వీఎస్ బాబుకు కన్నీటి వీడ్కోలు.. స్టాలిన్ ను ఓడించిన ఎమ్మెల్యే పాడే మోసిన సీఎం విజయ్..

వీఎస్ బాబుకు కన్నీటి వీడ్కోలు.. స్టాలిన్ ను ఓడించిన ఎమ్మెల్యే పాడే మోసిన సీఎం విజయ్..

చెన్నైలోని కోలాత్తూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వీఎస్ బాబు గురువారం ( నవంబర్ 19 ) కన్నుమూసిన సంగతి తెలిసిందే... గత కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన, చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తమిళనాడు సీఎం, టీవీకే అధినేత విజయ్ శుక్రవారం బాబు పార్థివ దేహానికి నివాళులర్పించారు. పెరంబూర్‌లో జరిగిన అంతిమ యాత్రలో పాల్గొన్న సీఎం విజయ్, ఇతర నేతలతో కలిసి బాబు పాడె మోశారు.

గత సెప్టెంబర్ నుంచి బాబు ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. "వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స అందించినప్పటికీ బాబు ఆరోగ్యం క్షీణించింది. గురువారం మధ్యాహ్నం 2:24 గంటలకు ఆయనకు గుండెపోటు రావడంతో మరణించారని మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ రాజేష్ అగర్వాల్ తెలిపారు.

2026 ఏప్రిల్‌లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో వీఎస్ బాబు సంచలన విజయం సాధించారు. కోలాత్తూర్ నియోజకవర్గంలో డీఎంకే అధ్యక్షుడు, మాజీ సీఎం స్టాలిన్‌ను ఓడించి బాబు వార్తల్లో నిలిచారు. ఈ ఎన్నికల ఫలితం ఆ సమయంలో పెద్ద చర్చకు దారితీసింది. బాబు మృతికి సంతాపంగా టీవీకే పార్టీ ఏడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా సంతాప దినాలను ప్రకటించింది. పార్టీ అధికారిక కార్యక్రమాలను రద్దు చేయడంతో పాటు, పార్టీ జెండాలను సగం వరకు ఎగురవేయాలని ఆదేశించింది.

పెరంబూర్‌లోని బాబు నివాసం దగ్గర ప్రజల రద్దీకి సరిపడా స్థలం లేకపోవడంతో, ఆయన పార్థివ దేహాన్ని సమీపంలోని ప్రైవేట్ స్పోర్ట్స్ గ్రౌండ్‌లో ఉంచారు. అక్కడ ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నివాళులర్పించారు. అంతిమ యాత్ర పెరంబూర్ నుంచి పల్లవన్ సాలై స్మశానవాటిక వరకు కొనసాగింది. అక్కడ బాబు అంత్యక్రియలు నిర్వహించారు.

ALSO READ : బైక్ ట్యాక్సీలు నడిపేవారికి గుడ్ న్యూస్..!

సీఎం విజయ్‌తో పాటు మంత్రులు ఆనంద్, ఆధవ్ అర్జున, వీసీకే అధినేత తొల్ తిరుమావళవన్ బాబుకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆరోగ్య శాఖ మంత్రి కేజీ అరుణ్‌రాజ్, విద్యాశాఖ మంత్రి ఏ రాజమోహన్, పర్యాటక శాఖ మంత్రి ఎస్ రాజేష్ కుమార్, టీవీకే ఎమ్మెల్యే కనిమొళి, పీఎంకే నేత జయరామన్ తదితరులు అంత్యక్రియలకు హాజరయ్యారు.