జొమాటోలో ఫుడ్ ఆర్డర్: ఫ్యాకింగ్ ఛార్జీలు వసూలుపై రెస్టారెంట్‌కు రూ.10 వేలు ఫైన్

జొమాటోలో ఫుడ్ ఆర్డర్: ఫ్యాకింగ్ ఛార్జీలు వసూలుపై రెస్టారెంట్‌కు రూ.10 వేలు ఫైన్

బిర్యానీ ఆర్డర్‌పై రూ.15 ప్యాకింగ్ ఛార్జీ వసూలు చేసినందుకు ఒక రెస్టారెంట్‌కు భారీ జరిమానా పడింది. ఎందుకంటే ప్యాకింగ్ కవర్లపై తమ సొంత బ్రాండ్ లోగో, పేరును ముద్రించి.. దానికి వినియోగదారుడి నుంచి డబ్బులు వసూలు చేయడం అన్యాయమైన వాణిజ్య పద్ధతని బెంగళూరు కన్జూమర్ కమిషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు బాధితుడికి రూ.5వేలు పరిహారం చెల్లించడంతో పాటు, మరో రూ.5వేలను వినియోగదారుల న్యాయ సహాయ ఖాతాలో జమ చేయాలని ఆదేశించింది.

అసలేం జరిగిందంటే..?
బెంగళూరుకు చెందిన ఒక కస్టమర్ 2026 మే 8న జొమాటో యాప్ ద్వారా ఒక రెస్టారెంట్‌లో పనీర్ బిర్యానీ ఆర్డర్ చేశారు. ఆ సమయంలో బిర్యానీ ధర రూ.435 ఉండగా.. రెస్టారెంట్ ప్యాకింగ్ ఛార్జీల కింద అదనంగా రూ.15 వసూలు చేశారు. దీనికి జీఎస్‌టీ కూడా తోడవడంతో ప్యాకింగ్ కోసం మొత్తం రూ.15.75 చెల్లించాల్సి వచ్చింది. అయితే ఇంటికి వచ్చిన పార్శిల్ కవర్లు, క్యారీ బ్యాగులపై రెస్టారెంట్ పేరు, లోగో, వారి ఇతర బ్లాంచ్ వివరాలు ఉండటాన్ని బాధితుడు గమనించారు. 

ప్రచారం కోసం కస్టమర్ డబ్బేంటి?
తన నుంచి ప్యాకింగ్ ఛార్జీలు వసూలు చేస్తూ.. అదే మెటీరియల్‌ను తన బ్రాండ్ ప్రచారం కోసం రెస్టారెంట్ వాడుకోవడాన్ని కస్టమర్ ఆక్షేపించారు. వినియోగదారుల నుంచి డబ్బులు తీసుకుంటూ కంపెనీ తన మార్కెటింగ్ కోసం ఆ కవర్లను వాడుకోవడం సరికాదని వాదించారు. దీనిపై రెస్టారెంట్ యాజమాన్యానికి, డెలివరీ ప్లాట్‌ఫామ్‌కు ఈమెయిల్ పంపినా స్పందన రాలేదు. ఆ తర్వాత ఆగస్టు 5న లీగల్ నోటీసు పంపి.. చివరికి వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. 

కోర్టు విచారణలో ఏమైంది?
బెంగళూరు 4వ అదనపు జిల్లా వినియోగదారుల కమిషన్ ఈ కేసును విచారించింది. అయితే రెస్టారెంట్ తరపున ఎవరూ హాజరుకాకపోవడంతో కమిషన్ ఏకపక్షంగా ఉత్తర్వులు జారీ చేసింది. కస్టమర్ సమర్పించిన ఇన్వాయిస్, ప్యాకింగ్ కవర్ల ఫోటోలను కమిషన్ పరిశీలించింది. గతంలో బాటా కంపెనీకి సంబంధించిన ఒక కేసులో జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్(NCDRC) ఇచ్చిన తీర్పును ఇక్కడ ప్రస్తావించింది. బ్రాండ్ లోగో ఉన్న క్యారీ బ్యాగులకు డబ్బులు వసూలు చేయడం చట్టవిరుద్ధమని ఆ తీర్పులో పేర్కొన్నారు.

ALSO READ : బర్గర్ కింగ్, స్విగ్గీకి రూ. 72 వేల జరిమానా విధించిన కోర్టు

రెస్టారెంట్ కేవలం ప్యాకింగ్ కోసమే ఛార్జీ వసూలు చేయాలనుకుంటే.. బ్రాండ్ లోగో లేని సాదా కవర్లను వాడాల్సి ఉంటుందని కమిషన్ అభిప్రాయపడింది. కస్టమర్ డబ్బుతో తన సొంత బ్రాండ్‌ను ప్రచారం చేసుకోవడం సేవా లోపమేనని నిర్ధారించింది. బాధితుడు మొదట ఫిర్యాదు చేసినప్పుడు స్పందించకపోవడం కూడా రెస్టారెంట్ తప్పేనని పేర్కొంది. ఈ ఆదేశాలను 45 రోజుల్లోగా అమలు చేయాలని, ఒకవేళ ఆలస్యమైతే మొత్తం సొమ్ముపై 8 శాతం వడ్డీ చెల్లించాలని రెస్టారెంట్‌ను కమిషన్ ఆదేశించింది.