కిడ్నీ ఇచ్చి భార్యకు ప్రోణం పోసిన భర్త : వాహనం ఢీకొని కళ్లెదుటే భార్య మరణం

కిడ్నీ ఇచ్చి భార్యకు ప్రోణం పోసిన భర్త : వాహనం ఢీకొని కళ్లెదుటే భార్య మరణం

ఎలా జరగాలి అని ఉంటే అలాగే జరుగుతుందని.. విధిరాతను ఎవరూ తప్పించలేరని ఈ ఘటన చూస్తే ఇట్టే తెలుస్తోంది. వాళ్లిద్దరూ భార్యభర్తలు. ఎంతో అన్యోన్యయంగా ఉంటారు. ఒకరు అంటే ఒకరికి ప్రాణం. ఈ క్రమంలోనే భార్యకు అనారోగ్యం. కిడ్నీ పాడైపోయింది. కిడ్నీ మారిస్తేనే బతుకుతుందని డాక్టర్లు చెప్పారు. అదృష్టం ఏంటంటే.. భర్త కిడ్నీనే సెట్ అయ్యింది. వెంటనే భర్త కిడ్నీ ఇచ్చాడు. భార్య బతికింది. అంతా హ్యాపీ అనుకున్నారు. భార్య బతికినందుకు గుడిలో పూజలు చేయించుకుని వస్తున్నారు. రోడ్డుపై ఓ కమర్షియల్ వాహనం ఢీకొని ఆ భర్త కళ్లేదుటే భార్య చనిపోయింది. ఈ ఇన్సిడెంట్ అందర్నీ కలిచివేస్తోంది. 

కిడ్నీ ఇచ్చి భార్యను బతికించుకుంటే.. రోడ్డు ప్రమాదంలో రూపంలో తీసుకెళ్లిపోయింది అంటూ ఆ భర్త రోదనలు అందర్నీ కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఈ ఇన్సిడెంట్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బెంగళూరులోని లగ్గెరె ప్రాంతానికి చెందిన వీణాబాయి (38), ఆమె భర్త శివాజీ రావుతో కలిసి గురువారం రాత్రి తుమకూరులోని సిద్ధగంగ మఠానికి వెళ్లారు. అక్కడ పూజలు ముగించుకుని తిరిగి వస్తుండగా, నెలమంగళ తాలూకాలోని యెడెహళ్లి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఒక గుర్తు తెలియని గూడ్స్ వాహనం వీరిని బలంగా ఢీకొట్టి ఆపకుండా వేగంగా వెళ్లిపోయింది. ఈ ఘటనలో వీణాబాయి అక్కడికక్కడే మృతి చెందారు.

శివాజీ రావు ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నారు. గత నాలుగైదేళ్లుగా వీణాబాయి తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దాదాపు ఆరేళ్ల క్రితం లో-బీపీ కారణంగా ఆమెకు రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి. భార్యను బతికించుకోవాలని నిర్ణయించుకున్న శివాజీ రావు, రెండేళ్ల క్రితం తన కిడ్నీలలో ఒకదానిని ఆమెకు దానం చేశారు. ఆ ఆపరేషన్ విజయవంతం కావడంతో వీణాబాయి కోలుకున్నారు.

ప్రాణాపాయం నుంచి బయటపడి కోలుకుంటున్నందుకు కృతజ్ఞతగా దైవదర్శనం చేసుకుని వస్తుండగా ఈ ప్రమాదం జరగడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. "ఆమె మళ్లీ ఆరోగ్యంగా ఉండాలని నా కిడ్నీ ఇచ్చాను. విధి ఆమెను నాకు కాకుండా చేసింది" అని శివాజీ రావు ఆవేదన వ్యక్తం చేశారు.

సమాచారం అందుకున్న నెలమంగళ ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెలమంగళ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై హిట్ అండ్ రన్ కేసు నమోదు చేశారు. నేషనల్ హైవేపై ఉన్న సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని, డ్రైవర్‌ను గుర్తించేందుకు దర్యాప్తు వేగవంతం చేసినట్లు పోలీసులు తెలిపారు.