి. ఇంకోవైపు కీలకమైన ప్రభుత్వ వ్యవస్థలు సైతం మొరాయించాయి. ఈ వరుస షాక్‌ల మధ్య జేపీ మోర్గాన్ చేజ్ కస్టమర్ల డేటా లీక్ కావడం.. అలాగే పేమెంట్ దిగ్గజాలు వీసా, మాస్టర్‌కార్డ్ కస్టమర్ల డేటా లీక్ కావటం ఇప్పుడు సంచలనంగా మారింది. అమెరికా నేషనల్ సైబర్ డైరెక్టర్ షాన్ కెయిర్న్‌క్రాస్‌ను వైట్ హౌస్ తొలగించడం దీనికి మరింత ఆజ్యం పోసింది. ఈ అటాక్ వెనుక రష్యన్ హ్యాకర్లు ఉన్నట్లు తెలుస్తోంది.

జేపీ మోర్గాన్ చేజ్‌కు సేవలందించే థర్డ్-పార్టీ వెండర్లపై జరిగిన సైబర్ దాడి వల్ల వేలాది మంది కస్టమర్లు, కొందరు ఉద్యోగుల ఈమెయిల్ అడ్రస్‌లు, ఫోన్ నంబర్లు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం అయ్యాయి. కోట్లాది మంది కస్టమర్లు ఉన్న చేజ్, బిలియన్ల కొద్దీ యూజర్లు ఉన్న వీసా, మాస్టర్‌కార్డ్‌లతో పోలిస్తే ఇది చిన్న భాగమే అయినప్పటికీ.. డేటా భద్రతపై మాత్రం పెద్ద ప్రశ్నలే లేవనెత్తింది. మార్కెటింగ్ డేటా మాత్రమే దొంగిలించబడిందని, బ్యాంకింగ్ సేవలకు ఎలాంటి అంతరాయం లేదని జేపీ మోర్గాన్ స్పష్టం చేస్తూ.. బాధితులకు క్రెడిట్ మానిటరింగ్ సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చింది.

ఈ వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా పెద్దపెద్ద కంపెనీల్లో జరిగిన వరుస అంతరాయాలు అందరినీ కలవరపెట్టాయి. మైక్రోసాఫ్ట్ 365 సేవలు, అవుట్‌లుక్, టీమ్స్, కోపైలట్ వంటివి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోవడానికి సర్వర్ అప్‌గ్రేడ్‌లోని లోపం కారణమని కంపెనీ తెలిపింది. విమానయాన రంగంలో ఎఫ్ఏఏ నెట్‌వర్క్ సమస్య వల్ల 25 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 4 గంటలకు పైగా గ్రౌండ్ స్టాప్ విధించాల్సి వచ్చింది. ఆ వెంటనే యునైటెడ్ ఎయిర్‌లైన్స్ కూడా ఇదే తరహా సమస్యను ఎదుర్కొంది.

బ్యాంకింగ్ రంగంలోనూ సాఫ్ట్‌వేర్ బగ్ కారణంగా జేపీ మోర్గాన్ లావాదేవీల్లో జాప్యం జరగడం ఆర్థిక వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. దీనికి తోడు ఆపిల్ మ్యూజిక్, యాప్ స్టోర్, మారియట్ లాగిన్‌లు, ఎన్ఎస్ఏ అంతర్గత నెట్‌వర్క్ కూడా వేర్వేరు సాంకేతిక కారణాలు, అప్‌డేట్‌ల వల్ల తాత్కాలికంగా ఆగిపోయాయి. అయితే వీటన్నింటికీ సైబర్ దాడులు కారణమని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని ప్రభుత్వం, ఆయా సంస్థలు క్లారిటీ ఇచ్చాయి.

ALSO READ : సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మోసాల కట్టడికి.. కర్ణాటకతో కాయిన్ డీసీఎక్స్ ఒప్పందం

ఏఐ యుగంలో సైబర్ భద్రత ఇప్పుడు ఒక పెద్ద పిల్లి-ఎలుక ఆటలా మారింది. ఏఐ ద్వారా కొత్త లోపాలను వేగంగా గుర్తిస్తున్న కొద్దీ.. వాటిని సరిదిద్దడానికి సంస్థలు పరుగులు తీస్తున్నాయి. ఈ హడావిడిలో చేసే ప్యాచ్‌లు, అప్‌డేట్‌లే కొన్నిసార్లు ఇలాంటి ఊహించని సాంకేతిక లోపాలకు దారితీస్తున్నాయి. ఎవరు దాడి చేసినా, ఏ బగ్ మొరాయించినా, డిజిటల్ ప్రపంచం ఎంత సున్నితమైనదో ఈ ఘటనలు కళ్లకు కడుతున్నాయి.