రేవంత్ ప్రస్టేషన్‌లో బూతులు మాట్లాడుతుండు..తెలంగాణకు ద్రోహం చేస్తుండు: హరీశ్ రావు

 రేవంత్  ప్రస్టేషన్‌లో బూతులు మాట్లాడుతుండు..తెలంగాణకు ద్రోహం చేస్తుండు: హరీశ్ రావు

సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి ప్రస్టేషన్‌లో మాట్లాడుతున్నారని, తెలంగాణ సాగునీటి హక్కులను ఆంధ్రప్రదేశ్‌కు దారపోస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి సిద్ధిపేట పర్యటనలో ప్రజలకు ఉపయోగపడే అంశాలపై మాట్లాడకుండా, కేవలం విమర్శలు, తిట్లకే పరిమితమయ్యారని మండిపడ్డారు.

నీళ్ల మంత్రి సొంత జిల్లాల్లోనే అన్యాయం జరుగుతోందని హరీశ్ రావు విమర్శించారు. గోదావరి-బనకచర్ల అంశాన్ని కూడా తామే బయటపెట్టామని వెల్లడించారు. కాంగ్రెస్ హయాంలోనే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు బొక్క పెట్టారని, అప్పట్లో గోదావరి నీటిని, ఇప్పుడు కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోతోందని ఆరోపించారు.

తెలంగాణకు ద్రోహం చేయడమే సీఎం రేవంత్ రెడ్డి విధానంగా మారిందని హరీశ్ రావు ధ్వజమెత్తారు. రేవంత్ పాలనలోనే కృష్ణా నీటి దోపిడీకి బీజం పడిందని విమర్శించారు. పాలమూరు బిడ్డగా చెప్పుకునే ముఖ్యమంత్రి ఆ జిల్లాకు ఏం చేశారని ప్రశ్నించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా కోసం మాజీ సీఎం కేసీఆర్ ఢిల్లీలో పోరాడారని గుర్తుచేశారు.

సిద్ధిపేట పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ గడ్డం, తన ఎత్తు గురించి మాట్లాడటం తప్ప ప్రజా సమస్యలపై ఏమీ మాట్లాడలేదని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. అబద్ధాలు చెప్పడంలో రేవంత్ రెడ్డికి ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ALSO READ : యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ కు మాతృవియోగం

కాంగ్రెస్ నేతల వైఖరి వల్లే తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆరోపించిన హరీశ్ రావు.. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడతామని స్పష్టం చేశారు. తెలంగాణ సాగునీటి హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.