రాయదుర్గంలో మెటా ఆఫీస్ దగ్గర యూత్ కాంగ్రెస్ ఆందోళన

రాయదుర్గంలో మెటా  ఆఫీస్ దగ్గర యూత్ కాంగ్రెస్ ఆందోళన

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఖాతా నుంచి ఓ పోస్టును తొలగించడాన్ని నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ నాయకులు రాయదుర్గం పరిధిలోని మెటా కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. సోషల్ మీడియా వేదికలు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయంటూ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో మెటా కార్యాలయం వైపు వెళ్లేందుకు యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనలో పాల్గొన్న దాదాపు 21 మంది యూత్ కాంగ్రెస్ నాయకులను రాయదుర్గం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం ఆందోళనకారులను రాయదుర్గం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు మెటా కార్యాలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఖాతా నుంచి పోస్టు తొలగింపు వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారగా, కంటెంట్ తొలగింపుపై కాంగ్రెస్ శ్రేణులు తమ నిరసనను వ్యక్తం చేశాయి. సోషల్ మీడియా వేదికల తీరుపై యూత్ కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.