బంపర్ అఫర్ అంటే ఇదే..! లక్ష మంది ఉద్యోగులకు బోనస్ ప్రకటించిన కంపెనీ..!

బంపర్ అఫర్ అంటే ఇదే..! లక్ష మంది ఉద్యోగులకు బోనస్ ప్రకటించిన కంపెనీ..!

సాధారణంగా అన్ని కంపెనీల్లో దసరా, దీపావళి పండగలకు బోనస్ లు, గిఫ్టులు ఇవ్వడం కామన్. కంపెనీ స్థాయి, లాభాలను బట్టి బోనస్, ఖరీదైన గిఫ్టులు ఇస్తుంటారు. ఓ కంపెనీ ఉద్యోగులకు ఐఫోన్లు గిఫ్ట్ ఇచ్చిన సందర్భాలు కూడా చూశాం. కానీ.. వేదాంత గ్రూప్ మాత్రం చైర్మెన్ గ్రాంట్ కింద వార్షిక వేతనంలో పది శాతం బోనస్ గా ఇచ్చింది.

గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ ప్రత్యేకంగా ప్రతిపాదించిన ‘చైర్మన్ గ్రాంట్’ కింద సుమారు లక్ష మంది ఉద్యోగులకు వారి వార్షిక వేతనంలో అదనంగా 10 శాతం మొత్తాన్ని అందజేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. పెరుగుతున్న లివింగ్ కాస్ట్ దృష్ట్యా ఉద్యోగులు, వారి కుటుంబాలకు అదనపు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని కంపెనీ తెలిపింది.

ఈ ప్రయోజనం ఎంట్రీ లెవల్ నుంచి మిడ్, సీనియర్ మేనేజ్మెంట్ స్థాయి ఉద్యోగులందరికీ వర్తిస్తుంది. అయితే, ఈ గ్రాంట్ పొందేందుకు ఉండాల్సిన గరిష్ట వార్షిక వేతన పరిమితిని కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. ఒక నిర్ణీత వేతన పరిమితి లోపు ఉన్న ఉద్యోగులందరికీ ఈ ప్యాకేజీ అందుతుందని సమాచారం.

సంస్థ సాధించిన వృద్ధిలో ఉద్యోగులను భాగస్వాములను చేయడం, వారి కృషిని గుర్తించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వేదాంత గ్రూప్ పేర్కొంది. కంపెనీలో ఇప్పటికే అమల్లో ఉన్న ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ (ESOPs) ప్రోగ్రామ్‌కు అదనంగా ఈ గ్రాంట్‌ను ప్రకటించారు. ప్రస్తుతం వేదాంత గ్రూప్ మొత్తం సిబ్బందిలో దాదాపు 40 శాతం మంది ఈ ఎసోప్ (ESOP) పరిధిలో ఉన్నారు. ఇందులో కొత్తగా చేరిన గ్రాడ్యుయేట్లు కూడా ఉండటం గమనార్హం.

గడిచిన ఐదేళ్లలో ఈ ఈసాప్ ప్రోగ్రామ్ ద్వారా ఉద్యోగులకు దాదాపు రూ.2వేల 500 కోట్ల వరకు ఆర్థిక ప్రయోజనం చేకూరినట్లు కంపెనీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో 'ESOP 2025' కింద పంపిణీ చేసిన రూ.500 కోట్ల విలువైన స్టాక్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. హోమ్ లోన్ రీపేమెంట్లు, ఆరోగ్య బీమా ఖర్చులు, పిల్లల విద్య, కుటుంబ శుభకార్యాల వంటి వ్యక్తిగత ఆర్థిక అవసరాలకు ఈ అదనపు నిధులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.