ఎర్రచందనం స్మగ్లింగ్.. అక్రమ వ్యాపారుల ధనదాహం.. అండర్‌కవర్ పోలీస్ ఆపరేషన్.. మరోవైపు ఫ్యామిలీ ఎమోషన్స్.. ఇలా యాక్షన్, ఎమోషన్‌ను కలిపి తెరకెక్కించిన క్రైమ్ డ్రామా 'ఓం'. ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు 'అమరన్' ఫేమ్ రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. ఇవాళ (నవంబర్ 20, 2026న) థియేటర్లలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాలతో తెరకెక్కిన ఓం ఎలా ఉంది? నిజ జీవిత ఘటనల స్ఫూర్తితో రూపొందిన ఈ కథ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..
కథేంటంటే?
తమిళనాడు–ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోని శేషాచలం అడవుల నేపథ్యంలో ఎర్రచందనం స్మగ్లింగ్ కథ సాగుతుంది. అంతర్జాతీయ స్మగ్లింగ్ నెట్వర్క్ అధినేత అబ్దుల్ హమీద్ (నసీరుద్దీన్ షా) తన అక్రమ సామ్రాజ్యాన్ని విస్తరిస్తుంటాడు. ఈ నెట్‌వర్క్‌కు శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనం సరఫరా చేసే కీలక వ్యక్తులుగా కార్తికేయన్ (మమ్ముట్టి), కడప గోవర్ధన్ రెడ్డి (శివాజీ రాజా) ఉంటారు. ఈ స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు చేసేందుకు పోలీస్ శాఖ 'ఆపరేషన్ మోల్' చేపడుతుంది. ఐపీఎస్ అధికారి నిత్యారెడ్డి (సాయి పల్లవి) నాయకత్వంలో జరిగే ఈ ఆపరేషన్‌లో అండర్‌కవర్ పోలీస్ పళనివేల్ (ధనుష్) కీలక బాధ్యత తీసుకుంటాడు. తిరు అనే పేరుతో కార్తికేయన్ దగ్గర చేరి, అతడి నమ్మకాన్ని సంపాదిస్తాడు. అయితే, తన అసలు వృత్తి గురించి భార్య రోజా (శ్రీలీల)కు కూడా చెప్పకుండా రహస్యంగా జీవిస్తుంటాడు. భర్త తనకు దూరంగా ఉండటంతో రోజా మానసికంగా కుంగిపోతుంది. మరోవైపు తిరు తండ్రి జీవితంలో చోటుచేసుకునే విషాద పరిణామం అతడిని మరింత సంక్లిష్ట పరిస్థితుల్లోకి నెడుతుంది. ఒకవైపు రహస్య పోలీస్ ఆపరేషన్, మరోవైపు స్మగ్లింగ్ మాఫియా, ఇంకోవైపు కుటుంబ బంధాలు.. వీటి మధ్య తిరు ప్రయాణం ఎలాంటి మలుపులు తిరిగింది? నిత్యారెడ్డి చేపట్టిన ఆపరేషన్ మోల్ విజయవంతమైందా? కార్తికేయన్ స్మగ్లింగ్ సామ్రాజ్యం ఎలా కుప్పకూలింది? అనేది తెరపై చూడాలి.
విశ్లేషణ:
మంచి, చెడుల మధ్య జరిగే పోరాటానికి కుటుంబ భావోద్వేగాలను జోడించి దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి 'ఓం' కథను రూపొందించారు. 2015 ఏప్రిల్ 7న తిరుపతి సమీపంలోని శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 20 మంది ఎర్రచందనం కూలీలు మరణించిన ఘటనను స్ఫూర్తిగా తీసుకుని కథను అల్లుకున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా వెనుక ఉన్న పెద్దల ధనదాహానికి అమాయక కూలీలు, వారి కుటుంబాలు ఎలా బలవుతున్నాయనే అంశాన్ని
ఎమోషనల్‌గా చూపించే ప్రయత్నం చేశారు. కథలోకి ఎక్కువ ఆలస్యం చేయకుండా దర్శకుడు నేరుగా వెళ్లిపోవడం సినిమాకు కలిసొచ్చింది. సాయి పల్లవి ఎంట్రీతో కథ ప్రారంభమై, ఆపరేషన్ మోల్ చుట్టూ కథనం వేగం పుంజుకుంటుంది. ధనుష్ ఎంట్రీ, అతడి అండర్‌కవర్ ఆపరేషన్‌కు సంబంధించిన సన్నివేశాలు ఆసక్తిని పెంచుతాయి. ముఖ్యంగా కార్తికేయన్ దగ్గర నమ్మకమైన వ్యక్తిగా తిరు మారే క్రమాన్ని దర్శకుడు చక్కగా తెరకెక్కించారు.
