బాక్సాఫీస్ వద్ద కోట్లు వసూళ్లు చేసినా గుర్తింపులేదు.. బాలీవుడ్‌పై 'హనుమాన్ అంశ్' డైరెక్టర్ అసహనం!

బాక్సాఫీస్ వద్ద కోట్లు వసూళ్లు చేసినా గుర్తింపులేదు.. బాలీవుడ్‌పై 'హనుమాన్ అంశ్' డైరెక్టర్ అసహనం!

బాక్సాఫీస్ వద్ద సినిమా హిట్ కావాలంటే స్టార్ హీరో ఉండాలి... వందల కోట్ల బడ్జెట్ తో పాటు పేరున్న నిర్మాణ సంస్థ అండదండలు ఉండాలి.  కానీ ఇప్పటివరకు ఇండస్ట్రీలో బలంగా వినిపించిన ఈ లెక్కలన్నింటినీ తలకిందులు చేసింది ఓ చిన్న సినిమా.. అదే 'హనుమాన్ అంశ్' . ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలిబాబా జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని రికార్డులు సృష్టించింది. కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 452.86 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది.

అయితే ఇంతటి ఘన విజయం సాధించిన బాలీవుడ్ లోని పెద్ద నిర్మాణ సంస్థల నుంచి ఆశించిన స్థాయిలో ప్రశంసలు రాకపోవడం తనను ఆశ్చర్యపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు దర్శకుడు విశాల్ చతుర్వేది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన ఒక పెద్ద సినిమా విజయం సాధిస్తే నిర్మాణ సంస్థలు, ప్రముఖులు సోషల్ మీడియాలో అధికారిక ప్రకటనలు చేస్తుంటారని.. కానీ తొలి సినిమాతోనే ఇంతటి విజయాన్ని అందుకున్న తన చిత్రాన్ని మాత్రం పెద్ద సంస్థలు గుర్తించలేదని ఆయన అన్నారు. 

నటుడు వరుణ్ ధావన్, క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ వంటి ప్రముఖులు మాత్రం సినిమాను బహిరంగంగా ప్రశంసించారని విశాల్ చతుర్వేది తెలిపారు. చిన్న సినిమాల విజయాన్ని కూడా ఇండస్ట్రీ సెలబ్రేట్ చేసుకోవాలని అభిప్రాయపడ్డారు. అంతేకాదు.. సినిమా విజయానికి భారీ బడ్జెట్, స్టార్ హీరోలు మాత్రమే కారణం కాదని, ప్రేక్షకులకు నచ్చే కథ ఉంటే చిన్న చిత్రాలు కూడా అద్భుతాలు చేయగలవని విశాల్ స్పష్టం చేశారు. సినిమా బాగుందో లేదో నిర్ణయించేది ప్రేక్షకులేనని, విమర్శకులు , సోషల్ మీడియా కాదని స్పష్టం చేశారు.

మరోవైపు భారీ బడ్జెట్ సినిమాలపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు విశాల్. రూ.200 కోట్లతో సినిమా తీసి, కనీసం రూ.400 కోట్లు రాబట్టలేకపోతే ఫ్లాప్‌గా ముద్రపడుతుందని, అందుకే నిర్మాతలు పెట్టుబడి, రాబడి లెక్కలను ముందుగానే చూసుకోవాలని సూచించారు. నితీశ్ తివారీ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ 'రామాయణ' చిత్రాన్ని చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని, అయితే ఇంకా సమయం దొరకలేదని తెలిపారు.

ఇక 'హనుమాన్ అంశ్' సీక్వెల్‌పై కూడా ఆసక్తికర అప్‌డేట్ ఇచ్చారు. నిర్మాతల మధ్య నెలకొన్న విభేదాల కారణంగా రెండో భాగం ప్రస్తుతం నిలిచిపోయింది. నవంబర్ 27 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానున్న ఈ చిత్రానికి ఓటీటీలో ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలని విశాల్ అన్నారు. ఆ తర్వాతే సీక్వెల్‌పై తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. థియేటర్లలో సంచలనం సృష్టించిన ఈ చిన్న సినిమా ఓటీటీలోనూ అదే మ్యాజిక్ రిపీట్ చేస్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది...