ప్రతీ ఫ్యామిలీకి రూ.5 లక్షల జీవిత బీమా.. డిసెంబర్ 18 వరకు నమోదు

 ప్రతీ ఫ్యామిలీకి రూ.5 లక్షల జీవిత బీమా.. డిసెంబర్ 18 వరకు నమోదు

హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు కార్యక్రమం హైదరాబాద్ జిల్లాలో ప్రారంభమైంది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, అర్హులైన ప్రతి కుటుంబం పథకంలో నమోదు చేసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలోనే తొలిసారిగా ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా కల్పించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. 18 నుంచి 54 ఏళ్ల వయస్సు కలిగిన అర్హులైన సంపాదనపరులకు ఈ బీమా వర్తిస్తుందని వెల్లడించారు. కులం, మతం, ఆదాయంతో సంబంధం లేకుండా నిర్దేశిత అర్హతలు కలిగిన వారికి పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు.

లబ్ధిదారులపై ప్రీమియం భారం లేదు

ఈ పథకానికి సంబంధించిన బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. లబ్ధిదారులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఒక కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది సంపాదనపరులు ఉన్నప్పటికీ అర్హతల మేరకు వారందరికీ బీమా పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది నామినీలను ఎంపిక చేసుకునే వెసులుబాటు కూడా కల్పించినట్లు వివరించారు.

డిసెంబర్ 18 వరకు నమోదు

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియ నవంబర్ 19 నుంచి డిసెంబర్ 18 వరకు కొనసాగనుంది. నమోదు సమయంలో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మొబైల్ నంబర్, నామినీ వివరాలను అందించాల్సి ఉంటుంది. హైదరాబాద్ జిల్లాలోని వార్డు కార్యాలయాలతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిబిరాల్లో అర్హులు తమ వివరాలను నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

హైదరాబాద్ జిల్లాలో 8.43 లక్షల ఆహార భద్రత కార్డులు

హైదరాబాద్ జిల్లాలో మొత్తం 8.43 లక్షల ఆహార భద్రత కార్డులు ఉండగా, వాటి పరిధిలో 32.29 లక్షల మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. జిల్లాలోని తొమ్మిది సర్కిళ్ల పరిధిలో విస్తృతంగా నమోదు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అర్హులైన ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని వినియోగించుకుని నమోదు చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.

సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాలను మంత్రి ఈ సందర్భంగా వివరించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.

మహిళా సంఘాలకు ఇప్పటివరకు రూ.79 వేల కోట్ల వడ్డీ లేని రుణాలను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ వైద్య చికిత్స పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినట్లు వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో రూ.1,000 కోట్లతో మౌలిక వసతుల అభివృద్ధి చేపట్టినట్లు తెలిపారు.

హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణాను మరింత మెరుగుపరిచేందుకు బస్సుల సంఖ్య పెంచడంతో పాటు త్వరలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు.నగరంలోని 150 డివిజన్లు, 15 నియోజకవర్గాల పరిధిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలకు చేరేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.