'పుష్ప' తరహా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యానికి, 'ధురంధర్' తరహా అండర్‌కవర్ ఆపరేషన్‌ను జోడించి దర్శకుడు కథను నడిపించారు. ఫస్టాఫ్‌లో ఎక్కువగా కథ, ఆపరేషన్, స్మగ్లింగ్ నెట్వర్క్ చుట్టూ కథనం సాగుతుంది. ధనుష్, మమ్ముట్టి మధ్య వచ్చే సన్నివేశాలు మంచి ఎలివేషన్‌ను అందిస్తాయి. ఇద్దరి మధ్య నడిచే నమ్మకం, అనుమానం, ఆధిపత్య పోరు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతుంది. ఇక ఇంటర్వెల్ ఎపిసోడ్ సినిమాలో మెయిన్ హైలెట్. ఎర్రచందనం పట్టుకునే క్రమంలో కమాండర్ నిత్యారెడ్డి, తిరు, కార్తికేయన్ మధ్య జరిగే యాక్షన్ సన్నివేశాలు ఉత్కంఠభరితంగా సాగుతాయి. ఈ సన్నివేశాల తర్వాత ధనుష్ తన తండ్రితో ఎదుర్కొనే ఎమోషనల్ ఎపిసోడ్ సెకండాఫ్‌పై మరింత ఆసక్తిని పెంచుతుంది.
అయితే సెకండాఫ్‌లో దర్శకుడు యాక్షన్, సస్పెన్స్ కంటే భావోద్వేగాలపై ఎక్కువ దృష్టి పెట్టారు. ముఖ్యంగా కుటుంబ సంబంధాలు, భర్త కోసం ఎదురుచూసే భార్య వేదన, తండ్రి కోల్పోయిన బాధ వంటి అంశాలను హృద్యంగా చూపించారు. 'అమరన్'లో సాయి పల్లవి పాత్ర ద్వారా ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేసిన రాజ్‌కుమార్ పెరియసామి, ఇందులో శ్రీలీల పాత్రతోనూ అదే ప్రయత్నం చేశారు. భర్త ఏం చేస్తున్నాడో తెలియక, అతడి ఎడబాటును తట్టుకోలేక ఇబ్బంది పడే భార్యగా శ్రీలీల చక్కగా నటించారు. క్లైమాక్స్‌లో భర్తను కోల్పోయిన గూడెం మహిళకు సంబంధించిన సన్నివేశాలతో ఎమోషనల్ ఎండ్ కార్డ్ ఇచ్చాడు. అక్రమ వ్యాపారాల వెనుక బలయ్యేది సామాన్యుల జీవితాలేననే విషయాన్ని మరోసారి గుర్తుచేశారు. అయితే, ఆసక్తికరమైన కథాంశం ఉన్నప్పటికీ సెకండాఫ్‌లో కొన్ని చోట్ల కథనం నెమ్మదిస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా సాగాల్సిన కథలో బలమైన ట్విస్టులు లేకపోవడం కొంత నిరాశ కలిగిస్తుంది. ముఖ్యంగా కథలోని కొన్ని కీలక మలుపులను ముందుగానే ఊహించే అవకాశం ఉండటం ఉత్కంఠను తగ్గిస్తుంది. రన్‌టైమ్ కూడా కాస్త ఎక్కువగా అనిపిస్తుంది. క్లైమాక్స్‌ను మరింత బలంగా తీర్చిదిద్ది ఉంటే సినిమా స్థాయి మరో లెవల్లో ఉండేది..
నటీనటుల పెర్ఫార్మెన్స్:
తిరు పాత్రలో ధనుష్ అద్భుతంగా నటించాడు. అండర్‌కవర్ పోలీస్‌గా యాక్షన్ సీన్స్‌లోనూ, కుటుంబ భావోద్వేగాల్లోనూ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా మమ్ముట్టితో సన్నివేశాలు, తండ్రితో వచ్చే ఎమోషనల్ సీన్లో మెప్పించాడు. కార్తికేయన్‌గా తన గంభీరమైన నటనతో మమ్ముట్టి ఇంపాక్ట్ చూపించాడు. ఐపీఎస్ నిత్యారెడ్డి పాత్రలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా సాయి పల్లవి తన నటనతో మెప్పించింది. యాక్షన్, ఎమోషనల్ సీన్స్‌లోనూ ఆకట్టుకుంది. రోజా పాత్రలో శ్రీలీల ఎమోషనల్ పాత్రలో నటించింది. డ్యాన్స్, గ్లామర్ పక్కనపెట్టి భర్త కోసం ఎదురుచూసే భార్యగా తన నటనతో మెప్పించింది. నసీరుద్దీన్ షా విలనిజం పవర్ ఫుల్ గా ఉండాల్సింది. ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ నెట్ వర్క్ డాన్ గా ఉండే ఆ వెరసీ మిస్ అయింది.. శివాజీ రాజా, చైతన్య జొన్నలగడ్డ వంటి తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నీకల్ అంశాలు:
సాయి అభ్యంకర్ సంగీతం, నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. ముఖ్యంగా ఫారెస్ట్ ఫైట్ సీన్స్, ఇంటర్వెల్ ఎపిసోడ్లో బీజీఎం ఆకట్టుకుంటుంది. శేషాచలం అడవుల విజువల్స్, యాక్షన్ కొరియోగ్రఫీ బాగున్నాయి. డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియార్ సామి మరోసారి రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని ఓం తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు. అయితే సెకండాఫ్‌లో ఇంకాస్తా తన పెన్నుకీ పదును పెట్టి, సినిమా మరింత మెరుగ్గా ఉండేది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి..
