ట్రంప్ ఆహ్వానాన్ని పట్టించుకోని కిమ్.. ఆసియా పర్యటనలో ఇద్దరి భేటీ ఎందుకు జరగలేదు?

ట్రంప్ ఆహ్వానాన్ని పట్టించుకోని కిమ్.. ఆసియా పర్యటనలో ఇద్దరి భేటీ ఎందుకు జరగలేదు?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కలుస్తారని భారీగా ప్రచారం జరిగినప్పటికీ.. ఈ వారం ఆసియా పర్యటనలో వీరిద్దరూ కలవకుండానే ట్రంప్ వాషింగ్టన్‌కు తిరిగి వెళ్లిపోయారు. చైనా, రష్యా అధ్యక్షులతో కీలక త్రైపాక్షిక భేటీ తర్వాత గురువారం ఆసియా నుంచి బయలుదేరిన ట్రంప్, కిమ్‌ను కలవలేకపోవడానికి షెడ్యూల్ బిజీ కారణమని చెప్పినా, అసలు కారణాలు మాత్రం భిన్నంగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకప్పుడు మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 3 సార్లు కలిసిన ట్రంప్.. ఇప్పుడు మళ్లీ చర్చల కోసం తలుపు తట్టినా నార్త్ కొరియా నుంచి స్పందన కరవైందట.

2019 హనోయ్ శిఖరాగ్ర సదస్సు విఫలమైనప్పటి నుంచి కిమ్ ఆలోచనల్లో స్పష్టమైన మార్పు వచ్చిందని నిపుణులు అంటున్నారు. ట్రంప్‌తో వ్యక్తిగత సాన్నిహిత్యం ఉన్నా.. అధికారంలో ఏ పార్టీ ఉన్నా అమెరికాను నమ్మలేమని కిమ్ భావిస్తున్నారట. సరైన దౌత్య మార్గాలు, ముందస్తు చర్చలు లేకుండా.. కేవలం ట్రంప్ రాజకీయ విజయాలకు ఒక ఫోటో అవకాశంగా మారడానికి కిమ్ ఇష్టపడకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు దౌత్య నిపుణులు. ఉత్తర కొరియాను అణ్వాయుధ దేశంగా గుర్తించే దిశగా అమెరికా స్పష్టమైన అడుగులు వేయనిదే చర్చలకు ముందుకు వచ్చే అవకాశం లేనట్లు కనిపిస్తోంది.

ట్రంప్ పర్యటన వేళ కిమ్ ప్యోంగ్యాంగ్‌లో మౌనంగా ఉండకుండా.. స్కీ రిసార్ట్, పవిత్ర పర్వతం, ఆపై నేవీ యూనివర్సిటీ పర్యటనలతో బిజీగా ఉన్నట్లు ప్రభుత్వ మీడియా ప్రచారం చేయడం కూడా ఒక వ్యూహమేనని విశ్లేషకులు అంటున్నారు. ఉక్రెయిన్ యుద్ధ సహకారానికి బదులుగా రష్యా నుంచి ఆర్థిక, సైనిక మద్దతు, చైనాతో పెరుగుతున్న సహకారం, క్రిప్టో దొంగతనాలు వంటి మార్గాలతో నిధులు సమకూరుతుండటంతో అమెరికాతో చర్చల అవసరం కిమ్‌కు తగ్గిపోయింది. అయినప్పటికీ కిమ్ పూర్తిగా 'నో' చెప్పకపోవడంతో భవిష్యత్తులో వీరిద్దరూ కలిసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.