వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి కాన్వాయ్‌పై రాళ్లు, కర్రలతో దాడి

వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి కాన్వాయ్‌పై రాళ్లు, కర్రలతో దాడి

పులివెందుల: కడప జిల్లా సింహాద్రిపురంలో కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి జరిగింది. వైసీపీ అభ్యర్థులకు మద్దతుగా నామినేషన్ల దాఖలుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. రాళ్లు, కర్రలతో దాడి చేసినట్లు వీడియోల్లో స్పష్టంగా కనిపించింది. పెట్రోల్ బాంబులు కూడా విసిరారు. అంకాలమ్మగూడూరు సమీపంలో ఈ ఘటన జరిగింది. టీడీపీ మద్దతుదారులు, బీటెక్ రవి అనుచరులు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై రాళ్లు, కర్రలతో దాడి చేశారు.

ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సమయంలో జరిగిన ఈ హింసాత్మక ఘటనతో సింహాద్రిపురం ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటనపై అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తనపై దాడి జరిగిందని, నామినేషన్‌ కోసం కేవలం ఐదు వాహనాలతోనే వెళ్లానని చెప్పారు. సీఐ, ఎస్‌ఐకు సమాచారం ఇచ్చానని, బీటెక్‌ రవి ఆధ్వర్యంలోనే దాడులు జరిగాయని ఆరోపించారు.

పెట్రోల్‌ బాంబులతో దాడికి తెగబడ్డారని, పోలీసుల సమక్షంలోనే దాడులు జరిగాయని చెప్పారు. నామినేషన్ల కోసం వెళ్తే తమను అడ్డుకున్నారని, అభ్యర్థులను, తనను అడ్డుకుని దాడులు చేశారని తెలిపారు. తమపై దాడులు జరుగుతున్నా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని, బాధితులపైనే కేసులు పెడుతున్నారని ఎంపీ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్నికల సంఘం ఉందా? లేదా? అని అవినాష్ రెడ్డి విస్మయం వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నా పోలీసులు పట్టించుకోవడం లేదని, పోలీసులు ఎంత దారుణంగా ఉన్నారో ప్రతీ ఒక్కరూ ఆలోచించండని అవినాష్ రెడ్డి వ్యాఖ్యానించారు.