అతనో పోలీస్ ఉన్నతాధికారి.. దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ(సీబీఐ) అధికారి.. ఎన్నో కేసులకు పరిష్కారం చూపిన వ్యక్తి. కాని ఇప్పుడు కాళ్లకు చెప్పులు లేవు.. పడుకోవడానికి చాప లేదు.. అయినా ధ్యానం, ప్రార్థన, మిగిలిపోయిన ఆహారంతో ఆకలి తీర్చుకుంటూ సాధారణ జీవితం..పర్వత ప్రాంతంలోని సాధువుల సాంగత్యం.. ప్రకృతితో మమేకం..ప్రస్తుతం దట్టమైన అడవిలోని గుహల్లో నివసిస్తూ, కట్టెల పొయ్యిపై వంట చేసుకుంటూ, ధ్యానంలో కాలం గడుపుతున్నారు. సీబీఐ అధికారి ఏంటీ ఇలా గడపమేంటీ..? పేరు చెప్పడానికి ఇష్టపడని సీబీఐ సబ్ ఇన్ స్పెక్టర్ కథ ఏంటే తెలుసుకుందాం..
ఒకప్పుడు చేతిలో అధికారం.. సమాజంలో హోదా.. మంచి జీతం.. కారు, ఇల్లు.. ఇలా ఒక మనిషి కోరుకునే సకల సౌకర్యాలు ఆయన సొంతం. దేశంలోని అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐలో ఇన్స్పెక్టర్గా పనిచేసిన వ్యక్తి. కానీ అవన్నీ ఉన్నా ఆయన మనసులో ఏదో తెలియని వెలితి! అందుకే చివరికి ఉద్యోగాన్ని, ఆస్తులను, విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి అడవిలో సన్యాసిగా మారిపోయారు. అసలు ఆయనకు ఏమైంది? ఎందుకీ నిర్ణయం తీసుకున్నారు?
అన్నీ ఉన్నా.. ఏదో తెలియని అసంతృప్తి
పేరు చెప్పడానికి ఇష్టపడని సన్యాసిగా మారిన అతను..సీబీఐ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం సాధించినప్పుడు జీవితంలో అన్నీ సాధించానని భావించారట. కానీ విధి నిర్వహణలో భాగంగా ప్రజలతో కఠినంగా వ్యవహరించాల్సి రావడం, వ్యవస్థలోని ఒత్తిళ్లు ఆయనను అంతర్మథనానికి గురిచేశాయట.. కారు, ఇల్లు, డబ్బు ఉన్నా మనసుకు కావాల్సిన స్వేచ్ఛ, ప్రశాంతత లేవని గుర్తించి ఒకరోజు తన వృత్తి జీవితానికి స్వస్తి చెప్పి ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారట.
నర్మదా తీరంలో మొదలైన కొత్త జీవితం!
దేశంలోని అనేక ప్రాంతాల్లో తిరుగుతూ చివరకు ఓంకారేశ్వర్ సమీపంలోని నర్మదా నది తీరానికి చేరుకున్నారు. అక్కడి ప్రకృతి, ఆధ్యాత్మిక వాతావరణం అతనిలో కొత్త ఆలోచనలకు బీజం వేసింది. చెప్పులు లేవు.. పడుకోవడానికి చాప లేదు.. అయినా ధ్యానం, ప్రార్థన, నర్మదా పరిక్రమ కొనసాగించారు. మిగిలిపోయిన ఆహారంతో ఆకలి తీర్చుకుంటూ సాధారణ జీవితానికి అలవాటు పడ్డారు. కొంతకాలం పర్వత ప్రాంతంలోని ఆలయం వద్ద సాధువుల సాంగత్యంలో గడిపారు. గ్రామీణ పిల్లలకు ప్రకృతితో మమేకమై జీవించడం నేర్పించారు. ప్రస్తుతం దట్టమైన అడవిలోని గుహల్లో నివసిస్తూ, కట్టెల పొయ్యిపై వంట చేసుకుంటూ, ధ్యానంలో కాలం గడుపుతున్నారు.
సమాజానికి ఆయన చెప్పాలనుకున్న సందేశం ఏంటి?
ఆయన చెప్పిన మాటల్లో మరో ఆసక్తికరమైన అంశం ఉంది. అవినీతి కేవలం ప్రభుత్వ కార్యాలయాల్లోనే మొదలవదని, మన ఇళ్ల నుంచే ప్రారంభమవుతుందని చెబుతున్నారు. తల్లిదండ్రులు పిల్లలను ఇతరుల సంపదతో పోల్చడం, ఎక్కువ డబ్బు సంపాదించడమే విజయమని నూరిపోసే ధోరణి మారాలంటున్నారు. పిల్లలను ఐఏఎస్, ఐపీఎస్లు, డాక్టర్లు, ఇంజినీర్లుగా తీర్చిదిద్దడం కంటే ముందు మంచి మనుషులుగా పెంచాలని చెబుతున్నారు.
ఆయన ప్రయాణం చెప్పే అసలు సందేశం ఒక్కటే.. జీవితంలో ఎంత సంపాదించామన్నది కాదు.. మనసులో ఎంత ప్రశాంతంగా ఉన్నామన్నదే అసలైన సంతృప్తి! సన్యాసం అంటే కేవలం కాషాయ వస్త్రాలు ధరించడం కాదు.. మనలోని స్వార్థాన్ని, అహంకారాన్ని వదిలి చిత్తశుద్ధితో జీవించడమేనని ఆయన మాటలు గుర్తుచేస్తున్నాయి.
