తాజ్‌మహల్ సందర్శనకు పాక్ మంత్రికి నో పర్మిషన్

తాజ్‌మహల్ సందర్శనకు పాక్ మంత్రికి నో పర్మిషన్

న్యూఢిల్లీ: షాంఘై సహకార సంస్థ (SCO) ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరుగుతున్న సివిలైజేషన్స్ డైలాగ్ ఫోరమ్‌కు హాజరైన పాకిస్థాన్ వాతావరణ మార్పుల శాఖ మంత్రి ముసాదిక్ మాలిక్‌కు భారత ప్రభుత్వం కీలక పరిమితులు విధించినట్లు సమాచారం. ఆగ్రాలోని ప్రపంచ ప్రఖ్యాత తాజ్‌మహల్, ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ దర్గాను సందర్శించాలని ఆయన కోరగా, అందుకు అనుమతి నిరాకరించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

సదస్సుకే వీసా

నవంబర్ 20 నుంచి 22 వరకు న్యూఢిల్లీలో జరిగే ఎస్‌సీఓ సివిలైజేషన్స్ డైలాగ్ ఫోరమ్‌లో పాల్గొనేందుకే ముసాదిక్ మాలిక్‌కు వీసా మంజూరు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు శుక్రవారం స్పష్టం చేశాయి. ఆయన పర్యటన కేవలం సదస్సుకే పరిమితమని, ఇతర పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు అనుమతి లేదని వివరించాయి. ఈ సదస్సులో పాకిస్థాన్ ప్రతినిధుల బృందానికి మాలిక్ నాయకత్వం వహిస్తున్నారు.

నాగరికతలపై చర్చలకు మంచి అవకాశం

భారత్‌కు చేరుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన ముసాదిక్ మాలిక్.. నాగరికతలపై బహుపాక్షిక చర్చలు జరిపేందుకు ఈ పర్యటన మంచి అవకాశమని  తెలిపారు. సంస్కృతులు, నాగరికతలు దేశాల సరిహద్దులకు అతీతమైనవని అన్నారు. ఇరు దేశాల చరిత్ర, భౌగోళిక పరిస్థితులు, సంస్కృతుల గురించి చర్చించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు.

ALSO READ : బైక్ ట్యాక్సీలు నడిపేవారికి గుడ్ న్యూస్..!

2026-27లో ఎస్‌సీఓ అధ్యక్ష బాధ్యతలు పాక్‌వే

ప్రస్తుతం 2026-27 కాలానికి పాకిస్థాన్ ఎస్‌సీఓ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ స్టేట్‌కు అధ్యక్షత వహిస్తోంది. ఈ బాధ్యతల్లో భాగంగా వచ్చే ఏడాది జరిగే శిఖరాగ్ర సదస్సుకు ముందు పలు మంత్రిత్వ స్థాయి సమావేశాలు, నిపుణుల కమిటీ భేటీలను నిర్వహించనుంది. సభ్యదేశాల మధ్య పరస్పర సహకారం, సాంస్కృతిక అనుసంధానాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా న్యూఢిల్లీలో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు.