శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు కేరళ ప్రభుత్వం గుడ్ న్యూస్ . అయ్యప్ప భక్తుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు తిరువనంతపురం, కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచి నేరుగా పంబకు ఏసీ బస్సు సర్వీసులను ప్రారంభించింది. కేరళ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి సి.పి. జాన్ ఈ ప్రత్యేక సర్వీసులను ప్రకటించారు. విమానాల్లో వచ్చే అయ్యప్ప భక్తులతో పాటు సాధారణ ప్రయాణికులు కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు.
ఏసీ బస్సు సర్వీసులు ప్రారంభం
తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పంబకు వెళ్లే తొలి ఏసీ బస్సు సర్వీసును మంత్రి గురువారం రాత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నుంచి విమానాల్లో వచ్చిన అయ్యప్ప భక్తులకు ఆయన స్వాగతం పలికారు. కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (KSRTC) ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక బస్సులు నడవనున్నాయి.
టికెట్ ధరలు, బస్సుల సమయాలు
- విమానాశ్రయాల నుంచి పంబకు వెళ్లే ఏసీ బస్సులకు KSRTC టికెట్ ధరలను ఖరారు చేసింది.
- తిరువనంతపురం విమానాశ్రయం నుంచి పంబ: రూ.340
- కొచ్చి (నెడుంబస్సేరి) విమానాశ్రయం నుంచి పంబ: రూ.380
బస్సుల షెడ్యూల్ వివరాలు
- తిరువనంతపురం ఎయిర్‌పోర్ట్ నుంచి రాత్రి 9:30 గంటలకు బస్సు బయలుదేరుతుంది.
- కొచ్చి ఎయిర్‌పోర్ట్ నుంచి రాత్రి 8:30 గంటలకు బస్సు ప్రారంభమవుతుంది.
- రెండు ప్రాంతాల నుంచి బయలుదేరిన బస్సులు మరుసటి రోజు సాయంత్రం 7 గంటలకు తిరిగి విమానాశ్రయాలకు చేరుకునేలా షెడ్యూల్ రూపొందించారు.
- మండల-మకరవిళక్కు యాత్ర సీజన్ ముగిసే వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. భక్తుల రద్దీని బట్టి అదనపు బస్సులను కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు.
ఇళ్ల నుంచే పంబకు వెళ్లేలా చార్టర్డ్ బస్సులు
భక్తుల సౌకర్యార్థం KSRTC మరో ప్రత్యేక ఏర్పాటును కూడా అందుబాటులోకి తెచ్చింది. భక్తులు తమ నివాస ప్రాంతాలు లేదా స్థానిక దేవాలయాల నుంచే నేరుగా పంబకు వెళ్లేందుకు చార్టర్డ్ బస్సు సర్వీసులను ప్రవేశపెట్టింది.
భక్తులు తమ ఇళ్ల వద్ద లేదా ఆలయాల వద్ద ఇరుముడి కట్టుకున్న తర్వాత అక్కడి నుంచే బస్సు ఎక్కవచ్చు. దీనివల్ల సామాన్లతో బస్టాండ్లకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. వ్యక్తులు, కుటుంబాలు, సంఘాలు, ఇతర భక్త బృందాలు ముందుగానే ఈ బస్సులను బుక్ చేసుకోవచ్చు.
భక్తుల సంఖ్య, బయలుదేరే ప్రాంతం, ప్రయాణ తేదీ, సమయాన్ని బట్టి KSRTC ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తుంది. దర్శనం పూర్తయిన తర్వాత అదే బస్సులో తిరిగి స్వస్థలాలకు చేరుకునే వెసులుబాటు కూడా కల్పిస్తోంది.
ఆన్‌లైన్‌లో టికెట్ల బుకింగ్
ఈ ప్రత్యేక బస్సుల టికెట్లను KSRTC అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా విమాన టికెట్లను బుక్ చేసే పోర్టల్స్‌లోనూ KSRTC బస్సు రిజర్వేషన్ లింకులను అందుబాటులో ఉంచారు. దీంతో విమాన ప్రయాణికులు తమ ఫ్లైట్ టికెట్‌తో పాటే బస్సు సీట్లను కూడా రిజర్వ్ చేసుకోవచ్చు.
పలు నగరాల నుంచి విమానాల్లో వచ్చే అయ్యప్ప భక్తుల కోసం తిరువనంతపురం, కొచ్చి విమానాశ్రయాల్లో ప్రత్యేక విశ్రాంతి గదులను కూడా ఏర్పాటు చేశారు. భక్తులు తమ బస్సు బయలుదేరే సమయం వరకు అక్కడ సేదతీరవచ్చు. శబరిమల యాత్రికులకు ప్రయాణ సమయంలో ఇబ్బందులు కలగకుండా రవాణా, బస, బస్సు రిజర్వేషన్ వంటి సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కేరళ రవాణా శాఖ వెల్లడించింది.
