బైక్ ట్యాక్సీలు నడిపేవారికి గుడ్ న్యూస్..! రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం కీలక సూచన..!

బైక్ ట్యాక్సీలు నడిపేవారికి గుడ్ న్యూస్..! రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం కీలక సూచన..!

ప్రైవేట్ ద్విచక్ర వాహనాలను కూడా బైక్ టాక్సీలుగా ఉపయోగించుకునేలా రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. ర్యాపిడో, ఉబర్, ఓలా వంటి అగ్రిగేటర్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా వీటిని నడుపుకోవచ్చని ఆయన సూచించారు. దీనివల్ల దేశవ్యాప్తంగా లక్షలాది మంది బైక్ యజమానులకు అదనపు ఆదాయం లభించడమే కాకుండా, ప్రయాణికులకు తక్కువ ఖర్చుతో కూడిన రవాణా సదుపాయం లభిస్తుందని నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు.

కేంద్ర ప్రభుత్వం జూలై 2025లో విడుదల చేసిన 'మోటార్ వెహికల్ అగ్రిగేటర్ మార్గదర్శకాలను తక్షణమే అమలు చేయాలని రాష్ట్ర రవాణా అధికారులను కోరారు నితిన్ గడ్కరీ. ప్రైవేట్, నాన్-ట్రాన్స్‌పోర్ట్ మోటార్ సైకిళ్లను అగ్రిగేటర్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ప్రయాణికుల రవాణాకు అనుమతించే అధికారం ఈ మార్గదర్శకాల ద్వారా రాష్ట్రాలకు లభిస్తుంది.

ప్రస్తుతానికి రాజస్థాన్ మాత్రమే ఈ మార్గదర్శకాలను పూర్తిస్థాయిలో అమలు చేసిందని తెలిపారు నితిన్ గడ్కరీ. హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు పాక్షికంగా అమలు చేస్తున్నాయని చెప్పారు. ఈ విషయంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ అన్ని రాష్ట్రాల రవాణా కమిషనర్లతో మాట్లాడానని, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు కూడా రాశానని గడ్కరీ వెల్లడించారు.

భారతదేశంలో ర్యాపిడో, ఉబర్ వంటి సంస్థలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు రెగ్యులేటరీ సమస్యలు. ప్రైవేట్ నంబర్ ప్లేట్ వాహనాలను కమర్షియల్ ప్రయోజనాల కోసం ఉపయోగించడంపై అధికారులకు, ఆపరేటర్లకు మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కర్ణాటకలో బైక్ టాక్సీలపై ఆంక్షలు, నిరసనలు వ్యక్తమయ్యాయి. కేంద్ర మార్గదర్శకాల అమలుతో ఈ చట్టపరమైన సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు.

నిరుద్యోగం, పేదరికాన్ని తగ్గించడంలో ఈ నిర్ణయం తోడ్పడుతుందని గడ్కరీ వాదించారు. "సొంతంగా బైక్ ఉన్నవారు గౌరవప్రదంగా జీవించడానికి, ఉపాధి పొందేందుకు మనం ఎందుకు అవకాశం కల్పించకూడదు?" అని ఆయన ప్రశ్నించారు. ఈ విధానం ద్వారా దేశవ్యాప్తంగా 15 నుంచి 20 కోట్ల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తే కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ALSO READ : జొమాటోలో ఫుడ్ ఆర్డర్: ఫ్యాకింగ్ ఛార్జీలు వసూలుపై రెస్టారెంట్‌కు రూ.10 వేలు ఫైన్

మోటార్ వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 67(3) ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ బైక్‌లను రవాణా సేవలకు అనుమతించవచ్చు. దీనివల్ల రవాణా ఖర్చులు తగ్గడంతో పాటు ట్రాఫిక్ రద్దీ, కాలుష్యం తగ్గే అవకాశం ఉందని కేంద్రం తన గైడ్‌లైన్స్‌లో పేర్కొంది. అయితే, కేంద్రం ఫ్రేమ్‌వర్క్ సిద్ధం చేసినప్పటికీ, తుది నిర్ణయం మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలదేనని మంత్రి స్పష్టం చేశారు. ప్రయాణికుల భద్రత, డ్రైవర్ల సంక్షేమానికి ఈ గైడ్‌లైన్స్‌లో ప్రాధాన్యతనిచ్చారు.

2020లో కేంద్రం మొదటిసారి అగ్రిగేటర్ మార్గదర్శకాలను తీసుకొచ్చింది. మారుతున్న రవాణా అవసరాలు, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడంతో 2025లో ఈ నిబంధనలను సవరించారు. రాష్ట్రాలు సానుకూలంగా స్పందిస్తే, సామాన్యులకు రవాణా మరింత సులభతరం కావడంతో పాటు ఆదాయ మార్గాలు పెరుగుతాయని గడ్కరీ పేర్కొన్నారు.